పండగ ప్రయాణ జాగ్రత్తలు పాటించండి

Jan 13,2024 10:40 #feature

ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగులూ, వ్యాపారులూ, కార్మికులూ కుటుంబ జీవనం కోసం పొట్టపోసుకునే రోజువారీ కూలీలతో అందరూ దూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఇంటిదారి పట్టేది సంక్రాంతిలోనే. అత్తారింటికి వెళ్లిన ఆడపడుచులు పిల్లాపాపలతో పుట్టినూరికి చేరేదే పండుగ రోజుల్లోనే. సెలవుల్లో తీరిక రోజుల్లో ఆ జ్ఞాపకాలను వల్లె వేసుకుంటూ పల్లెదారికి చేరే తరుణమిదే. పట్టణాల్లో, నగరాల్లో, దూరప్రాంతాల్లో నివాసముండే అత్యధిక జనం ఊరికి వచ్చే దృశ్యాలు గత కొన్నిరోజులుగా జాతీయ రహదారులపై ఉత్సవాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.

             సంక్రాంతి అంటేనే ఓ సంబరం.. పిండి వంటలు, బొమ్మల కొలువులు, చెరకు గడలు, కోడిపందేలు,ఎడ్ల పందేలు, తిరునాళ్లు, ఉత్సవాలు, భోగిమంటలు…ఇలా అన్నింటికీ ప్రతిరూపమే. భోగి… సంక్రాంతి.. కనుమగా మూడురోజులపాటు ఆనందోత్సాహాల మధ్య తెలుగు లోగిళ్లలో వైభవపేతంగా జరిగేది ఈ పండుగలోనే. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఈ పండుగకు సొంతూరు రావటం అదో ఆనందం.. సరికొత్త సరదా కూడా. తరాలు మారుతున్నా నేటికీ తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిరూపాలు పల్లెలే. ఎక్కడున్నా తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల్ని కలుసుకోవటానికి దోహదపడేది ఈ పండుగలోనే. చిన్నప్పుడు తల్లిదండ్రుల దీవెనలు, అమ్మమ్మ వాళ్ల ఇంట్లో సంబరాలు గుర్తొచ్చేదీ ఈ సందర్భంలోనే. ప్రపంచీకరణతో తెలుగు సంప్రదాయాలు కనుమరుగై టీవీ, కంప్యూటర్లకే పిల్లలకు అంకితమవుతున్న రోజుల్లోనూ వారిని మమతానుబంధాల వాకిట్లోకి తెచ్చేది కూడా ఇలాంటి పండుగ సమయాల్లోనే.

ముందస్తు ప్రణాళికతో ప్రయాణం సులభతరం

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న జనంతో రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాలు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. జనరల్‌ బోగీల నిండా జనమే జనం. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నా రద్దీ ఏమాత్రం తగ్గటం లేదు. బస్సుల పరిస్థితీ ఇంతే! బస్సులో సీటు దొరకటం కాదు కదా; బస్‌స్టేషన్లో కాలుమోపటం కూడా కష్టంగా ఉంది. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల టిక్కెట్‌ ధరలు ఏటేటా పెంచేసే ఆర్టీసీ ఈ ఏడాది రాష్ట్రప్రభుత్వ సూచనమేరకు ఎన్నికల సంవత్సరం కావటంతో ఈసారి సాధారణ ధరలనే వసూలు చేస్తుండటం ప్రయాణీకులకు కొంతమేర ఊరటే. ఇలాంటి రద్దీకాలంలో ముందస్తు ప్రణాళిక లేకుండా ఊరెళ్లటం కూడా సాహసమే అవుతుంది.

