మార్పు కోసం.. వేల కిలోమీటర్ల ప్రయాణం

ujaas awareness on periods women stories

మానవ శరీరంలో జరిగే జీవక్రియలన్నింటిపై చాలామందికి విస్తృత అవగాహన ఉంటుంది. రుతుక్రమం విషయంలో మాత్రం అది లోపిస్తుంది. అందుకే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, మరెంతోమంది వ్యక్తులు ఈ అంశంపై ప్రత్యక్షంగా లేక పరోక్షంగా అవగాహన కల్పిస్తుంటారు. అటువంటి వారిలో ఒకరే అద్వైతిషా బిర్లా. కుమార్‌ మంగళం, నీరజ్‌ బిర్లా కుమార్తెగా బిర్లా కుటుంబ వారసురాలిగా ఆమె ఎంతోమందికి సుపరిచితురాలే. ఉన్నత విద్యావంతురాలైన అద్వైతి, తాతముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన ఆదిత్యా బిర్లా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా 2021 నుండి రుతుక్రమ ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

రుతుక్రమం విషయంలో నెలకొన్న అపోహలు, నిషేధాలు, మూసపద్ధతులపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమం ‘ఉజాస్‌’ పేరుతో జరుగుతోంది. ఇప్పటివరకు 2,05,463 లబ్ధిదారులను ఈ ‘ఉజాస్‌’ కలిసింది. 25,75,348 శానిటరీ ప్యాడ్లను పంపిణీచేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 117 ప్రాంతాలను కలియతిరిగింది. వ్యాను సాయంతో ముందుకు కదులుతోన్న ‘ఉజాస్‌’ పర్యటనలో రుతుక్రమంపై ఎన్నో విషయాలు వెలుగుచూస్తున్నాయి.

కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఈ నెలలో దేశవ్యాప్తంగా చుట్టిరావాలని ‘ఉజాస్‌’ సిద్ధమైంది. మొత్తం 25 రాష్ట్రాలు, 106 నగరాల్లో ప్రయాణించాలని లక్ష్యం పెట్టుకుంది. అంటే రోడ్డు మార్గం గుండా 10 వేల కిలోమీటర్లు ప్రయాణించాలి. ‘మా ‘ఉజాస్‌’ రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెంచుతుంది. ప్రతి అమ్మాయికి దీనిపై సమగ్ర సమాచారం చేరవేయడమే మా లక్ష్యం. పీరియడ్‌లో ఉండడం లోపం కాదని ప్రతి బాలికకు అర్థమయ్యేలా చేస్తాం. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతాం. ఇప్పటికీ రుతుక్రమంలో ఉన్నామని చెప్పడానికి చాలా మంది ఇష్టపడరు. మా ఉజాస్‌ దానిపైనే పనిచేస్తోంది. రుతు ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారాన్ని అందిస్తోంది’ అని చెబుతున్నారు అద్వైతిషా.

‘చాలామంది అమ్మాయిలకు తమ మొదటి పీరియడ్‌ వచ్చేవరకు రుతుస్రావం అంటే తెలియదు. అందుకే తొలి పీరియడ్‌ వారికి భయానక అనుభవాన్ని తెస్తోంది. చాలా మంది ఇళ్లల్లో ఈ రకమైన ప్రశ్నలని అస్సలు అడగనీయరు. పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలు చేసినా ఇళ్లల్లో చర్చించేందుకు ఇష్టపడరు. ఇది మా ప్రయాణంలో తెలుసుకున్న లోతైన అంశం’ అని ఆమె అంటున్నారు.

ujaas awareness on periods women stories

‘దేశంలోని వివిధ ప్రాంతాల్లోని స్వచ్ఛంద సంస్థలతో కలసి మా ఉజాస్‌ ముందుకు వెళుతోంది. ఆయా ప్రాంతాలకు చేరుకోగానే మేము మొదట శానిటరీ ప్యాడ్లను పంపిణీచేస్తాం. ఆ తరువాత అక్కడ రుతుక్రమం అవగాహనా సర్వే చేస్తాం.

మహారాష్ట్రలోని ముంబయి, రారుగఢ్‌, గోవాలోని అరంబాల్‌, పెర్నమ్‌, కౌరిమ్‌, కర్నాటకలోని బెంగళూరు, దేవనగిరి, హౌస్‌పేట, కేరళలోని కోజికోడ్‌, వయనాడ్‌లకు ‘ఉజాస్‌’ ప్రయాణించింది.

ఈ ప్రయాణంలో మేము పాఠశాల విద్యార్థినులపై సర్వే చేశాం. 5,7 తరగతి విద్యార్థులతో మాట్లాడినప్పుడు 28 శాతం అమ్మాయిలకే పీరియడ్స్‌పై అవగాహన ఉంది. 39 శాతం అమ్మాయిలకు మాత్రం ఇది నెల నెలా వచ్చే పీరియడ్‌ సైకిల్‌ అని అర్థమైంది. ఇంకో 36 శాతం మంది బాలికలు ఇది సహజ ప్రక్రియ అని అంగీకరించారు. అయితే వీరందరిలో 89 శాతం బాలికలు/అమ్మాయిలు మాత్రం ఇది అపవిత్రమైనదిగా భావిస్తున్నారు. ఈ ధోరణి 8వ తరగతి అమ్మాయిలకు వచ్చేసరికి కొంచెం భిన్నంగా ఉంది. 85 శాతం అమ్మాయిలు దీన్ని సహజప్రక్రియ అని భావిస్తున్నారు. 93 శాతం మంది బాలికలకు ఇది నెలకోసారి జరిగే ప్రక్రియ అని అర్థమైంది. 45 శాతం మంది మాత్రమే ఇది అపవిత్రమైనదిగా భావిస్తున్నారు’ అని సర్వే వివరాలను ఆమె చెప్పారు.

‘ఉజాస్‌’ మా ప్రాంతానికి రావడం వల్ల పీరియడ్స్‌పై అవగాహన పెంచుకున్నాను. నా స్నేహితులతో, బంధువులతో దీని గురించి మాట్లాడగలుగుతున్నాను. నాకు మొదటి పీరియడ్‌ వచ్చినప్పుడు ‘ఇది ఆడపిల్లలందరికీ వస్తుంది. ఆ రోజుల్లో ఉన్నప్పుడు వంటగదిలోకి రాకూడదని అమ్మ చెప్పింది. నాకు ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ అమ్మ వివరించలేదు. ‘ఉజాస్‌’ వచ్చిన తరువాత ఇచ్చిన సమాచారం ప్రకారం నా సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి’ అని పదో తరగతి చదువుతున్న ఓ బాలిక వివరించింది.

‘మేము ఇంకా ప్రారంభ రోజుల్లోనే ఉన్నాం. మా ప్రయత్నం ఇంతకుమించినది. ఉచిత శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడంలో స్థానిక మహిళలను భాగస్వామ్యం చేస్తున్నాం. ప్యాడ్ల ఉత్పత్తిలో మహిళలు శిక్షణ పొందారు. ఇది వారి జీవనోపాధికి కూడా ఉపయోగపడడం సంతోషంగా ఉంటోంది’ అంటున్నారు అద్వైతిషా. రుతుక్రమం చుట్టూ ఉన్న అపోహలు పోవాలంటే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని రావాలి.

➡️