త్రిపురాంతకంలో భారీ వర్షం

May 19,2024 09:10 #andrapradesh, #heavy rains
  • పలుచోట్ల మోస్తరు వాన
  •  పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ప్రజాశక్తి- యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం ప్రకాశం, గుంటూరు, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ ఈదురుగాలులకు రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు కొమ్మలు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెనాలి ఆర్‌టిసి బస్టాండ్‌ జలమయ్యమైంది. పిడుగుపాటుకు ప్రకాశం జిల్లాలో ఒకరు, పల్నాడు జిల్లాలో మరొకరు మరణించారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంతో పాటు మండలంలోని ముడివేముల, పాపాన్నపాలెం, బడ్డుపాలెం, కంకణాలపల్లి, రాజుపాలెం, డివిఎన్‌ కాలనీ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పలు దుకాణాలు మూతపడ్డాయి. యర్రగొండపాలెం రహదారిపై చెట్టు కొమ్మలు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. త్రిపురాంతకంలోని డివిఎన్‌ కాలనీకి చెందిన నారాయణ (37) తమ పశువులను మేపేందుకు గ్రామసమీపంలోని పొలాల్లోకి తోలుకెళ్లారు. అదే సమయంలో ఆయనకు సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మరణించారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఎముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు హనుమంతరావు (40) తమ గేదేలను మోపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనకు సమీపంలో పిడుగుపడడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో వర్షం కురిసింది. పెదబయలులో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో పాటు ఈదురుగాలులూ వీచాయి. కొన్ని గ్రామాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి.

➡️