పాటలతో పాఠాలు

Jan 21,2024 09:57 #feature

పుస్తకాల్లోని పాఠ్యాంశాల కన్నా పాటలంటేనే పిల్లలకు ఆసక్తి ఎక్కువ. ఎక్కువసార్లు చదివినా పాఠాలను సరిగా గుర్తించుకోలేరు. కానీ, ఒక్కసారి విన్న పాటను సంవత్సరాల తరబడి గుర్తుంచుకుని పాడతారు. ఈ సహజ ఆసక్తిని గుర్తించి పాఠాలను పాటల రూపంలో బోధిస్తూ విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కానేటి రమణ. తరగతి గది బోధనకే పరిమితం కాకుండా పాఠ్యాంశాలతోపాటు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే అనేక అంశాలను బోధిస్తూ, నేర్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

             కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కానేటి రమణది కూడా అదే గ్రామం. పదో తరగతి వరకూ తెలుగు బోధించే ఆయన ఆ సబ్జెక్టుకు సంబంధించిన సూత్రాలు, సంధులు, సమాసాలు, పద్యాలు, గద్యాలు, కవులు, రచయితలు తదితర వివరాలను సులభంగా గుర్తుపెట్టుకునేలా పాటల రూపంలో బోధిస్తున్నారు. చిత్రలేఖనం, పాటలు, పద్యాలు పాడటం, నృత్యాలు చేయటం, కథలు చెప్పించటం, సూత్రాలు సులభ పద్ధతుల్లో తెలిసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. శారీరక, మానసిక ఉల్లాసానికి ఆటలు ఆడించటం, ఒత్తిడి నుంచి విముక్తి పొందటానికి యోగాసనాలు వేయించటం, పాఠశాల ఆవరణలోని ఔషధ మొక్కలతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించటం వంటి బోధనేతర బాధ్యతలూ నిర్వర్తిస్తున్నారు. అదనపు సమయం కేటాయించటం ద్వారా చదువుతో వెనుకబడిన వారిని కూడా ముందు వరుసలో నిలపొచ్చునని ఆచరణలో రుజువు చేస్తున్నారు.

పిల్లలతో పలు కృత్యాలు

రమణ విద్యార్థులతో అనేక కృత్యాలు నిర్వహిస్తున్నారు. కథా పూరణ, వాక్యపూరణ, సంఘటనలు క్రమంలో అమర్చడం, చిత్రాల సహాయంతో కథలు రాయించటం. పద నిర్మాణ క్రీడలు, పద పోరాటాలు, అంత్యాక్షరి, పద ఉచ్ఛారణ వంటివి అభ్యాసం చేయిస్తున్నారు. పద్య, గేయపఠనం, సంభాషణా పాఠాలను చదివించటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నాటకీకకరణ క్రియల్లో పాత్రపోషణ, అభినయం, ఆలోచనలు, ప్రశ్నలకు సమాధానాలు, విషయ విశ్లేషణ, పాఠంలోని ముఖ్యాంశాలు చెప్పించటంలో మెలకువలు నేర్పుతున్నారు. విద్యార్థికి సామాజిక అవహగానతోపాటు పాటుగా ఆచరణాత్మక కృషికి అవకాశం కల్పిస్తున్నారు.

యూట్యూబ్‌ ఛానల్‌ ‘తెలుగు విందు’

విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలు ఎంత ముఖ్యమో భాషా కళలు కూడా అంతే ముఖ్యమని తాను రూపొందించిన ‘తెలుగు విందు’ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా రమణ వివరిస్తున్నారు. పాఠశాలలో జరిగే సభలు, సమావేశాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలపై వీడియోలు తీయటం, పిల్లలతో న్యూస్‌ బులిటెన్లు తయారుచేయటం, కవితలు చెప్పించటం, తెలుగు నెలలు, తిథులు, రాశులు, నక్షత్రాలు, రుతువులు వంటి వాటిని పాటగా రచించి పిల్లలకు నేర్పిస్తున్నారు. పాఠశాలకు సెలవు రోజుల్లో విద్యార్థులకు కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఔషధ మొక్కలపై వీడియో

పాఠశాల ఆవరణలో ఉన్న 50 ఔషధ మొక్కలు-వాటి ఉపయోగాల గురించి వీడియోను తయారు చేశారు. ప్రతి మొక్కలో ఉండే ఔషధ విలువలు వాటిని తీసుకోవటం ద్వారా శరీరానికి ఒనకూడే ఆరోగ్యం గురించి వివరించారు. తిప్పతీగ, నేల ఉసిరి, నేరేడు, రావి, జిల్లేడు, గోరింట, మర్రి, పల్లేరు, గరిక, పుట్టమన్ను, ఉమ్మెత్త, మునగ, కొండపిండి, అతిబల, దూసర తీగ, గడ్డి చామంతి, గలిజేరు తదితర ఔషధ మొక్కల గురించి వీడియాల ద్వారా వివరించారు. ఈ బహుముఖ కార్యక్రమాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీధర విశాలి, తోటి ఉపాధ్యాయులు కూడా సహకరిస్తున్నారు. – యడవల్లి శ్రీనివాసరావు

ప్రతిభా నైపుణ్యాల వృద్ధికి కృషి

వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం, ఆత్మ విశ్వాసం పెంపొందింపజేస్తున్నా. పాఠశాలలో ప్రతి ఈవెంట్‌కు నాటికలు, నృత్యాలు, ఏకపాత్రాభినయాలు వంటివి చేయిస్తూ ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాం. మనం రోజూ చూస్తున్న మొక్కలను చాలామంది పనికిరానివి అనుకుంటుంటారు. ప్రతి మొక్కా ఔషధ విలువలు కల్గివుందని తెలియజేయటానికి, పర్యావరణం పట్ల అవగాహన పెంచటానికి ప్రయత్నం చేస్తున్నాను. సామాజిక అంశాలపైనా, ప్రత్యేక దినాలపైనా సుమారు 100 పాటలు రాశాను. విద్యార్థుల చేతా రాయిస్తున్నా. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదువుతోపాటుగా కళలవైపు ప్రోత్సహించాలి. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎలక్ట్రీషియన్‌, ప్లంబింగ్‌, బైక్‌ రిపేరింగ్‌, సెల్ఫోన్‌ రిపేరింగ్‌, టైలరింగ్‌, మోటర్‌ రిపేరింగ్‌ వంటి కోర్సులు నేర్పించాలనే ప్రయత్నంలో ఉన్నా. దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. – కానేటి రమణతెలుగు ఉపాధ్యాయులు, జెడ్పీ ఉన్నత పాఠశాల, తేటగుంట.

➡️