కాకినాడలో త్రిముఖ పోరు

Apr 27,2024 00:39 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి :కాకినాడ ఎంపి స్థానానికి త్రిముఖ పోరు దాదాపుగా ఖాయమైంది. ఈ నెల 25తో నామినేషన్ల ప్రక్రియకు తెరపడడంతో వైసిపి, కాంగ్రెస్‌, జనసేన పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కాకినాడ లోక్‌సభ నుంచి కాబోయే ఎంపి ఎవరనేదానిపై ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
మూడు సార్లు మూడు పార్టీల నుంచి ఇదే స్థానం నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌ నాలుగోసారి మళ్లీ బరిలో నిలిచారు. మరోసారి కాకినాడ ఎంపి స్థానానికి వైసిపి అభ్యర్థిగా తలపడుతున్నారు. మూడుసార్లు ఓటమి చెందారనే సానుభూతి కూడా సునీల్‌పై ఎక్కువగానే ఉంది. మరోవైపు సునీల్‌కు జిల్లాలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గురువారం భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టిన సునీల్‌ అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు.
ఇండియా కూటమి నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో నిల్చొన్నారు. సుదీర్ఘకాలంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంతో ఆయన కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ఆయన తాత, తండ్రి కూడా కాకినాడ పార్లమెంటు స్థానానికి ఎంపిలుగా ప్రాతినిథ్యం వహించారు. తాత పల్లంరాజు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి సంజీవరావు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఎలక్ట్రానిక్స్‌ మంత్రిగా సేవలందించారు. పల్లంరాజు మూడు సార్లు ఎంపిగా విజయం సాధించారు. రెండు సార్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. ఈయనకూ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బంధువులు, సహచరులు, అనుచరులు, అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా మరోసారి లోక్‌సభలో అడుగు పెడతాననే ధీమాను పల్లంరాజు వ్యక్తం చేస్తున్నారు.
టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా టీ టైం అధినేత ఉదరు శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. రాజమండ్రి రూరల్‌ కడియం ప్రాంతానికి చెందిన ఉదరును జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా 8 నెలల క్రితం నియమించారు. పిఠాపురం నుంచి ఆయన బరిలో ఉంటారని అందరూ భావించారు. అనంతరం జరిగిన పరిణామాల నడుమ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగారు. దీంతో తనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఉదరును కాకినాడ ఎంపి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే స్థానికేతరుడు అనే అంశంపై వైసిపి నేతలు ఆయనపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలో పరిచయాలు తక్కువగా ఉండడం పెద్దగా పేరు తెలియని వ్యక్తి కావడం ప్రతికూల అంశాలు. మరోవైపు అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన ప్రచారంలో రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన సాగుతున్నారు. అంతేకాకుండా సొంత పార్టీ నుంచే గ్రూపుల పోరు ఉదరును పట్టిపీడిస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం సొంత సొమ్ములను ఖర్చు చేస్తూ కష్టపడి పని చేస్తున్న వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఆయనపై ఎక్కువగా ఉన్నాయి. దీంతో సొంత పార్టీ వారే ఉదరుకు సహకరించని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు టిడిపి అభ్యర్థులు పూర్తిస్థాయిలో సహకరించట్లేదు. ఆయా నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు వారి గెలుపు కోసమే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎంపి అభ్యర్థి ప్రస్తావనే ఉండట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాకినాడలో జరిగిన ఉదరు శ్రీనివాస్‌ నామినేషన్‌ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ స్వయంగా హాజరై కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అయితే ఇది లోక్‌సభ స్థానంలో ఆయన విజయానికి ఏ విధంగా తోర్పడుతుందనేది ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.

➡️