అరవైల్లో ఇరవైల్లా జీవించేస్తున్నారు…

Dec 4,2023 11:24 #Jeevana Stories

అరవైల్లో ఇరవైల్లా బతకాలని చాలామందికి ఉంటుంది. అయితే అది సాధ్యమయ్యేది ఎందరికి? కొండలు, గుట్టలు ఎక్కాలని, ఎవరెస్టు శిఖరం అందుకోవాలని, హై జంప్‌ చేయాలని, బైక్‌పై ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని ప్రపంచమంతా చుట్టేయాలని మీ అమ్మానాన్న ఎప్పుడైనా మీతో చెప్పారా? పోనీ మీ చుట్టుపక్కలో, బంధువుల్లోనో ఎవరైనా అలా జీవిస్తున్నారేమో గమనించారా? ఉరుకులు, పరుగుల జీవితంతో విసిగి వేసారిపోయిన ఎంతోమంది వృద్ధులు, రిటైర్‌మెంట్‌ తరువాత జీవితం గురించి కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. ఇల్లు కట్టుకుంటారు. పెళ్ళిళ్లకి ఖర్చు పెడతారు. ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తారు. అంతే.. అంతకు మించి పెద్దగా ఆశలు పెట్టుకోరు. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా గడిపేస్తే చాలనుకుంటారు చాలామంది. కానీ ‘ఎప్పుడూ పిల్లలు, బాధ్యతలేనా.. మీ కోసం కూడా జీవించండి.. మీ కలలు, కోరికలు మాలా నెరవేర్చుకోండి’ అంటూ ఈ వృద్ధులు నిరూపిస్తున్నారు. రిటైర్‌మెంట్‌ తరువాత జీవితాన్ని కొత్తగా ప్రారంభించిన వీరి సాహసాలు, సాహసయాత్రలు గురించి తెలుసుకుందాం.

 

మాలా హోన్నత్తి (70)
మాలా హోన్నత్తి (70)

బ్యాంకు ఉద్యోగిగా ఉద్యోగ విరమణ పొందిన మాలా అడ్వెంచర్‌ లైఫ్‌ ఆమె 30 ఏళ్ల నుండే ప్రారంభమైంది. 1984 నుండి హిమాలయాలపై ట్రెక్కింగ్‌ చేసిన అనుభవం ఉన్న ఆమె, 1986 నాటికి ఇండియాలో ఓ పన్నెండు పర్వత శిఖరాలను అధిరోహించేశారు. కంగ్రి, లడఖి, సితిధార్‌, కిలిమంజారో వంటి ఎన్నో పర్వతాలను అవలీలగా ఎక్కేశారు. ఒంటరిమహిళైన మాలా, ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క తన కలలను నెరవేర్చుకుంటున్నారు. 2016 నాటికి సొంతంగా ‘మాహో అడ్వెంచర్స్‌’ పేరుతో ట్రెక్కింగ్‌ ట్రిప్‌లను ప్రారంభించారు. ‘ఇది నా జీవితం.. నేనేం చేయాలో అది చేస్తాను’ అంటున్న మాలా ట్రెక్కింగ్‌ ప్రయాణం 70 ఏళ్లు వచ్చినా కొనసాగుతూనే ఉంది.

యోగేశ్వర్‌ (73), సుష్మా భల్లా (69)
యోగేశ్వర్‌ (73), సుష్మా భల్లా (69)

ఈ జంట మొదటి ప్రయాణం పెళ్లయిన కొత్తల్లో చేసిన లాంగ్‌ ట్రిప్‌తో ప్రారంభమైంది. హనీమూన్‌ కోసం బైక్‌పై శ్రీనగర్‌ వెళ్లింది ఈ జంట. ఆ మొదటి ప్రయాణం మరపురాని ఎన్నో తీపి గుర్తులను అందించింది. అందుకే 47 ఏళ్ల తరువాత మళ్లీ అలాంటి లాంగ్‌ ట్రిప్‌లు వేయాలని నిర్ణయించుకున్నారు. ఎంచక్కా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ వేసుకుని చేయి చేయి పట్టుకుని గాల్లో తేలిపోతూ, ఊహాల్లో గంతులేస్తూ సుదూర ప్రాంతాలకు వాలిపోతున్నారు. ఈ ప్రయాణాల కోసం యేగేశ్వర్‌ ముందుగానే రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. ఇప్పటివరకు భూటన్‌, నేపాల్‌, లేV్‌ా, లడఖ్‌ వంటి 22 దేశాలను చుట్టేశారు. బైక్‌పై బెల్జియం, దుబారు, ఫ్రాన్స్‌, ఖతార్‌, రోమ్‌, సింగపూర్‌, ఇంగ్లాండ్‌, స్కాట్‌లాండ్‌, టర్కీ, వెనీస్‌ వంటి దేశాలు చూసొచ్చారంటే ఎవరూ నమ్మరు. పెద్దాయనకు 2021లో మోకీలు ఆపరేషన్‌ జరిగింది. ‘మీ ప్రయాణాలకు ఇక కళ్లెం వేయాల్సిందేన’ని డాక్టర్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయినా ఈ జంట ప్రయాణాలు ఆపలేదు. త్వరగా కోలుకునేందుకు తాతగారు ఫిట్‌నెస్‌ వర్కౌట్స్‌ చేసేశారు మరి. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఇష్ట సఖిని వెంటేసుకుని అడ్వెంచర్‌ ప్రయాణాలు చేస్తున్నారు. వాటన్నింటినీ సోషల్‌మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నారు.

