AAP : బిజెపి రాజకీయ ఆయుధంగా ఇడి

న్యూఢిల్లీ   :   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) బిజెపి రాజకీయ ఆయుధంగా పనిచేస్తోందని ఆప్‌ సీనియర్‌ నేత అతిషి వ్యాఖ్యానించారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఫోన్‌ను యాక్సెస్‌ చేయడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ రాజకీయ వ్యూహాల వివరాలను పొందాలనుకుంటోందని సీనియర్‌ ఆప్‌ నేత అతిషి వ్యాఖ్యానించారు.

కేజ్రీవాల్‌ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించాలని ఇడి పట్టుబడుతోందని, అయితే ఆ వివరాలు కావాల్సింది ఇడికి కాదని, బిజెపికి అని ఆమె పేర్కొన్నారు. లిక్కర్‌ పాలసీ 2021-22 మధ్య అమలైందని, ప్రస్తుతం కేజ్రీవాల్‌ వినియోగిస్తున్న ఫోన్‌ కొన్ని నెలల క్రితందని అన్నారు. దీంతో ఇడి బిజెపి రాజకీయ ఆయుధంగా పనిచేస్తోందని నిర్థారణైందని చెప్పారు.  ఆ సమయంలో కేజ్రీవాల్   ఫోన్‌ అందుబాటులో లేదని ఇడి తెలిపిందని,  ఇప్పుడు  ఫోన్‌ పాస్‌ వర్డ్‌ కావాలని ఇడి  కోరుతోందని అన్నారు.

ఆప్‌ లోక్‌సభ ఎన్నికల వ్యూహం, ప్రచార ప్రణాళికలు, ఇండియా ఫోరం నేతలతో చర్చలు, మీడియా, సోషల్‌ మీడియా వ్యూహాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇడి యత్నిస్తోందని అన్నారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఇడి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇడి కస్టడీని ఏప్రిల్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు రోస్‌ అవెన్యూ కోర్టు పేర్కొంది.

➡️