పోరాటంలో ముందున్నారు.. చదువుల్లో రాణించారు ..!

Dec 3,2023 10:31 #Jeevana Stories

వాళ్లు విద్యార్థి సమస్యలపై పోరాడుతూ, విద్యార్థులను సమీకరిస్తూ చదువులోనూ గొప్పగా రాణించారు. తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా, అవరోధాలు వచ్చినా, కొందరు నిరుత్సాహపరిచినా తమ పోరాట పంథా వీడకుండా ‘చదువు, చదువుతూ పోరాడు’ నినాదంతో ముందుకు నడిచారు. విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేస్తూ, ఉద్యమబాటను నడుస్తూ పిహెచ్‌డి పట్టభద్రులుగా నిలిచారు. వారిలో కొంతమంది తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు.

priyanka
                                       priyanka

ఎస్‌ఎఫ్‌ఐలో ఉంటేనే బాగా చదవగలం

నా పేరు ప్రియాంక. మాది శ్రీకాకుళం. మా నాన్నగారు వ్యవసాయ కార్మిక సంఘ సభ్యులు. 9వ తరగతిలోనే ఎస్‌ఎఫ్‌ఐలో చేరాను. ఉద్యమాల్లో చురుకుగ్గా పాల్గొంటూనే విద్యలో రాణించాను. బాగా చదివితేనే మమ్మల్ని చూసి ఇంకొంతమంది విద్యార్థులు ఉద్యమంలోకి వస్తారని బలంగా నమ్మేదాన్ని. ఉద్యమంలో ఉండడం వల్ల అధ్యయన సామర్థ్యాలు పెరుగుతాయి. మా అబ్బాయికి కూడా ఎస్‌ఎఫ్‌ఐలో చేరమని సలహా ఇస్తాను. ఉద్యమంలో ఉంటూ పీజీ పూర్తి చేసిన నేను ఆంధ్రా యూనివర్శిటీలో ఎస్‌ఎఫ్‌ఐ సెక్రటరీగా ఉంటూనే పిహెచ్‌డి పూర్తిచేశాను. యూనివర్శిటీ స్థాయి అన్ని ఉద్యమాల్లో పాల్గొనేదాన్ని. పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఒక రోజంతా స్టేషనులో ఉన్నాను. అంతకుముందే స్కాలర్‌షిప్‌ అంశంలో గవర్నర్‌ను అడ్డగించి నిరసన చేపట్టినప్పుడు మూడు రోజులు జైల్లో పెట్టారు. ఇలా ఒక పక్క చదువు, మరోపక్క ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాను. 2014లో పిహెచ్‌డీ అడ్మిషన్‌ ఇచ్చాను. 2018కి సబ్మిట్‌ చేశాను. 2020లో అవార్డు వచ్చింది. అప్పటి నుండి ఐద్వాలో పనిచేస్తున్నాను. ఉద్యోగం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘ఉద్యోగాలు ఎవరైనా చేస్తారు.. ఉద్యమాలు కొంతమందే చేస్తారు. నువ్వు ఉద్యమం చెయ్యి’ అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఒకప్పుడు సూటిపోటి మాటలు అన్నవాళ్లే ఇప్పుడు, నా ఉద్యమప్రస్థానం, అధ్యయన సామర్థ్యాలు చూసి అభినందిస్తున్నారు.

