ముసలవ్వ మనవడు

Jan 5,2024 09:58 #Jeevana Stories

రామంచ అనే ఊరిలో ఒక ముసలవ్వ ఉన్నది. ఆమె రొట్టెలు అమ్ముతూ బతుకుతోంది. ఆమెకు రవి అనే ఒక మనవడు ఉన్నాడు. ముసలవ్వ చేసిన రొట్టెలను రవి ఇంటింటికి తిరిగి అమ్మేవాడు. ఒకరోజు రొట్టెలు అమ్ముతూ, బడికి వెళ్తున్న పిల్లలను చూసాడు.’నేను కూడా చదువుకుంటే ఎంత బాగుండు’ అనుకుని ఇంటికి వచ్చి ముసలవ్వతో ‘బడికి వెళ్తాన’ని అడిగాడు. ‘మన దగ్గర అంత డబ్బు లేదు. వద్దు బిడ్డా’ అని ముసలవ్వ బుజ్జగించింది.’అవ్వా, నేను సర్కారు బడిలో చదువుకుంటాను. అక్కడ పుస్తకాలు, బట్టలు ఉచితంగా ఇస్తారు. భోజనం, టిఫిన్‌ ఇస్తారు. చదువు మంచిగా చెబుతారు’ అన్నాడు రవి. ముసలవ్వ సరేనని రవిని సర్కారు బడిలో చేర్పించింది. రవి కష్టపడి చదివాడు. సాయంత్రం వేళల్లో రొట్టెలు అమ్ముతూ ముసలవ్వకు సహాయ పడుతున్నాడు. కొంతమంది రొట్టెలు అమ్ముతాడని ఎగతాళి చేసినా తను పట్టించుకోలేదు. ఉపాధ్యాయులు ఏ రోజు చెప్పిన పనిని ఆ రోజే పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. పదో తరగతిలో జిల్లాలోనే మొదటి స్థానం సంపాదించి అందరి మెప్పు పొందాడు. రవి ప్రతిభ చూసిన ఒక సేవా సంస్థ, అతన్ని ఉన్నత తరగతులు చదివించడానికి తగిన ఖర్చులు భరిస్తామని ముందుకు వచ్చింది. మనవడు భవిష్యత్తు బాగుపడుతుందని ముసలవ్వ ఎంతో సంతోషించింది.

– నిమ్మల రిత్విక్‌, 6వ తరగతి,జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జక్కాపూర్‌, సిద్దిపేట జిల్లా.

➡️