Assam : ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టం మరో ఆరు నెలలు పొడిగింపు

Mar 29,2024 14:55 #AFSPA, #Assam

గువహటి   :   సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు ) చట్టం -1958 (ఎఎఫ్‌ఎస్‌పిఎ)ని ఆరునెలలు పొడిగించినట్లు అస్సాం ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ‘డిస్ట్రర్బ్డ్‌ ఏరియాస్‌ ‘ కింద టిన్సుకియా, దిబ్రుగడ్‌, చారైడియో, శివసాగర్‌ జిల్లాల్లో ఏప్రిల్‌ 1 నుండి ఎఎఫ్‌ఎస్‌పిసిని పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని, అయితే ఈ నాలుగు జిల్లాల్లో ఒక ఉగ్రవాద సంస్థ క్రియాశీలకంగా ఉందని ఇటీవల అస్సాం పోలీసులు ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించారు.

ఈ నివేదిక ఆధారంగా ఈ నాలుగు జిల్లాలను ‘డిస్ట్రర్బ్డ్‌ ఏరియాస్‌’గా గుర్తించి మరో ఆరునెలల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖను కోరినట్లు సంబంధిత అధికారి తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుండి సెప్టెంబర్‌ 30 వరకు ఈ చట్టం అమలులో ఉంటుందని తెలిపారు.

1990 నవంబర్‌లో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం  అస్సాం రాష్ట్రాన్ని డిస్ట్రర్బ్డ్‌ ఏరియాగా ప్ర కటిస్తూ..  ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టం విధించింది.  అప్పటి నుండి వరుసగా ఆరు నెలలు పొడిగిస్తూ వచ్చింది.    2022 ఏప్రిల్‌ 1న  తొమ్మిది జిల్లాలు, కాచర్‌ జిల్లాలో కొంత భాగాన్ని మినహాయించి  రాష్ట్రవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఉపసంహరించింది.    ఇటీవల  జోర్హాట్‌, గోల్‌ఘాట్‌, కర్బి, అంగ్లాంగ్‌, డిమాహసావో జిల్లాల నుండి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంది.

➡️