కొబ్బరి ధర పతనం

May 21,2024 02:30 #Fall prices, #kobbari
  • రూ.3 వేల వరకూ పడిపోయిన కాయల ధర
  • మార్కెట్లో బోండాం ధర రూ.30
  • రైతుకు దక్కతున్నది రూ.10 మాత్రమే

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : కొబ్బరి పంటను తెగుళ్లు వెంటాడుతుండడంతో రైతులు ఇప్పటికే అల్లాడుతున్నారు. దీనికితోడు మరో కష్టం వారికి ఎదురైంది. జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గడంతో ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం అంబాజీపేట మార్కెట్లో కొబ్బరి బొండాలు వెయ్యి రూ.9,500 నుంచి రూ.10 వేల మధ్యలోనే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో ఒక్కొక్క బోండాం ధర సైజును బట్టి రూ.25 నుంచి రూ.30 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది ఇదే సీజన్‌లో రైతులకు రూ.13 వేల వరకూ ధర లభించింది. గతంతో పోల్చితే ఇప్పుడు రూ.3,500 వరకూ ధర పడిపోయింది.
టెంకాయల ధరలూ పతనం వైపు పరుగెడుతున్నాయి. కురిడీ కొబ్బరి వెయ్యి కాయలు పాత గండేరా రకం ధర రూ.12,500 ఉంది. గతేడాది ఇదే సీజన్లో రూ.13,500 వరకూ ధర పలికింది. ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకూ ధర పతనమైంది. గటగట రకం కొబ్బరి కాయలు గతేడాది రూ.12 వేలు పలకగా, ప్రస్తుతం రూ.10,500 మించి కొనుగోలు జరగడం లేదు. కురిడీ చిట్టి కాయలు గతేడాది వెయ్యి కాయలు రూ.5,500 చొప్పున కొనుగోలు జరగగా, ఈ ఏడాది రూ.4 వేలకు మించి ధర లభించడం లేదు. వెయ్యి నీటి కాయల ధర ప్రస్తుతం రూ.8 వేలు ఉంది. గతేడాది రూ.9,500గా పలికింది. ధరలు పడిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం తమిళనాడులో దిగుబడులు భారీగా పెరిగాయి. అక్కడి కొబ్బరికి దేశీయ మార్కెట్లో డిమాండ్‌ పెరిగిందని, కోనసీమ కొబ్బరికి డిమాండ్‌ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అక్కడ ఎకరాకు 700 కాయలు దిగుబడి రాగా, కోనసీమలో 400 మించి దిగుబడి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి లేక, ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో సాగు
తూర్పుగోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. మరో 20 వేల ఎకరాలకు సరిపడా చెట్లు ఇళ్ల వద్ద, పొలాల గట్ల వెంబడి, కాలువ గట్లపైనా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఏటా జిల్లాలో 105 కోట్ల కొబ్బరి కాయల దిగుబడి వస్తుందని అంచనా. జిల్లా నుంచి తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు కొబ్బరిని ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. అంబాజీపేట మార్కెట్‌ నుంచి ఏప్రిల్‌, మే నెలల్లో రోజుకు 25 నుంచి 30 లారీలు ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం పది లారీలకు మించి ఎగుమతులు జరగట్లేదని వ్యాపారులు చెబుతున్నారు.

పెట్టుబడి కూడా రావడం లేదు : – కె.సత్యనారాయణ వాకలగరువు, అంబాజీ పేట
గండేరా కురిడీ కాయలకు రూ.18 వేలు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం రూ.12,500 మించి ధర రావడం లేదు. సీజన్‌లోనూ ధరలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడి కూడా రావట్లేదు. ధరలు ఇలాగే ఉంటే పూర్తిగా కుదేలైపోతాం. దిగుబడి కూడా సరిగా లేదు.

ఖర్చులు పెరిగాయి : డి.నాగేశ్వరరావు, భారతీయ కిసాన్‌ కోనసీమ కొబ్బరి రైతుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు
కొబ్బరి సాగుకు ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. వెయ్యి కాయలు రూ.8 వేలు చొప్పున కొంటున్నారు. కాయలను చెట్టు నుంచి దించేందుకు ఎకరాకు రూ.3 వేల వరకూ ఖర్చవుతోంది. రూ.5,000 మాత్రమే మిగులుతోంది. ఆక్వా సాగు నేపథ్యంలో కొబ్బరి తోటలపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే ఆదుకోవాలి.

➡️