తప్పిన తుపాను.. పెరిగిన ఉక్కపోత

May 27,2024 10:15 #summar, #Tufan, #weather report

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెమాల్‌ తుపాను ముప్పు రాష్ట్రానికి తప్పినా.. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగి తీవ్రమైన వడగాడ్పులు వీస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులు వీయడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్రంలోని ఎన్‌టిఆర్‌ జిల్లాలో 40.9 డిగ్రీలు, పల్నాడు జిల్లాలో 40.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలో 40.7, తిరుపతి జిల్లాలో 40.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదయ్యాయి. అలాగే కృష్ణా, నెల్లూరు, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం వుందన్నారు. సోమవారం 272 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాడ్పులు వీచే అవకాశం వుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 3 మండలాలు, విజయనగరం జిల్లాలో 17, పార్వతీ పురం మన్యం జిల్లాలో 10, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, అనకాపల్లిలో 2, కాకినాడలో 6, కోనసీమలో 2, తూర్పుగోదావరిలో 17, పశ్చిమగోదావరిలో 3, ఏలూరులో 7, కృష్ణాలో 2, బాపట్ల జిల్లాలో ఒకటి చొప్పున ఆయా మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం వుందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాలు, విజయనగరం జిల్లాలో 7, పార్వతీపురం మన్యం జిల్లాలో 5, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 8, విశాఖపట్నంలో ఒకటి, అనకాపల్లిలో 14, కాకినాడలో 14, కోనసీమలో 11, తూర్పుగోదావరిలో 2, పశ్చిమగోదావరిలో 13, ఏలూరులో 21, కృష్ణాలో 19, ఎన్‌టిఆర్‌లో 17, గుంటూరులో 17, పల్నాడులో 12, బాపట్లలో 19, ప్రకాశం జిల్లాలో 8 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం వుందని అన్నారు. తీవ్ర వడగాడ్పులు, వడ గాడ్పులు వీచే మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండె జబ్బులున్నవారు, రక్తపోటు, షుగర్‌ వ్యాధిగ్రస్తులు కూడా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని సూచించారు.

➡️