రోహిత్‌ వేముల కేసు రీ ఓపెన్‌

  •  సమగ్ర దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
  •  కోర్టు అనుమతి కోసం త్వరలో పిటిషన్‌ దాఖలు చేస్తాం : డిజిపి రవిగుప్త వెల్లడి

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పిహెచ్‌డి స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును రీ ఓపెన్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిజిపి రవిగుప్తను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.యూనివర్సిటీ విసి తనపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలతో మనస్తాపం చెందిన రోహిత్‌ వేముల 2016 జనవరి 17న వర్సిటీ హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ప్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ( క్రైం నెంబర్‌ 20/2016 ) కేసు నమోదయింది. రోహిత్‌ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హెచ్‌సియు వైస్‌ ఛాన్సలర్‌ పొదిలి అప్పారావు కుల దురహంకార చర్యలతోనే దళిత విద్యార్ధి రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, విద్యార్ధి సంఘాలు ఆందోళనలు చేపట్టారు. రాజకీయంగానూ దుమారం రేపింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ వర్సిటీకి వచ్చి రోహిత్‌ వేముల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కేసును 2023 నవంబర్‌ వరకు దర్యాప్తు చేసిన తెలంగాణ పోలీసులు… గత నెల 21న కోర్టుకు క్లోజర్‌ రిపోర్ట్‌ సమర్పించారు. రోహిత్‌ వేముల దళితుడు కాదని, అసలు విషయం బైటపడుతుందనే ఆత్మహత్య చేసుకున్నాడని అందులో వెల్లడించారు. ఈ విషయం శుక్రవారం బైటకు రావడంతో రోహిత్‌ వేముల కుటుంబ సభ్యులు, విద్యార్ధి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. హెచ్‌సియులో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. రోహిత్‌ వేములకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో సిఎం రేవంత్‌ రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ కేసును రీ ఓపెన్‌ చేసి అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిజిపిని ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి డిజిపి రవిగుప్త పత్రికా ప్రకటన విడుదల చేశారు. కోర్టు అనుమతి తీసుకుని కేసును మళ్లీ దర్యాప్తు చేస్తామని డిజిపి వెల్లడించారు.

బిజెపి నేతల కోసమే తప్పుడు నివేదిక – సిపిఎం
రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు నుంచి అప్పటి హెచ్‌సియు విసి, బిజెపి నేతలను తప్పించడానికే రాష్ట్ర పోలీసులు అత్యుత్సాహంతో కలెక్టర్‌ నివేదిక రాకముందే హైకోర్టుకు తప్పుడు నివేదికను సమర్పించారని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ కేసును పునర్విచారణ చేపడుతున్నట్లు డిజిపి ప్రకటించడాన్ని సిపిఎం స్వాగతించింది. ఈ కేసును రాజకీయ అంశంగా చూడకుండా సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని , ఇలాంటి ఘటనలు ఏ యూనివర్సిటీలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

➡️