కథ చెపుతాను ఊ కొడతావా !

Jan 10,2024 10:58 #Jeevana Stories

పిల్లలంతా బయట గోల గోలగా ఆడుకుంటు న్నారు. రుద్ర బుంగమూతి పెట్టుకుని వచ్చి పేదరాసి పెద్దమ్మ గుమ్మంలో కూర్చున్నాడు. ”నువ్వెందుకు ఆడుకోడానికి వెళ్ళలేదు?” అంది పెద్దమ్మ. ‘నాకు ఆడుకోవాలని లేదు’ అన్నాడు రుద్ర. ‘ఎందుకని?’ అడిగింది పెద్దమ్మ.’చెప్పిన మాట వినడం లేదని అమ్మ నన్ను తిట్టింది. అందుకే అలిగేను’ అని చెప్పాడు రుద్ర. ఇంట్లో వాళ్ల మాట వినకుండా ఎదురుచెప్పడం, చీటికీ మాటికీ విసుక్కోవడం, అలగడం రుద్రకి అలవాటని పెద్దమ్మకి తెలుసు. ఈ రోజు ఎలాగైనా రుద్రలో మార్పు తేవాలని మనసులో అనుకుంది పెద్దమ్మ. బుంగమూతి పెట్టుకుని కూర్చొన్న రుద్రతో ‘పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే. సరే రా! నీకో కథ చెప్తాను’ అంది పెద్దమ్మ. ‘పెద్దమ్మా కథ వింటే ఏమొస్తుంది?’ అన్నాడు అమాయకంగా. ‘కథ మన తెలివిని పెంచుతుంది. ఎవరితో ఎలా మెలగాలో చెప్తుంది’ అంటూ కథ చెప్పడం ప్రారంభించింది ఆమె.చామలాపల్లి గ్రామంలో వరహాలు అనే వ్యాపారి ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు కాంతయ్య, రెండోవాడు కనకయ్య. పెద్దవాడు తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. రెండోవాడు తండ్రి చేసే కిరాణా వ్యాపారం కాకుండా పట్నం వెళ్లి ఏదైనా కొత్త వ్యాపారం చేసి సొమ్ము గడించాలని ఆలోచించే వాడు. తండ్రి ఒకరోజు చిన్నకొడుకుని పిలిచి ‘నాయనా నామాట విను. తెలిసిన దారిలో వెళితే సుఖంగా గమ్యాన్ని చేరుకుంటాం, లేదంటే రాళ్ళు ముళ్ళు గుచ్చుకుని కష్టాలు పాలు అవకతప్పదు’ అని చెప్పాడు. తండ్రిమాట కనకయ్య చెవికెక్కలేదు. తన వాటా డబ్బు పట్టుకుని పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించాడు. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆకర్షణీయమైన పథకాలు పెట్టాడు. అయినా ఫలితం లేక పోయింది. వ్యాపారం దివాలా తీసింది. చేసేదేమీ లేక తండ్రి పంచన చేరాడు. నష్టపోయి ఇంటికొచ్చిన కొడుకుని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పాడు తండ్రి. ‘ఎగిరే గాలిపటానికి దారం ఆధారం అయినట్లు మా అనుభవాలు, ఆలోచనలే మీ పురోగతికి ఆధారం’ అని హితవు పలికాడు. తండ్రి మాటల్లోని మర్మం గ్రహించి అన్నకి చేదోడుగా ఉంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు’ అని పెద్దమ్మ కథ ముగించింది. పెద్దమ్మ కథలో నీతి రుద్రకు అర్థం కాకపోయినా, పెద్ద వాళ్ల మాట వినాలని మాత్రం మనసులో గట్టిగా నాటుకుపోయింది. ఆ రోజు నుండి ఇంట్లో అమ్మానాన్నకు ఎదురుచెప్పకుండా వాళ్ల మాటవింటూ బుద్ధిమంతుడిలా ఉన్నాడు.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు,94945 24445.

➡️