డిజిపిపై బదిలీ వేటు

May 6,2024 07:53 #ap dgp, #Transfer

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డిపై బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి వైదొలగాలని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డికి ఆదేశాలిచ్చింది. సోమవారం ఉదయం 11 గంటల్లోగా సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులతో కూడిన ముగ్గురి పేర్ల జాబితాను పంపించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. జాబితాలో చేర్చేవారి ఐదేళ్ల పనితీరు నివేదిక, విజిలెన్స్‌ క్లియరెన్స్‌ నివేదికల్ని కూడా కమిషన్‌కు పంపించాల్సిందిగా సూచించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకు ముందు నుండే డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి పనితీరుపై ఫిర్యాదులు అందాయి. విపక్ష పార్టీలకు చెందిన కీలకనేతలు వచ్చినపుడు కనీసం వారి నుంచి వినతిపత్రాలను తీసుకునేందుకు చొరవచూపని డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డి అధికార పార్టీకి సంబంధించి ఎవరొచ్చినా అపాయింట్‌మెంటు ఇచ్చి వినతిని తీసుకోవడం పట్ల విపక్షాలు మండిపడ్డాయి. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలపై ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోరన్న విమర్శలూ వున్నాయి. సోషల్‌ మీడియాలో పోస్టుల అంశంలో మరీ పచ్చిగా వైసిపికి అనుకూలంగా వ్యవహరించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాచర్లలో అధికార పార్టీ విధ్వంసాన్ని వెనకేసుకు రావడంతోపాటు తెలుగుదేశం నేతలదే తప్పన్నట్లుగా మాట్లాడటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే కెవి రాజేంద్రనాథ్‌రెడ్డికి డిజిపి బాధ్యతలు ఇచ్చే అంశాల్లో కూడా అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం ఐపిఎస్‌ అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఆయన కంటే ముందున్న 11 మంది సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులను పక్కనపెట్టి కెవి రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డిజిపిగా ప్రభుత్వం నియమించినపుడే పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి.

ఇద్దరు డిఎస్‌పిలపైనా చర్యలు
రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఇద్దరు డిఎస్‌పిలను ఎన్నికల విధుల్లోంచి తప్పించింది. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతో అనంతపురం టౌన్‌ డిఎస్‌పి వీరరాఘవరెడ్డి, రాయచోటి డిఎస్‌పి సయ్యద్‌ మహబూబ్‌బాషాను బదిలీ చేస్తూ ఎన్నికల విధులకు దూరంగా వుంచాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.

➡️