అందరి దృష్టి మంగళగిరిపైనే

May 13,2024 00:20 #Mangalagiri

-నారా లోకేష్‌ భవిష్యత్తును తేల్చనున్న ఫలితాలు
– పట్టు నిలుపుకునేందుకు వైసిపి యత్నం
– ప్రధాన అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేయనున్న సిపిఎం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి రాజధాని ప్రాంతం మంగళగిరిపైనే కేంద్రీకృతమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ టిడిపి, వైసిపి మధ్య ఉన్నా ఇండియా వేదిక తరపున సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న జొన్నా శివశంకరరావు ప్రధాన పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేసేలా ప్రచారంలో దూసుకుపోయారు. టిడిపి నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పోటీ చేస్తుండగా, వైసిపి నుంచి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్య పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్‌ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. 2014, 2019లో రెండు సార్లు వైసిపి అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు.

40 ఏళ్లుగా టిడిపికి ఎదురుదెబ్బ
లావణ్య తల్లి కాండ్రు కమల 2009లో మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు 1999, 2004లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. 2006లో ఆయన మంత్రిగా పనిచేశారు. 1985 తరువాత ఈ నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే లేకపోవడం కూడా ఆ పార్టీకి గత 40 ఏళ్లుగా ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.
కమ్యూనిస్టులకు పట్టున్న ప్రాంతం
కమ్యూనిస్టులకు బాగా పట్టున్న నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. టిడిపి పొత్తుతో 1995లో సిపిఎం తరపున నిమ్మగడ్డ రామ్మోహనరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004, 2009, 2014లోనూ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఎవరితోనూ పొత్తు లేకుండానే పోటీ చేస్తూ ప్రధాన పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేశారు. 2019లో జనసేన, బిఎస్‌పి పొత్తుతో సిపిఎం పోటీ చేసింది. ఈసారి ఇండియా వేదిక తరపున కాంగ్రెస్‌, సిపిఐ మద్దతుతో సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు పోటీ చేస్తున్నారు. గత రెండు నెలలుగా ఆయన విస్తృత ప్రచారం చేశారు. ఆయనకు వివిధ తరగతుల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రైతులు, కార్మికులు, ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. పలు ఉద్యమాలు నిర్వహించిన శివశంకరరావుకు ప్రచారంలో అన్ని గ్రామాల నుంచి సానుకూలత వస్తోంది.
గెలుపు అవకాశాలు ఉన్నా గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించడం ద్వారా టిడిపి, వైసిపి అభ్యర్థుల విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో సిపిఎం కృషి చేసింది. వీరిలో 15 వేల మందికి పట్టాలను రెగ్యులరైజ్‌ చేశారు. ఇంకా 25 వేల మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. గత పదేళ్లుగా ఈ అంశంపై వివిధ పోరాటాలు చేస్తున్నా వైసిపి, టిడిపి పట్టించుకోలేదు. అయితే ఈసారి నారా లోకేష్‌ మాత్రం తాను గెలిస్తే 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే గుంటూరు ఛానల్‌ తూటికాడ తొలగింపు సమస్యపై సిపిఎం పెద్దయెత్తున ఆందోళన చేసింది. పెదవడ్లపూడి హైలెవెల్‌ ఛానల్‌ పనులు పూర్తిచేయడం ద్వారా 26 వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించే పనులు చేపట్టాలని సిపిఎం ఆందోళనలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 20 శాతం పూర్తి కావాల్సి వుంది. వీటి పూర్తికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చిత్తశుద్ధితో కృషి చేయలేదన్న విమర్శలు ఉన్నాయి.
3 రాజధానుల ప్రతిపాదనపై వ్యతిరేకత
రాజధానిలో భాగమైన మంగళగిరి నియోజకవర్గంలో మూడు రాజధానుల ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఈ అంశం టిడిపికి కొంత సానుకూలత పెంచుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వైసిపి ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా ఉన్నారని వీరు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని టిడిపి అభ్యర్థి లోకేష్‌ విశ్వసిస్తున్నారు. అలాగే 2019లో ఓడిపోయిన తరువాత నియోజకవర్గ ప్రజలతో ఆయన మంచి సంబంధాలు కొనసాగించారు. వైసిపి అభ్యర్థి లావణ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు.

➡️