నైతిక విలువలే కమ్యూనిస్టుల ఆస్తి

  •  సుబ్బారావుకు వి.శ్రీనివాసరావు నివాళి

ప్రజాశక్తి-కొల్లూరు (బాపట్ల జిల్లా) : నైతిక విలువలే కమ్యూనిస్టుల ఆస్తి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మరణించిన బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు ధూళిపాళ్ల సుబ్బారావు భౌతికకాయాన్ని రైతుసంఘం రాష్ట్ర నాయకులు పి.నరసింహారావుతో కలిసి సోమవారం ఆయన సందర్శించి, నివాళులర్పించారు. సుబ్బారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలో సుబ్బారావును చూసి నేర్చుకోవాలని, ఈ తరం యువకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సుబ్బారావు పెద్దగా చదువుకోకపోయినప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు, నైతిక విలువలకు కట్టుబడి తుది శ్వాస వరకూ వాటికి కట్టుబడి పనిచేశారని కొనియాడారు. మూఢనమ్మకాలు కాలగర్భంలో కలిసిపోతాయని, సైన్సు దినదినాభివృద్ధి చెందుతుందని.. కమ్యూనిజం కూడా సైన్స్‌ లాంటిదని దీనికి అంతం ఉండదని చెప్పారు. అమెరికా లాంటి దేశాలు కమ్యూనిజం ఎక్కడుందని హేళన చేశాయని, ఈ రోజు చైనాను చూసి అమెరికా ఆందోళన చెందుతోందని, కమ్యూనిజానికి అంతం ఉండదని చెప్పారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మతం పేరుతో లబ్ధి పొందాలని ప్రధాని చూస్తున్నారని, ఇలా అయితే దేశంలో ఐక్యత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. రైతుసంఘం నాయకులు పి.నరసింహారావు మాట్లాడుతూ.. సుబ్బారావు సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమానికి సిపిఎం కొల్లూరు మండల నాయకులు బి.సుబ్బారావు అధ్యక్షత వహించారు. తదనంతరం సుబ్బారావు పార్థివదేహాన్ని విజయవాడ నిమ్రా మెడికల్‌ కాలేజీకి దానం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం తెనాలి నాయకులు ములక శివసామిరెడ్డి పాల్గొన్నారు.

➡️