రంపచోడవరంలో త్రిముఖ పోరు

May 11,2024 23:55 #Rampachodavaram

– సిపిఎం అభ్యర్థి లోతా రామారావుకు ఆదరణ
– వైసిపి అభ్యర్థిపై ప్రజా వ్యతిరేకత
– విమర్శలు, ఆరోపణల వలయంలో టిడిపి అభ్యర్థి
ప్రజాశక్తి – రంపచోడవరం, రాజవొమ్మంగి విలేకరులు (అల్లూరి జిల్లా) :అల్లూరి జిల్లా రంపచోడవరంలో రాజకీయం రసవత్తరంగా మారింది. వైపిసి, టిడిపి, సిపిఎంల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పోలవరం నిర్వాసితుల సమస్యలపైనా, ఆదివాసీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపైనా మొదటి నుంచీ పోరాడుతున్న సిపిఎంకు ఈ ఎన్నికల్లో మంచి ఆదరణ లభిస్తోంది. నియోజకవర్గంలో 11 మండలాలున్నాయి. పోలవరం నిర్వాసితులు ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. నియోజకవర్గంలో కూటమి తరుపున టిడిపి అభ్యర్థి మిరియాల శిరీషా దేవి, వైసిపి నుంచి నాగులాపల్లి ధనలక్ష్మి, సిపిఎం నుంచి లోతా రామారావు బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న వైసిపి అభ్యర్థి ధనలక్ష్మిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ ఐదేళ్లలో ఆమె ఈ ప్రాంత సమస్యలను, ప్రధానంగా పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో, వరదల సమయంలో పట్టించుకోకపోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. బోయ / వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చడం, జిఒ నెంబర్‌ 3 రద్దు, ఇతర ఆదివాసీల హక్కులను హరించే సమయంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి నోరు మెదపకపోవడం వంటి కారణాల వల్ల ఆమె పట్ల వ్యతిరేకత నెలకొంది. ఎమ్మెల్సీగా ఉండి రంపచోడవరం ఏజెన్సీలో అన్ని వ్యవహారాలనూ చక్కబెడుతున్న అనంతబాబుపైనే ఆమె ఆధారపడి ఉన్నారు. అనంతబాబు పలు కేసుల్లో నిందితుడు. తన కారు డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో జైలుకెళ్లిన వ్యక్తి. ఎన్నికల సందర్భంగా సిబ్బంది, పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులూ ఆయనపై ఉన్నాయి. తనకు ఎదురుతిరిగిన వారిపై దాడులకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం ఆయన చేస్తుంటారు. ఆయన తీరుపట్ల నేడు ఏజెన్సీ అంతటా వ్యతిరేకత నెలకొంది.

అవినీతి ఆరోపణలు
టిడిపి అభ్యర్థి శిరీషా దేవి రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆదివాసీలు, ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆమెకు అవగాహన లేదు. ఆమె భర్త మఠం భాస్కర్‌పై బోలెడు ఆరోపణలు ఉన్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ఆయన సిద్ధహస్తుడని నియోజకవర్గంలో చెప్పుకుంటారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.కోటి వరకు గతంలో వసూలు చేసి మోసగించినట్టు ఆరోపణలున్నాయి. గత టిడిపి ప్రభుత్వ హయాంలో మురుగుదొడ్ల డబ్బులు కూడా తినేసారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇవి టిడిపి అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి.
సిపిఎం వైపు ప్రజల మొగ్గు
సిపిఎం నుంచి లోతా రామారావు బరిలో ఉన్నారు. ఇండియా వేదికలోని కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌), మాస్‌లైన్‌ (ప్రజాపంథా), ఏజెన్సీ గిరిజన సంఘం, ఆదివాసీ సంఘాలు ఆయన్ని బలపరుస్తున్నాయి. ఏజెన్సీలోని సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని మాజీ కేంద్ర మంత్రి వై.కిషోర్‌చంద్రదేవ్‌ బహిరంగంగా ప్రకటించడం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇటీవల రంపచోడవరంలో పర్యటించి రామారావును గెలిపించాలని కోరడం వంటిని కొత్త ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. రామారావు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. లోదొడ్డి పంచాయతీకి రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికై ఆదర్శ ప్రజాప్రతినిధిగా నిలిచారు. రాష్ట్ర విభజన తరువాత ఈ పదేళ్లలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు విలీన మండలాలను, ఇక్కడి నిర్వాసితులను గాలికొదిలేసిన వైనాన్ని ప్రజల్లోకి ఆయన బలంగా తీసుకెళ్లారు. కూనవరంలో ఈ నెల 9న నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంతో సిపిఎం శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుల ప్రసంగం ఆ సభలో నిర్వాసితులను ఆలోచింపజేసింది. సిపిఎంకు ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ యువత నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రధాన పోటీదారుగా సిపిఎం బలపడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మతోన్మాద బిజెపి తమను అడవి నుంచి తరిమేసే కుట్రలను పసిగట్టిన ఆదివాసీలు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా సంఘటితమవుతున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే రాజ్యాంగం రద్దుతో పాటు ఆదివాసీల చట్టాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని వారంతా భావిస్తున్నారు. వైసిపి, టిడిపి గెలుపు.. బిజెపి గెలిపేననిప్రజలు అనుకుంటున్నారు. పోలవరం నిర్వాసితుల్లోనూ ప్రధాన పార్టీలు ఏవి గెలిచినా మరణ శాసనమే కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే బిజెపిని, దానికి తొత్తులుగా ఉన్న టిడిపి, వైసిపిలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2022 జులైలో గోదావరి వరదలు ముంపు మండలాలను అతలాకుతలం చేసిన సమయంలో వైసిపి, టిడిపి, బిజెపిలు నిర్వాసితుల పక్షాన నిలవలేదు. సిపిఎం మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది. వరదల సమయంలో నాలుగు మండలాల్లో సిపిఎం గ్రామ గ్రామానా భోజనాల ఏర్పాటు చేసింది. విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించారు. గత ఏడాది నెల్లిపాక నుండి ముంపు మండలాల మీదుగా విజయవాడ వరకు నిర్వాసితుల పక్షాన సిపిఎం పోలవరం పోరుకేక పేరిట పాదయాత్ర నిర్వహించింది. దీంతో ఆ సమస్య జాతీయస్థాయికి వెళ్లింది. పదేళ్ల కాలంలో ఈ ప్రాంత సమస్యలను పట్టించుకోని టిడిపి, వైసిపిలపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత సిపిఎంకు సానుకూలంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సిపిఎం ఎమ్మెల్యేలుగా నాడు గెలిచి విశేష సేవలందించిన కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలను ఇక్కడి ప్రజలు గుర్తుచేసుకుంటూ మళ్లీ ఎర్రజెండాను ఇక్కడ గెలిపించాలని అనుకుంటున్నారు.

➡️