నిలబడలేకపోతున్నామయ్యా..!

May 2,2024 11:01 #issue, #pensions

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (గుంటూరు) : ఎన్నికల వేళ … పింఛనుదారులు పడరానిపాట్లు పడుతున్నారు. తీవ్రవడగాల్పులతోపాటు  భరించలేని మండుటెండలో ముసలివారు గొంతెండిపోతున్నప్పటికీ … పింఛను కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. సాధారణంగా నెల మొదటి తేదీన పింఛన్లు వచ్చేవి. ఎన్నికల కారణంగా … లేవలేనివారికి, నడవలేనివారికి పింఛన్లను ఇండ్ల వద్దకే తెచ్చి ఇస్తామని చెప్పారు కానీ… తమ వరకు పింఛను వస్తుందో రాదో..! ఆ పండుముసలివారికి చెప్పే దిక్కు లేదు. నెలెప్పుడొస్తుందా.. అని ఆశగా పింఛను కోసం ఎదురుచూసే వృద్ధులు కాళ్లకు సత్తువ తెచ్చుకొని బ్యాంకుల బాట పట్టారు. ఈరోజు 2వ తేదీ ఈ రోజు కూడా దాటితే పింఛను అందదేమో అని భయం..! అందుకే గురువారం ఉదయం నుండే బ్యాంకుల వద్ద ఆ ముసలిప్రాణాలు పడిగాపులుకాస్తున్నాయి..!

గుంటూరు : పింఛను డబ్బులు కోసం వృద్దులు బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నారు. ఇంటింటికి పించన్లు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వం పింఛను డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. బ్యాంకు ఖాతాల్లో పడిన పించన్‌ నగదు తీసుకునేందుకు వఅద్ధులు అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులవద్ద పండుటాకులు పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వ వైఖరితో పింఛనుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిలబడలేకపోతున్నా..!
చిత్తూరు : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో పింఛన్‌ కోసం లబ్దిదారులు క్యూలు కట్టారు. సపారు మునెమ్మ అనే వృద్ధురాలు కనీసం నడవలేని స్థితిలో క్యూలో నిలబడలేక కూర్చుండిపోయింది. కాళ్లు నిలబడటం లేదయ్యా.. ఏం చేయను.. అంటూ దీనంగా మొరపెట్టుకుంటోంది.

మన్యం : పెన్షన్ల కోసం ముసలివారంతా పడిగాపులు కాస్తున్నారు. మన్యం వీరఘట్టంలో పింఛన్‌ కోసం బ్యాంకుల వద్ద లబ్ధిదారులు క్యూ కట్టారు.

➡️