మోడీ మహా కుబేర సామ్రాజ్యం

May 5,2024 05:13 #Amit Shah, #Articles, #edit page, #modi

ఏప్రిల్‌ 21న రాజస్థాన్‌ లోని బాన్స్‌వారాలో నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో ముస్లింలపై విషపూరతమైన రీతిలో దాడి చేశారు. సంపద పున:పంపిణీ కోసం జరిగే ఎలాంటి ప్రయత్నమైనా సరే హిందువుల బంగారాన్ని ఆస్తినీ ‘చొరబాటు దారుల’కు అప్పగించడమే అవుతుందన్నట్టు భయానకంగా చిత్రించారు. ఈ ప్రసంగంలో ప్రదర్శితమైన మూఢ ద్వేషం సహజంగానే విస్తారమైన ఖండనలకు గురికావడాన్ని మనం అర్థం చేసుకోదగిందే. కాని ఆ ప్రసంగంలో మరో పార్శ్యం వుంది. మోడీకి, బిజెపికి ఎంత కరుడుగట్టిన అభివృద్ధి నిరోధక భావజాలం వుందో ఆ ప్రసంగం తేటతెల్లం చేసింది. విపరీతమైన అససమానతలకు నిలయంగా వున్న భారతదేశంలో సంపదనూ ఆదాయాలను పున:పంపిణీ చేయాలనే ఏ కాస్త ప్రతిపాదన వచ్చినా వారెంతో విద్వేషం వెళ్లగక్కుతున్నారు.

దోచిపెట్టిన మోడీ సర్కార్‌
కాంగ్రెస్‌ మద్దతుదారుడైన శ్యామ్‌ పిట్రోడా ఎప్పుడో చేసిన కొన్ని వ్యాఖ్యలను మోడీ బిజెపి ఈ సందర్భంలో ముందుకు తెచ్చారు. అమెరికాలో వున్నట్టుగా భారత దేశంలోనూ వారసత్వ (సంక్రమణ) పన్నును ప్రవేశ పెట్టాల్సిన ప్రతిపాదనను పరిశీలించాలని ఆయన అన్నారు. వారసత్వ పన్ను అనే భావనను ప్రస్తావించడమే మోడీకి, ఆయన మితవాద పాలక పార్టీకి ఎక్కడలేని కోపం తెప్పించింది. ఇది గత పదేళ్లుగా మోడీ ప్రభుత్వం సంపన్న వర్గాల అనుకూల విధానాలను అనుసరించడమే అంతరాలు ఇంతగా పెరగడానికి కారణమైంది. కార్పొరేట్లకు పన్ను రాయితీలు గుప్పించడం, సంపద పన్ను రద్దు చేయడం, అత్యధిక ఆదాయం వచ్చే వర్గాలపై ఆదాయ పన్ను తగ్గింపు, ఆశ్రిత పెట్టుబడి దారుల పట్ల అమితమైన అనుకూలత ప్రదర్శించడం…ఇవే అసమానతలకు ఆజ్యం పోశాయి. ప్రపంచంలోనే ఇండియాను అత్యధిక అసమానతల దేశంగా మార్చాయి.
అగాధమైన ఈ అసమానతల స్వరూపం ఏంటో కళ్లకు కట్టే సంఖ్యా వివరాలు పుష్కలంగా అందుబాటులో వున్నాయి. ప్రపంచ అసమానతల ప్రయోగశాల లెక్కల ప్రకారం 2022-23లో దేశంలో సంపదలలో 65 శాతం, ఆదాయాలలో 57 శాతం అత్యగ్ర స్థానంలో వుండే పది శాతం మంది మహా కుబేరుల చేతుల్లో వున్నాయి. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం అందరికన్నా పైన వున్న ఒక శాతం మంది 47 శాతం సంపద అనుభవిస్తుంటే దిగువన వున్న 60 శాతం మంది చేతుల్లో వున్న సంపద కేవలం 4.7 మాత్రమే. బాగా పైనున్న ఆ ఒక్క శాతం మంది చేతిలోని అక్రమ ధనాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇది ఘోరంగా వుంటుంది. భారత రాజ్యాంగం మన ప్రజల్లో విస్తారమైన భాగం ప్రత్యేకించి సామాజికంగా అణచివేయబడిన వారలు ఎలాంటి భౌతిక వనరుల నుంచి దూరం చేయబడిన స్థితిలో వున్నారనే వాస్తవాన్ని భారత రాజ్యాంగం గుర్తించింది. ఆర్థిక, సామాజిక రంగాల్లో వారు అన్యాయమైన పరిస్థితి లోకి నెట్టబడ్డారనే సామాజిక వాస్తవాన్ని గుర్తించింది. అందుకే దీనికి సంబంధించి రాజ్యాంగం నాల్గవ భాగంలో ప్రభుత్వ విధానాలకు ఆదేశిక సూత్రాలను కొన్నిటిని పొందుపర్చింది. ఆ భాగంలోని 39 (బి) అధికరణం ఇలా పేర్కొంది: దేశంలోని భౌతిక వనరుల యాజమాన్యం, నియంత్రణ అందరి శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా పున:పంపిణీ జరగాలి. ఉమ్మడి శ్రేయస్సుకు హాని కలిగించే రీతిలో సంపదలు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణ జరగని రీతిలో ఆర్థిక వ్యవస్థను నిర్వహించాలని ఉప నిబంధన(సి) ఆదేశించింది.

