మీ పిల్లల ప్రవర్తనకు మీరే బాధ్యులు ..!

Apr 12,2024 06:06 #feachers, #Jeevana Stories

ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య వ్యత్యాసం పెరిగిపోతోంది. ప్రేమ, ఆప్యాయతలు, మంచి చెడుల విశ్లేషణలతో తీర్చిదిద్దాల్సిన బాల్యం, అతి గారాబం, పెంకితనం, విపరీత స్వేచ్ఛ, తీవ్ర నిర్బంధంతో నిండిపోతోంది. ఈ పరిస్థితుల్లో పిల్లలు దురుసుగా మాట్లాడినా, ప్రవర్తించినా తమకేమీ పట్టనట్లు వ్యవహరించే తల్లితండ్రులు చాలామందే ఉంటారు. ఈ విపరీత ప్రవర్తన పిల్లలను హింసాత్మక దాడులకు ప్రేరేపిస్తుందని ఎంతమందికి తెలుసు? ఈ ప్రవర్తనకు అమ్మానాన్నే ముఖ్య కారణమని చెప్పినా ఏ తల్లీదండ్రీ ఒక పట్టాన ఒప్పుకోరు. అంతెందుకు! పిల్లలు చేసే ప్రతి తప్పుకు, ఒప్పుకు తల్లిదండ్రులే బాధ్యత వహించాలి అన్నా అంగీకరించరు. కానీ ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఉదంతం, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యతను మరోసారి ఎత్తి చూపించింది. తమ గారాల కొడుకు హింసాత్మక ప్రవర్తనకు పరిహారంగా ఇప్పుడా తల్లిదండ్రులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ఈథన్‌ క్రూంబ్లే (17) అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్‌ హైస్కూల్లో ఉన్నత విద్య చదివేవాడు. 2021లో తన దగ్గర ఉన్న 9 ఎం.ఎం చేతి తుపాకీతో తన సహ విద్యార్థులను(4) కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటనలో మరికొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ దారుణానికి తెగబడే సమయానికి ఈథన్‌ వయసు 15 ఏళ్లు. అప్పటి నుంచి తను జైల్లోనే ఉన్నాడు. ఆ కేసు విచారణలో భాగంగా ఈథన్‌ తల్లిదండ్రులైన జేమ్స్‌, జెన్నీఫర్‌ క్రూంబ్లేకు మిచిగాన్‌ కోర్టు తాజాగా 10 నుండి 15 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ ఈనెల 9న తీర్పు వెలువరించింది.
ఈథన్‌ అలా ప్రవర్తించడానికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే అని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లవాడి పెంపకంలో వారిరువురూ విఫలమయ్యారని పేర్కొంది. ‘ఈ ఆరోపణలు కేవలం పేలవమైన తల్లిదండ్రుల బాధ్యత గురించే చేయడం లేదు. రాబోయే తరాల్లో పునరావృతమయ్యే, లేక లోపించే చర్యలను నియంత్రించేందుకు కూడా!’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఈ తీర్పుతో ప్రపంచమంతా తల్లిదండ్రుల పాత్రపై మరోసారి చర్చిస్తోంది. పిల్లలకు మంచి చదువు, ఉపాధి చూపించడంతోనే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు. వారు పెరిగే ప్రతి దశలో కీలక బాధ్యతగా వ్యవహరించాలి. మంచి, చెడులు బేరీజు వేసి చెప్పడం దగ్గర నుంచి అనేక విషయాలు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. తీర్పు వెలువడిన క్షణంలో ఈథన్‌ తల్లి సరిగ్గా ఈ అంశంపైనే పశ్చాత్తాప పడింది.
‘నేను నా బిడ్డ కష్టసుఖాల్లో ఎప్పుడూ భాగం కాలేదు. తనకేమి కావాలో, వద్దో తెలుసుకోలేదు. చాలామంది తల్లిదండ్రుల లాగే నేను కూడా నా బిడ్డ ప్రవర్తనలో వస్తున్న మార్పులపై శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా ఇప్పుడు ఇలా శిక్ష అనుభవించాల్సి వస్తోంది’ అంటూ తీర్పు తరువాత జెన్నిఫర్‌ వ్యాఖ్యానించింది. జెన్నీ వ్యాఖ్యల్లో ప్రతి తల్లీ తమ బిడ్డల పట్ల తాము ఎంత బాధ్యతగా ఉంటున్నారో బేరీజు వేసుకోవచ్చు.
‘నా బిడ్డ వల్ల నష్టపోయిన కుటుంబాలకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఏ తండ్రీ పిల్లల మానసిక స్థితిని పట్టించుకోకుండా ఉండకూడదు. అలా చేసినందుకే ఈ రోజు మూల్యం చెల్లించుకుంటున్నాను’ అని ఈథెన్‌ తండ్రి, తీర్పు అనంతరం వ్యాఖ్యానించాడు. పిల్లవాడి ప్రవర్తనను సరిగ్గా బేరీజు వేసుకోని ఆ తండ్రి, ఘటన జరగడానికి నాలుగు రోజుల ముందే చేతి పిస్తోలుని ఈథన్‌కి బహుమతిగా ఇచ్చాడు. ఆ తుపాకీని స్కూలు బ్యాగులో భద్రపరుచుకున్న ఈథన్‌ ఒకానొక విపరీత క్షణాన ఈ దారుణానికి పాల్పడ్డాడు.
‘తల్లిదండ్రులిద్దరూ తమ బిడ్డ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. స్కూలు యాజమాన్యం హెచ్చరించినా లెక్క చేయలేదు. కాల్పులు జరిగిన రోజు ఉదయం వేళ ఈథన్‌ స్కూలు యాజమాన్యం జేమ్స్‌, జెన్నీలను స్కూలుకి పిలిపించి తన విపరీత ప్రవర్తన గురించి హెచ్చరించింది. ‘క్రిస్మస్‌ రోజు తుపాకీ బహుమతిగా అందుకున్న ఓ వ్యక్తి బొమ్మ, అతని చుట్టూ ‘రక్తం అన్ని చోట్ల ప్రవహిస్తోంది. ఆలోచనలను ఎవరూ నియంత్రించలేరు. సహాయం చేయండి’ అని రాసుకున్న ఈథన్‌ పుస్తకాన్ని చూపించినా వారు ఖాతరు చేయలేదు. పిల్లవాడ్ని ఇంటికి తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ ఇవ్వమని రెండు రోజుల తరువాతే స్కూలుకు పంపమని యాజమాన్యం చెప్పింది. కానీ, సమావేశం ముగిసిన స్వల్ప వ్యవధిలోనే ఈథన్‌ కాల్పులు జరిపాడ’ని బాధిత తల్లిదండ్రుల న్యాయవాది కోర్టులో వినిపించిన వాదనలు ప్రతి తల్లిదండ్రికీ తమ బాధ్యతను గుర్తు చేస్తున్నాయి.
ఈ తరహా విచారణలు ఈథన్‌ కేసులోనే కాదు; కొంతకాలంగా పిల్లల విపరీత ప్రవర్తనలకు తల్లిదండ్రులదే బాధ్యత అని న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. నేరుగా తల్లిదండ్రులపై అభియోగాలు మోపకపోయినా బాధ్యులుగా మాత్రం నిరూపించి శిక్షలు వేస్తున్నారు. ఆరేళ్ల పాప తన స్కూలు టీచరును కాల్చి చంపిన ఘటనలో పాప తల్లి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి, నిందితురాలిగా శిక్షించారు. అలాగే హారుల్యాండ్‌ పార్కులో ఒక పిల్లవాడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. డజన్ల కొద్దీ జనం గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ఆ పిల్లవాడి తండ్రి అరెస్టు అయ్యాడు. పిల్లవాడి పరిస్థితి అర్థం చేసుకోకుండా అతడికి గన్‌ లైసెన్సు ఇప్పించినందుకు అతను శిక్షార్హుడయ్యాడు.
పిల్లల బాధ్యత ‘నీది అంటే నీది’ అని వాదులాడుకునే తల్లిదండ్రులు చాలామందే ఉంటారు. ఎవరిది? అన్న చర్చ అనవసరం. ఉద్యోగాల్లో, ఇంటిపనుల్లో తలమునకలైనా, ప్రతి అమ్మానాన్న, పిల్లలకంటూ ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. పిల్లల్లో వస్తున్న మానసిక, శారీరక ఒత్తిడులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. విపరీతాలకు పోతుంటే వారించాలి. ‘ఎంత చెప్పినా వినడం లేదు.. మొండిగా ప్రవర్తిస్తున్నారు’ అని తప్పించుకోవద్దు. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. వాళ్లు చేసిందే చేస్తారు. చెప్పిందే చెబుతారు. కాబట్టి.. భార్యాభర్త ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎంత గౌరవంగా, బాధ్యతగా వ్యవహరిస్తారో, పిల్లలు కూడా అంతే సక్రమంగా పెరుగుతారు. మొదటి మార్పు అమ్మానాన్న నుండే మొదలవ్వాలి. అప్పుడే పిల్లలు మీరు కలలు గన్న బంగారు భవిష్యత్తును అనుభవిస్తారు.

