ఎర్ర కోడిపుంజు

May 7,2024 04:55 #chinnari, #feachers, #jeevana

రాములుది సింగారం అనే ఊరు. రోజూ పొలం పనులు చేస్తాడు. కోళ్లనూ పెంచుతాడు. రాములుకి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. తన పేరు అనిరుధ్‌. ఒకటవ తరగతి చదువుతున్నాడు. అనిరుధ్‌కి ఎర్రకోడిపుంజు అంటే చాలా ఇష్టం. రోజూ దానికి నూకలు పోస్తాడు. ఆడుతాడు. ఒకరోజు రాములు పక్కింటి సోములు, తన ఇంటికి చుట్టాలు వస్తున్నారని ఒక కోడి కావాలని వస్తాడు. రాములు ఎంత ప్రయత్నించినా ఏ కోడీ అందలేదు. చేసేదేమీ లేక, కొడుకు మచ్చిక చేస్తున్న ఎర్రకోడి పుంజుని ఇచ్చేశాడు.
బడినుండి అనిరుధ్‌ వస్తాడు. చీకటి పడుతుంది. కోళ్లు అన్ని వచ్చాయి. ఎర్రకోడిపుంజు మాత్రం రాలేదు. అనిరుధ్‌ చాలా సేపు గుమ్మం దగ్గరే నిలబడి ఎదురుచూస్తాడు. ఇంటి ముందరికి వెనుకకి వెళ్లాడు. పెరట్లో, ఎనుగుల్లో వెతుకుతాడు. ఎటుపోయినా ఎర్రకోడిపుంజు దొరకలేదు. పుంజు కనిపించలేదని వెక్కివెక్కి ఏడ్చాడు. అన్నం తినడు. స్నేహితులందరూ వచ్చి చుట్టూ చేరారు. అందరూ బాధలో మునిగిపోయారు. జరిగిన విషయమంతా తెలుసుకున్న సోములు, ఎర్రకోడి పుంజుని తీసుకొచ్చి రాములుకి ఇచ్చేశాడు. కోడిపుంజును చూడగానే అనిరుధ్‌ కళ్ళలో ఆనందం పొంగింది. దాన్ని పట్టుకుని గంతులు వేసుకుంటూ పెరట్లోకి పరుగుపెట్టాడు.

– డా.వాసరవేణి పరశురాం,
సింగారం, సెల్‌ : 94921 93437.

➡️