సహాయకులకు ఒక పలకరింపు ..!

May 15,2024 05:55 #feachers, #Jeevana Stories

ఇంట్లో అమ్మ, అక్క, నాన్న మొదలుకొని, వీధిలో కూరగాయలు, పండ్లు, పూలు అమ్మేవారు, ట్రాఫిక్‌ పోలీసులు, ఆటోడ్రైవర్లు, రిక్షా కార్మికులు.. ఇలా ఎంతోమందిని నిత్యం కలుస్తుంటాం. వాళ్లు చేసే పని ఎంత గొప్పది అయినా, ఒక్కసారి కూడా వాళ్లవైపు కన్నెత్తి చూడం. ఒక చిన్న చిరునవ్వు రువ్వి, అభినందనపూర్వకంగా పలకరించం. ‘వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. వాళ్లతో మానకేం పని?’ అన్నట్టు మసలుకొంటాం. అయితే అటువంటి వారి కళ్లల్లో ఆనందం కోసం 37 ఏళ్ల అభినవ్‌ మల్హోత్రా ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. ప్రత్యేకంగా గ్రీటింగ్‌ కార్డులు తయారు చేయిస్తున్నాడు. ఆ కార్డును, ఓ పువ్వునూ జత చేసి, స్వయంగా తానే ఒక చిర్నవ్వుతో వారికి అందిస్తున్నాడు. ఇది చాలా చిన్న అభినందన.. కానీ అది వాళ్ల జీవితంలో ఎప్పుడూ తారసపడనిది. ఎవ్వరూ ఇవ్వనిదీ. అందుకే వాళ్ల పట్ల అభినవ్‌ చూపిస్తున్న కృతజ్ఞతకి ఎంతగానో సంతోషపడుతున్నారు. మనసారా ధన్యవాదాలు చెబుతున్నారు.
ఢిల్లీలో నివసించే అభినవ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. ‘దేవుడు గుళ్లల్లో, చర్చిల్లో, మసీదుల్లో ఉండడు. నిత్యం మీ కళ్ల ముందు కనిపించే శ్రమ జీవుల్లో ఉంటాడు’ అంటాడు. ‘షాపుకెళ్లినప్పుడు బయట ఉండే సెక్యూరిటీ గార్డుని ఒక్కసారి పలకరించి చూడండి. అతని కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాఫిక్‌ సిగల్స్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసును ఒక్కసారి పలకరిస్తే, అతను ఎంత ఆనంద పడతాడో తెలుస్తుంది. మీ ఇంటికి రోజూ కూరగాయలు ఇచ్చే వ్యక్తిని గుర్తుపెట్టుకుని మరీ పలకరించి చూడండి. అతను మీ పట్ల ఎంత కృతజ్ఞత చూపిస్తాడో’ అని ఒక్కొక్క వ్యక్తి గురించి తన అనుభవాలను మనకూ పరిచయం చేస్తాడు.
‘హ్యాపీనెస్‌ బ్రిగేడ్‌’, ‘రబ్‌ శుక్రాన్‌’ పేరుతో 2019 నుంచి తన మిత్రుల సహకారంతో అభినవ్‌ ఈ పలకరింపు కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ కృతజ్ఞత తెలియజేయడం అనే ఆలోచన ఎందుకు వచ్చిందీ అని అడిగితే, ఇలా చెబుతాడు : ‘మా నాన్న మా కోసం ఎంతో కష్టపడేవాడు. చెల్లిని, నన్ను చదివించాలని తన సంతోషాలు, సుఖాలు అన్నీ వదులుకున్నాడు. ఇవేమీ మాకు తెలియదు. ఆయన చివరి రోజుల్లో మంచంపై పడుకుని శూన్యంలోకి అలా చూస్తూ ఉండేవాడు. ఏమీ మాట్లాడేవాడు కాదు. నాన్న కోలుకోవాలని ఎన్నో దేవుళ్లని వేడుకున్నాను. ఎవ్వరూ నా మొర ఆలకించలేదు. నాన్న చనిపోయాక దేవుణ్ణి నమ్మడం మానేశాను. నాన్న చివరి క్షణంలో ఆయన ముఖంలో కనిపించిన వెలితి నన్ను చాలాకాలం వెంటాడింది. నాన్న మా కోసం అంత కష్టపడ్డాడు కదా! ఒక్కసారైనా నేను ఆయనకి కృతజ్ఞత చెప్పానా? అని ఆలోచించాను. లేదు. ఇప్పుడు మా నాన్నని గట్టిగా హత్తుకుని కృతజ్ఞత చెప్పాలని ఉంది. కానీ ఆయన లేడు.. అప్పుడే ‘రబ్‌ శుక్రాన్‌’ ఆలోచన వచ్చింది. నా చుట్టూ ఎంతోమంది నాన్న లాంటి వారు కష్టపడుతున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. స్నేహితులతో చర్చించాను. వాళ్లు కూడా నాతో చేయి కలపడానికి సిద్ధపడ్డారు.’


