అంధుల లిపి పితామహుడు

Jan 6,2024 09:32 #Jeevana Stories

పిల్లలూ, ఈ రోజు ఫ్రెంచ్‌ విద్యావేత్తగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అంధుల లిపి పితామహుడు లూయీ బ్రెయిలీ గురించి తెలుసుకుందామా !

పారిస్‌లో క్రూవే అనే గ్రామంలో మోనిక్‌ బ్రెయిలీ, సైమన్‌ రెనె బ్రెయిలీలకు 1809లో జనవరి 4న లూయీ జన్మించారు. మూడేళ్ల వయసులో ఉండగా, ఓ ప్రమాదంలో ఆయన రెండు కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఏడాది వ్యవధిలో పూర్తిగా చూపు కోల్పోయారు. పారిస్‌లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. అసాధారణ ప్రతిభతో రాణించిన ఆయన అప్పటికే అంధుల కోసం అమలులో ఉన్న ‘లైన్‌ టైపు’ పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమితులయ్యారు. అంధులకు చదువు చెప్పాలంటే వారికి పుస్తకాలు కావాలి. కంటితో వారు చూడలేరు. స్పర్శ ద్వారా తప్ప మరో మార్గంలో చదువుకోలేరు. దీంతో ఎత్తుగా ఉబ్బివుండే విధంగా అక్షరాలు ఉన్న పుస్తకాలు కావాలి. చెక్కమీద, పుస్తకాల మీద ఎత్తుగా ఉబ్బివుండే అక్షరాలను రూపొం దించేందుకు బ్రెయిలీ ఎంతో కృషి చేశారు. అంతకుముందే చార్లెస్‌ బార్బియర్‌ అనే సైనికాధికారి, సైనికులు రాత్రిపూట సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించే 12 ఉబ్బెత్తు చుక్కల ప్రత్యేక లిపిని తయారుచేశారు. దీన్ని ఆధారంగా చేసుకుని బ్రెయిలీ తన నూతన పద్ధతిని సిద్ధాంతీకరించారు. ఐదేళ్ల పాటు పరిశోధన చేసి ఆరు చుక్కల లిపిని రూపొందించారు. ఆరు పాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం 26 ఇంగ్లీషు అక్షరాలు పలికేటట్లు చేశారు. మొత్తం భాషకు 250 గుర్తులు రూపొందించారు. ఈ లిపినే ప్రపంచదేశాలు ఉపయోగిస్తున్నాయి. బ్రెయిలీ లిపి కుడి నుంచి ఎడమకు రాస్తారు. బ్రెయిలీలో టైపురైటర్లు కూడా రూపొందించారు. అంధులకు వెలుగు చూపించిన బ్రెయిలీ 1852లో క్షయ వ్యాధికి గురై జనవరి 6న మరణించారు. తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పు సాధించి నవయుగ వైతాళికుడయ్యారు బ్రెయిలీ.

➡️