సంక్రాంతి స్వగతం!

jeevana story on sankranti festival
  • నేను సంక్రాంతిని. పాడిపంటలు ఇంటికొచ్చే వేళ … ప్రజల ముఖాల్లో వెల్లివిరిసే కళాకాంతిని. బతుకు దారిలో పట్నమెళ్లిన పిల్లాపాపలు సొంత ఊరికి తిరిగి వస్తే- అమ్మల, అమ్మమ్మల ముఖాల్లో వెలిగిపోయే మురిపెపు కాంతిని. ఇళ్లకు, ముంగిళ్లకు, మనసున మూల మూలకూ ఆనందపు వెలుగులు ప్రసరించే అచ్చమైన ప్రకృతి పర్వదినాన్ని. అందరూ బాగుంటే నేనూ బాగుండే పండగని. మీ అంతరంగపు ఆవిష్కారాన్ని. మీ సంతోషాలకు పండగ రూపాన్ని.

పిల్లల్లారా, పిల్లల గన్న తల్లుల్లారా…

అందరూ ఊరికి వచ్చేశారు కదా! మీరందరూ వస్తేనే ఊరికి ఆనందం. మీరంతా అడుగు పెడితేనే పల్లెకు కళకళల కాంతి. గలగలల సవ్వడి. మీరు అనుకుంటారు : ‘సంక్రాంతి పండక్కి వచ్చాం’ అని. నేను అనుకుంటాను, ‘మీరు వస్తూ వస్తూ పండగనైన నన్నూ తీసుకొచ్చార’ని. నిజమే కదా, నేను వారాల్లోంచి, వర్జాల్లోంచి రాను. క్యాలెండర్ల తేదీల్లోంచి ఊడిపడను. జనం ఆనందంలోంచి పుడతాను. పిల్లల నవ్వుల్లోంచి పుడతాను. మీ మీ ఆటల, పాటల, మాటల సందళ్లలోంచి ఉదయిస్తాను. మీరంతా చల్లగా ఉన్నప్పుడు, సుఖసంతోషాలతో తుళ్లింతలవుతున్నప్పుడూ – పండగగా నేను జన్మిస్తాను. మీ ఆనందపు సందళ్లలో పరవశిస్తాను.

మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు – ఇక్కడ అక్కడ అని కాకుండా ఎక్కడెక్కడికో ఎగురుతూ పోయే, తుళ్లుతూ పోయే పిల్లల మాధుర్యపు మనసుల నిండా నేను పండగనై పరవళ్లు తొక్కుతాను. ఎక్కడ పాడిపంటలు పొంగిపొర్లుతాయో, ఎక్కడ రైతుల కష్టానికి తగు ప్రతిఫలం దక్కుతుందో, ఎక్కడ కష్టాలూ కన్నీళ్లూ కాపురం పెట్టవో, ఎక్కడ పాలకులు ప్రజారంజక పాలన సాగిస్తారో, ఎక్కడ పిల్లాపాపలు తూనీగల్లా, తువ్వాయిల్లా స్వేచ్ఛావిహారం చేస్తారో .. అక్కడక్కడ అంతా నేనై ఆనంద తాండవం చేస్తాను.

రండి పిల్లల్లారా ..

మీ వలె, మీతోనే ఊరంతా, వీధివీధి ఒకసారి కలియతిరిగి చూస్తాను. జనం కళ్లల్లో, మీ పరుగుల్లో నన్ను నేను చూసుకొని తరిస్తాను.

మెరక వీధిలో మరిడమ్మ ఇల్లు ఎంత కళకళలాడుతుందో! ఆమె ముఖం ఎంత ఆనందంతో వెలుగుతుందో …! మూడేళ్ల తరువాత దుబయి నుంచి పిల్లలతో సహా కొడుకు వచ్చినందుకు కాబోలు ఆవిడ సంతోషం! మనవడు బంటీతో ఎంత మురిపెంగా ఆడుకుంటుందో… చిన్ననాటి తన బిడ్డల ఆటపాటలను తలచుకుంటోంది! బిడ్డలే కదా, తల్లులకు పండగ!

పెద్ద వీధిలో పాత్రుడు చిన్ననాటి స్నేహితులతో వెటకారాలాడుతున్నాడు. చిన్నప్పటి తమ అల్లరి పనులను జొన్నపొత్తు రేకుల్లా పొరపొరలుగా వొలుచుకుంటూ తెరలు తెరలుగా నవ్వుకుంటు న్నారు. బాల్య మిత్రుల కూడికే కదా, బలమైన పండగ. తులసమ్మ గారి రామలక్ష్మి ఎంత పొంగిపోతుందో … మొట్టమొదటిసారి తన మనవళ్లకు భోగిపళ్లు పోస్తుందట. తంగేటి సుబ్బత్త మహానందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది; అపార్థాలతో అలిగిన అల్లుడు ఈసారి కుటుంబ సమేతంగా పండక్కి వచ్చినందుకట …

రామాలయం వీధి ఎడమ పక్క ఏడో ఇంటి ముంగిట పట్నం మనవరాలు పింకీ రథం ముగ్గు వేస్తోంది. అత్తయ్యలు, పెద్దమ్మలూ ఆశ్చర్యంతో మురిసిపోతూ, మెరుగు సలహాలు కురిపిస్తున్నారు. గాలి పటాలను సర్దుకుంటూ చింతచెట్టు వీధి పిల్లల గ్యాంగు పరుగులు తీస్తోంది. అన్న వెంటే వెళతానని నాలుగేళ్ల నవ్య పేచీ పెడుతోంది. పెద్ద మావయ్య చిన్న కొడుకు ఆ బుజ్జాయిని ఎత్తుకొని ఊరడిస్తు న్నాడు. అనుబంధాల వారథి కదా పండగ అంటే ..!

