మైకులు బంద్‌

May 12,2024 00:11 #ap elections

-రాష్ట్రంలో ముగిసిన ప్రచారం
– మూత పడిన మద్యం షాపులు, బార్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రోజుల తరబడి హోరెత్తిన మైకులు మూగబోయాయి. ఎన్నికల కమిషన్‌ నిబందనల మేరకు శనివారం సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రంలో ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే రాష్ట్రంలో ప్రారంభమైన ప్రచార పర్వం నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత తీవ్రస్థాయినందుకుంది. ఎన్నికల బరిలో నిలిచిన అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం సాగించాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 27వ తేదీన మేమంతా సిద్ధం బహిరంగ సభకు శ్రీకారం చుట్టి 106 నియోజకవర్గాల్లో బస్సుయాత్రలు, ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. అలాగే బస్సు యాత్రలో భాగంగా 16 సిద్ధం సభలు, 34 ప్రచార సభలు, 14 నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు నిర్వహించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో 89 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అంతకుముందు రా కదలిరా పేరుతో 25 పార్లమెంట్లలో భారీ బహిరంగలు నిర్వహించారు. ప్రజాగళం, రా కదలిరా సభలతో కలిసి చంద్రబాబు 104 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా వివిధ పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం పూర్తిచేశారు. ప్రచార పర్వం ముగియడంతో పాటే, డ్రైడే అమలులోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఏడు గంటల నుండి మద్యం దుకాణాలు, బార్లు మూసివేశారు. 48 గంటల పాటు ఈ మూసివేత కొనసాగనుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకు ఈ నిషేదం కొనసాగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2934 మద్యం దుకాణాలు (ప్రభుత్వం నిర్వహించే), 458 టూరిజం అవుట్‌లెట్‌లు, 840 బార్లు, 42 స్టార్‌ హోటల్‌ బార్స్‌, 8 మైక్రో బేవరి బార్స్‌, 31 టిడి1 బార్లు, 22 క్లబ్బులు నడుస్తున్నాయి. వీటన్నింటిలోనూ మద్యం విక్రయాలు నడుస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో మొత్తం ఇవన్నీ మూత పడ్డాయి.

➡️