కన్నవాళ్ల విలువను చాటే ‘ఇంద్రప్రస్థం’

May 20,2024 05:45 #natika, #sahityam

”నాన్న ఉన్న ఇల్లు దానికదే ఒక ఇంద్రప్రస్థం” అన్న మాటతో ఇంద్రప్రస్థం నాటకం ముగుస్తుంది. అభినయ ఆర్ట్స్‌ గుంటూరు వారు దీన్ని నాటకంగానూ, నాటికగానూ కూడా ప్రదర్శిస్తున్నారు.
నాన్నలో… అమ్మలోని లాలిత్యం మార్దవం కాకుండా కాఠిన్యమే కనబడుతుంది ఎక్కువసార్లు. అందుకే చాలామంది నాన్నను అపార్థం చేసుకుని దూరంగా ఉంటారు, ఉంచుతారు. నిజానికి ‘అమ్మ ఒక వంతు నేల అయితే, నాన్న మూడొంతుల సముద్రం’ అని తల్లి తన కొడుకుతో అంటుంది ఈ నాటికలో. అటు తల్లిదండ్రులు ప్రేమ, ఆదరణలతో సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నాన్న తన ప్రాణం మాత్రమే తన వద్ద ఉంచుకొని మిగతావన్నీ సంతాన పోషణ, సంరక్షణకే వినియోగిస్తాడు. కొన్ని అరుదైన సందర్భాల్లో ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకంజ వేయడు. జేబులోని ప్రతి రూపాయినీ ముందుగా కొడుకు అవసరాలకే వెచ్చిస్తాడు.
ఇంద్రప్రస్థం నాటిక/ నాటకంలో భార్యాభర్తలు సర్వేశ్వర రావు, సౌభాగ్యవతి, వారి కొడుకు సందీప్‌, ఆ కొడుకును ప్రేమించిన యువతి సౌందర్య, ఆమె తండ్రి సుభద్రయ్య పాత్రలు. ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్ని మించిన కథాగమనంతో సాగే సాంఘిక నాటకం ఇది. సీనియర్‌ రచయిత, పలుసార్లు తన రచనలకు బహుమతులు పొందిన స్నిగ్ధ (గోపి సత్యప్రకాష్‌) ఈ నాటక రచయిత. ఆకాశమంత నాన్న ప్రేమను ప్రేక్షకుల హృదయాలకు అత్యంత సమీపంగా తీసుకొచ్చిన రచన ఇంద్రప్రస్థం.
నాన్నను సాధారణంగా చాలామంది అపార్థమే చేసుకుంటారు. కారణం వారి వారి వయసుకు తగ్గట్టుగా పెరుగుతుండే వారి ఆర్థిక అవసరాలు. ఈ తరం ఆడపిల్లల అవసరాలు మగ పిల్లలతో సమానంగా పెరిగినా, నాన్న హృదయాన్ని అర్థం చేసుకొని వ్యవహరిస్తుండడం వల్ల ఆ ఇద్దరి మధ్య అంతగా సంఘర్షణాయుత వాతావరణం కనబడదు. ఈ నాటకంలో… ప్రేమలో పడ్డ యువతి తన ప్రేమను కాదన్నందుకు ఆవేశంలో తండ్రిని అపార్థం చేసుకుని, ఇంటి నుంచి పారిపోదామన్న ప్రేమికుడితో చేయి కలుపుతుంది. రైలెక్కి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ జంటకు … ఏ ఆధారమూ లేకుండా ఇంటి నుంచి పారిపోతే ఎదురయ్యే పరిస్థితుల గురించి తండ్రి సర్వేశ్వరరావు ప్రస్తావించగా, ఆ ప్రయత్నం విరమించుకుంటారు. ఇక్కడ నుంచే నాటకం అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతుంది.