న్యాయస్థానంలో ఓ అమ్మ కన్నీరు
‘ఘటన జరిగిన తరువాత మేల్కొన్న మీరు మీ బిడ్డకు విపరీతాలు చేయొద్దని హితవు చెప్పే సమయంలో, నేను కూడా నా బిడ్డకు సందేశం ఇచ్చాను. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నన్ను అమ్మా అని ఒక్కసారి పిలవమని ప్రాధేయపడ్డాను. కానీ, నా బిడ్డ అవేమీ వినిపించుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. మీ బిడ్డ బాధ్యతల నుంచి మీరు దూరంగా వెళ్లిపోయారు. మీరు చేసినదానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. గుండెలనిండా దు:ఖంతో నేను నా గారాల తల్లికి తుది వీడ్కోలు పలికాను’ అంటూ కోర్టు విచారణలో నికోల్‌ బౌసోలైల్‌ భావోద్వేగంగా మాట్లాడుతుంటే అక్కడ వున్న వారందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఈథన్‌ జరిపిన కాల్పుల్లో నికోల్‌ 17 ఏళ్ల కుమార్తె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

– జ్యోతిర్మయి

https://www.msn.com/en-us/video/news/james-and-jennifer-crumbley-sentenced-to-10-15-years-in-oxford-high-school-shooting/vi-BB1ll9Lv?t=490&ocid=socialshare

➡️