రోడ్డు మీద రిక్షా తొక్కుకుంటూ జీవనం సాగిస్తున్నాడు బషీర్‌. తన కొడుకును బాగా చదివించాలన్నది ఆయన కోరిక. అభినవ్‌కి బషీర్‌ బాగా తెలుసు. కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడో రోజూ చూస్తున్నాడు. అందుకే ఒక రోజు ఓ చక్కని సందేశం రాసి వున్న గ్రీటింగ్‌ కార్డుతో బషీర్‌ రిక్షా దగ్గరికి వెళ్లాడు. అభినవ్‌ని చూస్తూనే ‘ఎక్కడికి బాబూ?’ అని అడిగాడు బషీర్‌. ‘ఎక్కడికీ వద్దు గానీ, ఇదిగో ఈ గ్రీటింగ్‌ కార్డు తీసుకో. ఈ పువ్వు కూడా నీ కోసమే తెచ్చాను’ అంటూ అతనికి అందించాడు. బషీర్‌ అయోమయంగా అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు అభినవ్‌ అతనికి అర్థమయ్యేలా విషయం చెప్పాడు. అతను చెప్పడం పూర్తి అవ్వటంతోనే, బషీర్‌ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
‘నా కష్టాన్ని గుర్తించే వారు ఇప్పటివరకు నాకు కనిపించలేదు. ఇంట్లో వాళ్లు కూడా ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. నువ్వు మాత్రం నా కష్టాన్ని గుర్తించావు. కృతజ్ఞత చెబుతున్నావు. చాలా చాలా సంతోషంగా ఉంది.’ అని అభినవ్‌ చేతులు పట్టుకుని అదేపనిగా ఊపేశాడు. ఇది రబ్‌ శుక్రాన్‌ ప్రయాణంలో ఓ చిన్న ఉదాహరణ. ఇలాంటి సంఘటనలకు గుర్తుగా అభినవ్‌ ఇప్పటివరకు 15 వేల గ్రీటింగ్‌ కార్డులు వివిధ రకాల వృత్తులు చేసుకునే వారికి పంచిపెట్టాడు. ఒకసారి ట్రాఫిక్‌ పోలీసుకి ఇచ్చినప్పుడు అతను ఎంతో సంతోషంగా తనని అభినందించిన సందర్భాన్ని అభినవ్‌ గుర్తు చేసుకుంటాడు.
‘ఓసారి ప్రధాని నరేంద్రమోడీ ఇంటి గుమ్మం దగ్గర సెక్యూరిటీ చేసే గార్డులకు గ్రీటింగ్‌ కార్డులు పంచిపెట్టాను. ఇంటికి వచ్చిన అరగంట తర్వాత నాకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఒక సెక్యూరిటీ గార్డు ఫోన్‌ చేసి అదే పనిగా ఏడుస్తున్నాడు. ”నేను చాలా ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాను. నిత్యం వందల కార్లు బయటికి వెళతాయి. లోనికి వస్తాయి. ఎవ్వరూ మావైపు కన్నెత్తి చూడరు. కుటుంబానికి దూరంగా నెలల తరబడి పనిచేస్తాం. ఈ ఉద్యోగం చేయడం గర్వకారణంగా ఉన్నా, మా త్యాగాలను ఎవ్వరూ గుర్తించరు. ఈ రోజు నువ్విచ్చిన చిన్న గ్రీటింగ్‌ కార్డు నాకు కొండంత సంతోషాన్ని ఇచ్చింది. నా ఆనందాన్ని నీతో పంచుకోవాలని ఫోను చేశాను.’ అని అతను చెప్పిన సందర్భాన్ని అభినవ్‌ ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు.
”ఇలాంటి వ్యక్తులను ఎంతోమందిని చూస్తున్నాను. ఓ చిన్న కృతజ్ఞత వారిని ఎంత ఆనందానికి గురిచేస్తుందో తెలిసాక, నా ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా చేస్తున్నాను” అని చెబుతున్నాడు అభినవ్‌.

➡️