మొల్లి జాయ్ (62)
మొల్లి జాయ్ (62)

మొల్లి కేరళలో ఒక కూరగాయల దుకాణం నడుపుకుని జీవిస్తున్నారు. ఎర్నాకుళం వాసి అయిన మొల్లికి, చిన్నతనం నుండే ప్రపంచాన్ని చుట్టేయ్యాలని ఆశ. కానీ ఆమె కుటుంబ పరిస్థితులు కనీసం స్కూల్లో తీసుకెళ్లే, పర్యాటక ప్రాంతాలకు కూడా సహకరించేవి కావు. పెళ్లయ్యాక భర్తతో కలసి దక్షిణ భారతదేశం చుట్టివచ్చింది. అయినా ఆమె ఆశ తీరలేదు. దుకాణంలో ఉన్న పేపరు కట్టల్లో చూసిన ప్రపంచప్రదేశాల విశేషాలు చదివి, వాటిని చూడాలని కలలు కనేది. ఇలా ఉండగానే 2004లో ఆమె భర్త చనిపోయారు. పిల్లల బాధ్యత తనే తీసుకుంది. వారి చదువులు, పెళ్లిళ్ల ధ్యాసలో పడి, తన ఆశలకు కళ్లెం వేసింది. ఇప్పుడు పిల్లలంతా స్థిరపడ్డారు. ఎంతో కష్టపడి రూ.10 లక్షలు భద్రం చేసుకుంది. ఇప్పుడా డబ్బులతో తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. యూరప్‌ దేశాలు, ఇటలీ, ఫ్రాన్స్‌, వాటికన్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ పర్యటించింది. దశాబ్దకాలంలో 11 దేశాలు చుట్టివచ్చింది. ‘నాకు పెద్దగా ఆదాయం లేదు.. నేను సంపాదించిన దాన్ని కూడబెట్టుకుని, నాకు అత్యంత ఇష్టమైన దాని కోసం ఖర్చుపెడుతున్నాను’ అంటూ చెబుతున్న మొల్లి ట్రిప్‌కి వెళ్లి వచ్చిన తరువాత తన కూరగాయల షాపులో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ, తర్వాత ట్రిప్‌ కోసం డబ్బులు భద్రపర్చుకుంటోంది.

అమరజీత్‌ సింగ్‌ చావ్లా (64)
అమరజీత్‌ సింగ్‌ చావ్లా (64)

అమర్‌జీత్‌ యువకుడిగా ఉన్నప్పుడు అంటే 1979లో అతనికి పర్యటనల మీద ఆసక్తి ఏర్పడింది. అప్పుడు ఏర్పడిన ఆసక్తి, ఇప్పుడు 40 ఏళ్ల తరువాత నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పుడతనికి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు. అలాగే బాధ్యతల నుండి విముక్తి లభించింది. ఈ అవకాశాన్ని వృధా చేసుకోవడం అసలు ఇష్టం లేని అమరజీత్‌, 2018లో టయోటా ఫార్ట్యున్‌ ఎస్‌యువి కారు కొని పర్యటనలు చేస్తున్నాడు. రోడ్డు మార్గం గుండా స్వల్ప కాలంలోనే 40 వేల కిలోమీటర్లు, 33 దేశాలు చుట్టివచ్చాడు. ఇప్పుడు ఆ సంఖ్య 87 దేశాలకు చేరింది. తన ప్రయాణాలన్నీ ‘ద టర్బన్‌ ట్రావెలర్‌’ పేరుతో సోషల్‌మీడియా ద్వారా ప్రసారం చేస్తూ ఆదాయం కూడా పొందుతున్నాడు. ’60’ తరువాత నా జీవితం మొదలైంది అంటూ తెగ హుషారు పడిపోతున్న అమరజీత్‌ సింగ్‌ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికుడు, ప్రముఖ యూట్యూబర్‌.

రవికిషోర్‌ మల్లాప్రగడ (62), సౌదామిని (58)
రవికిషోర్‌ మల్లాప్రగడ (62), సౌదామిని (58)

ఆరేళ్ల చిరుప్రాయంలో ఎత్తైన కొండ ఎక్కిన రవి, వయసు పెరుగుతున్న కొద్దీ, ఆ అనుభవాన్ని ఎంతో ఆస్వాదించేవాడు. లెక్కల మాస్టారుగా జీవితం ప్రారంభించిన రవి ఆ తరువాత దుబారు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లినా ట్రెక్కింగ్‌పై ఆయనకున్న ప్రేమ మాత్రం తగ్గలేదు. ఈసారి అతని కలకు భార్య కూడా తోడైంది. వారాంతాల్లో ఇద్దరూ లాంగ్‌ట్రిప్‌లు వేసేస్తుంటారు. అడ్వెంచర్‌ ఆటలెన్నో ఆడేస్తారు. 2022లో ఈ జంట కిలిమంజారో గిల్‌మ్యాన్స్‌ పాయింట్‌కి ట్రెక్కింగ్‌ చేశారు. అంతేకాదు, జోర్డాన్‌, నేపాల్‌, శ్రీలంక, జపాన్‌, యుఎఇ, ఈజిప్టు, సింగపూర్‌, థారుల్యాండ్‌, కాంబోడియా దేశాల్లో నిర్వహించిన స్కై డైవింగ్‌, బంగీజంప్‌, స్కూబా డైవింగ్‌, పారాగ్లిడ్డింగ్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌, సబ్‌మెరైన్‌ రైడ్‌ల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది నేపాల్‌లో జరిగే జిప్‌ లైనింగ్‌, బంగీ జంపింగ్‌ వీరి జాబితాలో ఉన్నాయి.

➡️