కమ్యూనిటీ హాలు సెంటర్లో యువకులు కొందరు డిఎస్సీ నోటిఫికేషన్‌ ఎన్ని పోస్టులకు వస్తుందో అని తర్కించుకుంటున్నారు. చింతచెట్టు మొదట్లో కూచున్న రైతులు ధాన్యం కొనుగోళ్ల గురించి కబుర్లాడుకుంటున్నారు. మొన్నటి ఈదురు గాలులకు పడిపోయిన అరటితోట నష్టం గురించి కౌలు రైతు కన్నబాబు విచారిస్తున్నాడు. కష్టసుఖాల నెమరువేత కూడా జీవితంలో భాగమే మరి!

ఊళ్లోకి విడత విడతలుగా వస్తూ ఉన్న సంక్రాంతి చుట్టాలను పేరు పెట్టి పలకరిస్తున్నాడు 70 ఏళ్ల పరంధామయ్య. ఎవరు ఎవరి తాలూకానో, ఏ ఏళ్లో ఉంటున్నారో, వాళ్ల వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో కొంచెం కొంచెంగా ప్రకటిస్తున్నాడు. ‘ఇదే రావడమా, రాంబాబూ..’ అని ఒక గడసరిని ఆరా తీస్తే, ‘లేదు మాయ్యా .. వచ్చి మూడ్రోజులైంది. మీ ఇంటెనకాల దాక్కొని ఇప్పుడొస్తున్నాను.. నీ పెర్మీషను తీసుకుందామని…’ అని జోకేశాడు ఆ మేనల్లుడి వరసకుడు. చింతచెట్టు మొత్తం హాయిగా నవ్వుకొంది. ఈ మాటల మెరుపులే కదా, పండగ!

సందడిని చూసి, హాయిగా నవ్వుకున్నాను నేను కూడా! కాసేపు అక్కడక్కడే తిరిగి, ఇంకొన్ని వీధుల్లో విహరించాను.

ఒకచోట ముగ్గులు ముద్దుముద్దుగా రంగుల నద్దుకుంటున్నాయి. ఇంకోచోట పిండివంటలు కమ్మకమ్మగా చవులూరిస్తున్నాయి. ఊరవతలి విశాల మైదానంలో ఆటలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇంటా బయటా ఊరంతా సందళ్ల సోయగం. పిల్లల్లో పెద్దల్లో పండగ వ్యాపకాల సంరంభం.

అనేకమందిలోని ఆనందం, అనేకచోట్లలోని సంబరం- ఇంతింతై … నేను పెద్ద పండగనై వెలుగొంది పోతున్నాను.

చివరాఖరిగా నాకు ప్రతిరోజూ చిరు పండగలా కనిపించే ఓ చిన్ని చోటు గుర్తొచ్చింది. అది గ్రామాల్లో చిన్ని చిన్ని పిల్లలు ఆటలు ఆడి, పాటలు పాడి ఆనందించే చోటు. అయ్యో … కొత్త సందడిలో పడి నిత్య సందడిని మరిచానే … అనుకొని, వడివడిగా అటు వెళ్లాను. ఆ చిన్నారుల బడికి తాళం వేసి ఉంది. ”40 రోజులు దాటింది… అంగన్వాడీ అమ్మలు ఆందోళన మొదలు పెట్టి. పాపం… ఈ పండగ కూడా లేదు వాళ్లకి. ప్రభుత్వం మొండిగానే పోతోంది.” అంటున్న సోములమ్మ మాటలు వినిపించాయి. పట్నం నుంచి వచ్చిన ఆమె కోడలు పద్మ నా వలె చెవివొగ్గి శ్రద్ధగా వింటోంది.

”అంగన్వాడీ బడి సాగినప్పుడు మన పిల్లలకు ఆటలుండేవి. పాటలుండేవి. ఇంత తిండి ఉండేది. ఈ నలభై రోజులూ ఆ సందడే లేకుండా పోయింది. చేస్తున్న పనికి తగ్గట్టు జీతం అడగటంలో తప్పేముంది? ఇందాక టీవీలో- ‘అందరూ సంతోషంగా ఉండటమే పండగ’ అన్నాడు ముఖ్యమంత్రి. మరి ఆ అందర్లో వేలాదిమందిగా ఉన్న అంగన్వాడీలు ఉండక్కర్లేదా?” అంటోంది సోములమ్మ. ”అవును కదా..” అంది పద్మ.

అవును కదా! అందరూ ఆనందంగా ఉంటేనే పండగ.

పాడిపంటలు పొంగి పొర్లి, గిట్టుబాటు ధర చేతికొచ్చి రైతులు; చదువులకు తగ్గ ఉద్యోగాలు వచ్చి యువతీ యువకులు; పనికి తగ్గ వేతనాలు చేతికంది ఉద్యోగులూ కార్మికులూ … అందరూ సుఖసంతోషా లతో ఉండాలి! అప్పుడే నేను ఇంకా ఇంకా పెద్ద పండుగగా పరవశిస్తాను. పెద్ద వెలుగునై ప్రకాశిస్తాను.

అందరూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంలోంచి సంక్రాంతులు వెల్లువలా, వేకువల కువకువలలా ఎల్లడలా వెల్లివిరియాలి!

 

– సత్యాజీ

➡️