మోడీ కోడ్‌ను ఉల్లంఘిస్తుంటారు.. ఇసి చోద్యం చూస్తూనే ఉంటుంది

  • ఇసి చోద్యం చూస్తూనే ఉంటుంది

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ 2019 నుండి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్‌కు 27 ఫిర్యాదులు చేశాయి. విద్వేష ప్రసంగాలు చేయడం, ఓట్లను అడిగేందుకు సాయుధ బలగాలను వాడుకోవడం, మతం పేరుతో ఓట్లను అడగడం, ప్రధాని ఎన్నికల ప్రసంగాలను రూపొందించేందుకు మంత్రిత్వ శాఖలను వాచుకోవడం తదితర అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులొస్తే, వీటిలో ఏ ఒక్కదానిపైనా చర్యల్లేవు. బిజెపి స్టార్‌ క్యాంపెయినర్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా ప్రసంగాలు చేస్తున్నారంటూ ఈ ఏడాది ఏప్రిల్‌ 25న బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులో కూడా మోడీ పేరు ఎక్కడా పేర్కొనలేదు. కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఇసి పేర్కొంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను ఎక్కువ మంది పిల్లలు కనేవారికి, చొరబాటుదారులకు పంచి పెడుతుందంటూ రాజస్థాన్‌లోని బాన్స్‌వారా ర్యాలీలో మోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదుల్లో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. 2019 నుండి చేసిన ఈ ఫిర్యాదుల కాపీలు ‘ది క్వింట్‌’ వద్ద వున్నాయి. వీటిని విశ్లేషించగా, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించి 12 ఫిర్యాదులు, సాయుధ బలగాలను ఉపయోగించి ఓట్లు అడగడానికి సంబంధించి 8 ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే రాజకీయ అడ్వర్టయిజ్‌మెంట్లలో ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడం, మతం పేరుతో ఓట్లు దండుకోవడం, ఎన్నికల ప్రసంగాల తయారీకి ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను దుర్వినియోగపరచడం, ఎన్నికల ప్రచారం కోసం మైనర్లను ఉపయోగించడం, గడువు ముగిసిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారం చేయడం, ప్రచారానికి ఉపయోగించిన ప్రధాని హెలికాప్టర్‌లో అనుమానాస్పద రీతిలో కనిపించిన బ్లాక్‌ బాక్స్‌ల ఉదంతానికి సంబంధించిన. ఫిర్యాదులు కూడా వీటిలో ఉన్నాయి. అయినా, వీటిలో ఏ ఒక్కదానిపైనా ఇంతవరకు చర్యల్లేవు. 2019 మార్చి 27న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో డిఆర్‌డిఓ వంటి సంస్థల కృషిని తన ఖాతాలో వేసుకునేందుకు యత్నించారని, ఇది కచ్చితంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైన విషయాన్ని సాధారణంగా డిఆర్‌డివోనో, సంబంధిత శాస్త్రవేత్తలో ప్రకటిస్తారు. దీనికి భిన్నంగా మోడీ ఆనాడు ప్రకటన చేశారు. అంతటితో ఆగలేదు. ఈ దేశ భూభాగానికే కాకుండా ఆకాశానికి, అంతరిక్షానికి కూడా చౌకీదార్‌నని మోడీ చెప్పుకున్నారు.. దీనిపై ఇసి ఒక కమిటీ వేసి మమ అనిపించడం మినహా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రతిపక్ష నేతలపై ఫిర్యాదులొస్తే వెంటనే స్పందిస్తుంది
అధికారంలో ఉండే పెద్దల పట్ల ఒక విధంగా, ప్రతిపక్షాల నేతల పట్ల ఇంకొక విధంగా వ్యవహరించడం ఎన్నికల సంఘం నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేస్తోంది. తమ పార్టీ రూపొందించిన ఆడియో క్యాసెట్‌లో జై భవాని, హిందూ అనే పదాలను తొలగించాలంటూ ఎన్నికల కమిషన్‌ ఆగమేఘాల మీద తనకు నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం, ప్రధాని బాహాటంగా కోడ్‌ ఉల్లంఘిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యుబిటి) చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం లేదు. హనుమాన్‌ పేరుతో మోడీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని గతేడాది మే 4న కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. అయినా, ఆయనపై ఎలాంటి చర్యలు లేవు. అదే ఏడాది నవంబరులో మోడీని విమర్శించినందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ‘సంపన్నులకు రుణాల రద్దు, పిక్‌పాకెట్‌, పనౌటి’ వంటి పదాలు వాడడం, రాజకీయ ప్రత్యర్ధులపై నిరాధారమైన ఆరోపణలను చేయడం ఎన్నికల కోడ్‌ కింద నిషిద్ధమని చెప్పింది. ఎన్నికల కోడ్‌ అనేది మోరల్‌ సెన్సార్‌ అని పేర్కొంది. ఎంతటి వారైనా సరే కోడ్‌ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పద్దెనిమిదో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల సందర్భంగా ప్రకటించారు. దానిని ఇసి ఆచరణలో ఎందుకు చూపడం లేదన్నదే ప్రశ్న.

➡️