salima
                                        salima

నా పేరు సలీమ. మాది గుంటూరు జిల్లా. నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. ఒంటరి మహిళగా ఉన్న అమ్మను పార్టీ అక్కున చేర్చుకుంది. ఆమె, నన్ను ఎంతో శక్తిమంతంగా తీర్చిదిద్దింది. 1999లో ఇంటర్మీడియట్‌ చదివేనాటి నుండి నాకు ఎస్‌ఎఫ్‌ఐ పరిచయం. సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. స్వల్ప కాలంలోనే జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌గా, 2004 నుండి 2011 వరకు పూర్తి కాలం ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేశాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ తరువాత చదువు కొనసాగించలేకపోయాను. మా కుటుంబ పరిస్థితి తెలిసిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆర్థికంగా సాయం చేశారు. బస్‌ పాస్‌, కాలేజీ ఫీజు అన్నీ వారే చూసుకున్నారు. ‘చదువుతూ పోరాడు. చదువుకై పోరాడు’ అన్న నినాదాన్ని నిజం చేయమని మా లెక్చరర్‌ కోటేశ్వరరావు గారు ఎంతో మద్దతుగా నిలబడ్డారు. అలా నేను పీజీ చేస్తూ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తూనే 2008 నాటికి పొలిటికల్‌ సైన్స్‌ అంశంలో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. అంతకు ముందే 2007లో భూపోరాటాల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజులు జైల్లో ఉన్నాను. ‘పోరాటం, అధ్యయనం రెండు కళ్ల వంటివి. పోరాటం వల్లే నేను చదవగలిగాను’ అని గట్టిగా చెబుతాను. 2016లో పిహెచ్‌డికి దరఖాస్తు చేశాను. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన మహిళలు, ముస్లిం మహిళల త్యాగాలు నా అధ్యయనంలో ముందువరుసలో ఉంచాను. ఈ ఏడాది అక్టోబరులో అవార్డు వచ్చింది’ – సలీమ ప్రస్తుతం నవ తెలంగాణ పత్రికలో ఫీచర్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు.

Anuradha
                                 Anuradha

ఎస్‌ఎఫ్‌ఐ నన్ను చదివించింది

నా పేరు అనురాధ. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం, పెదగార్ల పాడు గ్రామం. మా ఊరికి ఇప్పటికీ బస్‌ సౌకర్యం లేదు. ‘ఆడపిల్లలకు చదువు అవసరం లేదు. పెళ్లి చేసి పంపిస్తే చాలు’ అన్న ధోరణి బలంగా ఉన్న ఊరు మాది. అటువంటి చోట నన్ను చదివించారంటే అది నాన్న పార్టీలో ఉండడమే. చిన్నప్పుడు ప్రజాశక్తి పేపరు వేసేదాన్ని. గుంటూరు నుండి గోరంట్ల వరకు మొత్తం 14 కిలోమీటర్లు ప్రయాణించేదాన్ని. నాన్న సిఐటియులో పనిచేసేవారు. 2006లో ఇంటర్‌లో ఉండగా ఎస్‌ఎఫ్‌ఐలో చేరాను. ఫీజులు కట్టలేని పరిస్థితి. ఎస్‌ఎఫ్‌ఐ నన్ను చదివించింది. సమస్యలపై పోరాడడం, చదువులో ముందుంటున్న మమ్మల్ని చూసి కాలేజీలో చాలామంది విద్యార్థులు మాతో కలిసివచ్చారు. పీజీలో ఉండగా ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్‌ కమిటీ సభ్యురాలిగా, రాష్ట్ర గాళ్స్‌ కన్వీనర్‌గా ఉన్నాను. పీజీ తరువాత పిహెచ్‌డీ చేయాలని నిశ్చయించుకున్నాను. 2016లో పిహెచ్‌డీ అడ్మిషన్‌ తీసుకొని, 2022లో సమర్పించాను. ఈ ఏడాది సెప్టెంబరులో అవార్డు తీసుకున్నాను. ఇప్పుడు మా గ్రామంలో ఆడపిల్లలను చూసే ధోరణిలో కొంచెం మార్పు వచ్చింది. పేద కుటుంబంలో పుట్టి, ఉద్యమాలు చేసి ఉన్నత విద్య చదివిన నన్ను ఉదాహరణగా చూపి వాళ్లింటి ఆడపిల్లలను కాలేజీలకు పంపుతున్నారు. – అనురాధ ప్రస్తుతం సచివాలయ వార్డు సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