ఆర్థిక స్థిరత్వం సాధించకుండా ఇంటి నుంచి దొంగిలించిన నగదు, ఒంటి మీద బంగారాన్ని నమ్ముకుని ఎగిరిపోవాలనుకుంటే, ఆపై అనుక్షణం ఎదురయ్యే ఆర్థిక అవసరాలు వారి ప్రేమకు- కనీస అవసరాలకు మధ్య ఘర్షణ నిత్యం కఠిన పరీక్షకు గురిచేస్తాయి అన్న నగ సత్యాన్ని ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుల కళ్ళ ముందు దృశ్యమానం చేశారు. ఒక సంవత్సర కాలం ఆ ప్రేమికులిద్దరూ తన ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఉంటూ వారి భోజనం, నిత్య అవసరాలు వారే సమకూర్చుకోవాలని, లేదా అందుకు డబ్బు చెల్లిస్తుండాలన్న షరతుతో పాటు మరికొన్ని షరతులు పెట్టటం కొడుకు సందీప్‌కు మింగుడు పడదు. మరోపక్క సౌందర్య తన ప్రేమకు అంగీకారం తెలపలేదన్న తండ్రి పట్ల పెంచుకున్న ద్వేష భావం తొలగిపోయేలా చేస్తాడు సర్వేశ్వర రావు.
ఒక ఫ్లాష్‌ బ్యాక్‌ సంఘటన ద్వారా సర్వేశ్వరరావు దంపతులు – తమ కూతురు జీవితంలో జరిగిన విషాద ప్రేమ కథను చెప్పడం ద్వారా సౌందర్యలో మార్పు వస్తుంది. తను ప్రేమించిన సందీప్‌ ఎంత స్వార్థంగా ఆలోచించిందీ ఆమెకు అర్థం కావడం మొదలవుతుంది. తన అభిప్రాయం తెలుసుకోకుండా సందీప్‌ తన మెడలో తాళి కట్టడం, అత్తమామలు కోడలిని హింసిస్తున్నారన్న నెపంతో గృహహింస చట్టం కింద అరెస్టు చేయించి జైలు పాలు చేయిస్తామనడంతో ఆమెకు అతడి తత్వం అర్థమవుతుంది. తాము దుడుకుదనంతో వ్యవహరించి, ఇరువైపులా తల్లిదండ్రుల మనసులను ఎంతగా హింసపెట్టిందీ గ్రహిస్తుంది. అత్తమామలకు కన్నబిడ్డగా మారిపోతుంది. సందీప్‌ వైఖరిలో కూడా మార్పు వస్తుంది. ఆవేశమే తప్ప ఆలోచన లేని తానెంత అమానవీయంగా, ప్రేమమూర్తులు అయిన తమ కన్న తల్లితండ్రులను క్షోభ పెట్టిందీ గ్రహించి, వాళ్ళ కాళ్లపై పడి క్షమాపణలు కోరుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.
ఈ నాటక కథాకథనం నిండా సూటిగా గుండెలను తాకే సంభాషణలు ప్రేక్షకుల్ని ఆసాంతం ఉద్విగభరితంగా పట్టి ఉంచుతాయి. రంగస్థలం యొక్క పూర్తి శక్తి సామర్ధ్యాలను వినియోగించుకుంటూ రచయిత ఎంచుకున్న మార్గం ప్రతి మలుపులోనూ ప్రేక్షకుడి హృదయాన్ని గెలుచుకుంటుంది. వైవిధ్యవంతమైన నాటికలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఎన్‌ రవీందర్‌ రెడ్డి ఒక సాంఘిక ఇతివృత్తాన్ని ప్రేక్షకులు దృష్టి మరల్చుకోనీకుండా నిర్వహించిన తీరు ప్రశంసనీయం. కుటుంబ జీవితంలో రక్తసంబంధాలు, సంస్కారం, ప్రవర్తన, నడవడిక, యవ్వన ఉద్రేకాలు అనే ఫ్రేమ్‌లో, పరిమిత వస్తువే అయినా దాన్ని బిగువైన కథాగమనంతో బంధించి నడపడం అభినందనీయం. విషయ వస్తువులో బలం ఉంటే, చెప్పే తీరు కన్విన్సింగా, రియలిస్టిక్‌గా ఉంటే ఆ నాటకానికి ప్రేక్షక ఆదరణ ఎంతగా లభిస్తుందో చెప్పడానికి ‘ఇంద్రప్రస్థం’ రంగస్థల ప్రదర్శన ఒక చక్కని ఉదాహరణ.

– మల్లేశ్వరరావు ఆకుల
79818 72655

➡️