ఊరెళ్లేటప్పుడు …

  • ప్రయాణానికి ముందుగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనేది ధృవీకరించుకోవాలి
  • శరీర ఉష్ణోగ్రత, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. విలువైన బంగారం వస్తువులను బ్యాంకు లాకర్లలోనూ, బీరువాల్లో పెట్టుకోవటం ఉత్తమం.
  • ఇంటికి తాళాలు సరిగా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవాలి.ా పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.
  • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రయాణాలను మానుకోవటమే మేలు.
  • ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది.
  • పిల్లలకు కొత్త ఊరు, సరికొత్త వాతావరణం, కొంగొత్త అనుభవాలు వస్తాయి.
  • ఉన్నన్ని రోజులకు సరిపడా దుస్తులు బ్యాగ్‌లలో సర్దుకుని వెళ్లాలి.
  • ప్రకృతి, పర్యావరణంతో ఆహ్లాదాన్ని ఆనందించాలి.
  • మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలిమనోహరమైన దృశ్యాలను కెమెరా, సెల్‌ఫోన్లలో తీసి జ్ఞాపకాల కోసం భద్రపర్చుకోవచ్చు.
  • చుట్టాలను కలిసినప్పుడు మంచి అనుభూతిని పొందొచ్చు.
  • ప్రయాణంలో బయట తినాల్సివస్తే నాణ్యమైన వేడివేడి ఆహారపదార్థాలనే ఎంచుకోవాలి.
  • ప్రయాణాల్లో వసతులుండే ప్రాంతాల గురించి ముందుగానే తెలుసుకోవటం మంచిది
  • మార్గమధ్యలో చూడాల్సిన పర్యాటక, చారిత్రక ప్రదేశాలుంటే ముందుగానే బుక్‌ చేసుకోవాలి.
  • పాడవ్వని ఆహార పదార్థాలను తీసుకెళ్లటం మేలు
  • కెమెరాలు, బైనాక్యూలర్లు, స్మార్టు ఫోన్లు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి
  • ఫోన్‌తోపాటు ఛార్జరు, అదనపు బ్యాటరీ, పవర్‌ బ్యాంకులు తప్పనిసరిగా ఉంచుకోవాలి
  • తేలికపాటి, లోపల ఎక్కువ స్థలం ఉండే బ్యాగులు ఉత్తమం.
  • చలికాలంలో మరింత జాగ్రత్తలు 
  • అరేబియా మహాసముద్రంలో అల్పపీడన ప్రభావంతో పండుగ వరకూ వర్షాలు పడే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల వరకూ మంచుతెరలు తొలగని పరిస్థితి ఉంది. ఈ విపరీతమైన చలిలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు మేలు.
  • చలితో జలుబు, దగ్గు, విరోచనాలు సమస్యలపై అప్రమత్తత అవసరం.
  • మందులు ముందుగానే డాక్టర్‌ సలహా మేరకు వెంట తీసుకెళ్లాలి.
  • బస్సు ప్రయాణం పడని వారు రైలు ప్రయాణం లేదా సొంతవాహనం, ద్విచక్ర వాహనం మేలు.
  • కరోనాతో జాగ్రత్త సుమా…
  • ప్రయాణానికి ముందే ఆరోగ్యస్థితిపై మెడికల్‌ చెకప్‌ చేయించుకోవాలి.
  • అనారోగ్యంతో ఉంటే చలితో తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.
  • ఎక్కడకు వెళ్లినా కరోనా నిబంధనలు పాటించటం మేలు.
  • మాస్కు ధరించటం, వేడినీళ్లు తాగటం, సామాజిక దూరం వీలైనంత వరకూ పాటించటం మేలు.
  • శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలి.
  • అత్యవసర మందులు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.
  • పర్యాటక ప్రాంతాలకు వెళ్తే …
  • సాధారణంగా పిల్లలకు సెలవులు రావటంతో పెద్దలు కూడా తీరిక చేసుకుని పర్యాటక, చారిత్రమ ప్రదేశాలను సందర్శిస్తుంటారు.
  • యువత కొండలు, పర్వత ప్రాంతాలు, జలపాతాల వద్ద జాగ్రత్తలు పాటించాలి.
  • స్నేహితులు, కుటుంబ సభ్యులెవ్వరైనా ఒకరినొకరు గమనించుకోవాలి.
  • ప్రకృతి రమణీయతను ఆహ్వానించే వాతావరణం అలవర్చుకోవాలి.
  • హెచ్చరిక బోర్డులను గమనించి నిబంధనలు పాటించాలి.
➡️