SFI Leader
                                   SFI Leader

పోరాటం, అధ్యయనంలో మహిళలు ముందుండాలి

మాది చిత్తూరు జిల్లా. అమ్మ అంగన్వాడీ జిల్లా సెక్రటరీగా ఉండేవారు. ఎస్‌ఎఫ్‌ఐ గురించి తెలుసు. డిగ్రీలో ఉన్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌గా ఉండేదాన్ని. ఫుల్‌టైమ్‌ బాధ్యతల్లో ఉండడం నాకు చాలా ఇష్టం. అందుకే ఆ తరువాత చదువంతా దూరవిద్యలో అభ్యసించాను. ఉద్యమాల్లో పనిచేస్తూనే విద్యాభ్యాసం కొనసాగించాను. 2020లో పిహెచ్‌డీ అడ్మిషన్‌ ఇచ్చి, 2022లో సబ్మిట్‌ చేశాను. ఈ ఏడాదే అవార్డు ఇచ్చారు. ఒక పక్క ఉద్యమాలు, మరోపక్క అధ్యయనం నాకు ఎంతో సంతృప్తినిచ్చిన అంశాలు. మహిళలు ఉన్నత విద్యావంతులవ్వడమే కాదు, తమ చుట్టూ ఉన్న సమస్యలపై పోరాడడం అలవర్చుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని నేను బలంగా విశ్వసిస్తాను. పోరాటం, అధ్యయనంలో మహిళలు ఎప్పుడూ ముందుండాలి.

Chinnari
                                     Chinnari

అధ్యయనం ఎస్‌ఎఫ్‌ఐ నేర్పింది

నా పేరు చిన్నారి. మాది వ్యవసాయ కుటుంబం. విశాఖ జిల్లా కె కోటపాడు మండలం, గవరపాడు గ్రామం మా స్వస్థలం. నేను భీమిలి గాళ్స్‌ హాస్టల్లో వుండి చదువుకునేటప్పుడు ఒకసారి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు వచ్చి సమావేశాలు పెట్టారు. అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. ఆ రోజుల్లో నేను ఎస్‌ఎఫ్‌ఐ వైపు చాలా ఆకర్షితురాలినయ్యాను. అయితే ఇంటర్‌కి వచ్చేసరికి ‘విద్యార్థి సంఘంలో ఉంటే చదువు సాగదని బలంగా నమ్మడం మొదలుపెట్టాను. అయితే ఇంటర్‌ పూర్తయిన సంవత్సరం ఎస్‌ఎఫ్‌ఐ వాళ్లు సైకిల్‌ ర్యాలీ పెట్టారు. అనుకోకుండా అందులో పాల్గొనాల్సి వచ్చింది. 15 రోజులపాటు అనేక కార్యక్రమాలు చేశారు. క్రమంగా ఎస్‌ఎఫ్‌ఐ మీద అభిమానం ఏర్పడింది. ఆ యాత్ర నుండి వచ్చిన తరువాత ‘చదువుతూ పోరాడాల’ని గట్టిగా అనుకున్నాను. డిగ్రీ మొదటి సంవత్సరమే లెక్చరర్లు బెదిరించారు. ఎస్‌ఎఫ్‌ఐలో ఉండి నువ్వు ఎలా పాసవుతావో చూస్తామనేవారు. వాటన్నింటికీ నేను భయపడలేదు. డిగ్రీ చివరి సంవత్సరం కృష్ణా కాలేజీ మొత్తానికి నలుగురే పాసయ్యారు. వారిలో నేనొకదాన్ని. అప్పుడు లెక్చరర్లకు ఎస్‌ఎఫ్‌ఐ మీద అంతకుముందు ఉన్న దురభిప్రాయం మాయమైంది. ఆ తరువాత పీజీలో కెమిస్ట్రీ తీసుకున్నాను. డిపార్ట్‌మెంట్‌ ఫస్ట్‌ వచ్చాను. అప్పుడు నేను ఎస్‌ఎఫ్‌ఐలో విశాఖపట్నం జిల్లా సెక్రటరీగా ఉండేదాన్ని. పోరాటాల్లో ముందుంటూనే చదువులో రాణిస్తున్నానని చాలామంది అభిమానించేవాళ్లు. ఎస్‌ఎఫ్‌ఐలోకి వచ్చిన తరువాతే నేను మెరిట్‌ స్టూడెంట్‌ని అయ్యాను. అంతకుముందు సాధారణ విద్యార్థినే. కెమిస్ట్రీలో డిపార్ట్‌మెంట్‌ ఫస్ట్‌ రావడం ఆషామాషీ కాదు. చాలా అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం నాకు ఎస్‌ఎఫ్‌ఐ నేర్పింది. 2018లో ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పిహెచ్‌డీ అడ్మిషన్‌ తీసుకున్నాను. 2022 నాటికి పిహెచ్‌డీ సమర్పించాను. ఈ ఏడాది జులైలో అవార్డు తీసుకున్నాను.

  • సంభాషణ : జ్యోతిర్మయి
➡️