అసమానతల తగ్గింపెలా?
కాని గత మూడు దశాబ్దాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు ఈ ఆదేశిక సూత్రాలకు విరుద్ధమైన దిశలో పని చేశాయి. ఒక చిన్న దొంతరగా వున్న కుబేర వర్గాల చేతిలో సంపదలు పోగుపడి పోయాయి. 90 శాతం మంది ప్రజలు గౌరవ ప్రదమైన రీతిలో మెరుగైన జీవితం గడిపేందుకు అవసరమైన భౌతిక వనరులు హరించివేయబడ్డాయి. నయా ఉదారవాద విధానం ప్రపంచవ్యాపితంగా అసమానతలకు దారి తీస్తే ఇందులో భారత దేశం మరీ అసమానతల మహా సముద్రంగా మారిపోయింది. ఇంకా ఇంకా లోతుల్లోకి దిగిపోయింది. ఆయా దేశాల్లో అసమానతలను తగ్గించడమెలా? అలాగే సుసంపన్నమైన పారిశ్రామిక దేశాలకు వర్థమాన దేశాలకూ మధ్య గండి పూడ్చడమెలాగనే దానిపై మరోసారి ఆలోచనలు మొదలయ్యాయి. ఈ అసమానతలు తగ్గించేందుకు పేదరికాన్ని తగ్గించి భౌతిక వనరులను అందుకోసం ఉపయోగించేలా రాజ్యం జోక్యం చేసుకోవడానికి ఒక మార్గం పన్ను విధానం, దాన్ని సంపద పున:పంపిణీకి వీలుగా రూపొందించడం అందుకో మార్గం. సంపద పన్ను అంటే బడా కుబేరులపై పన్ను, వారసత్వ పన్ను, బహుమతి పన్ను అందులో కొన్ని. వీటిపై బడా పెట్టుబడిదారీ దేశాల్లో ఎప్పటి నుంచో ఆలోచనలు సాగుతున్నాయి. వారసత్వంగా సంక్రమించే సంపదపై పన్ను వేయడం, ఈ సంపదను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించడం అన్నది వీటిలో బాగా పాతుకుపోయిన ఒక ప్రతిపాదన. ఇందులో మళ్లీ రెండు రకాలుంటాయి. ఎస్టేట్‌ (ఆస్తి) పన్ను, వారసత్వ పన్ను. మొదటిది- మరణించిన వ్యక్తి ఎస్టేట్‌ను అర్హులైన వారికి ధారాదత్తం చేసేముందే ఎస్టేట్‌ పన్ను విధించబడుతుంది. అలాగాక ఆ ఆస్తి వారసత్వంగా పొందిన భాగస్వామి లేక కుటుంబ సభ్యులపై వారసత్వ పన్ను విధించడం రెండో పద్ధతి. యూరోపియన్‌ యూనియన్‌ లోని 19 దేశాలలో ఈ మూడు రకాలైన ఎస్టేట్‌ పన్ను, వారసత్వ పన్ను, బహుమతి పన్నులలో ఏదో ఒకటి వుంది. ఉదాహరణకు బ్రిటన్‌లో వారసత్వ పన్ను 40 శాతం వుంటుంది. ఫ్రాన్స్‌లో 45 శాతం, నెదర్లాండ్స్‌లో 40 శాతం వరకూ వుంది. యూరోపియన్‌ యూనియన్‌ వెలుపల జపాన్‌లో వారసత్వ పన్ను 55 శాతం వుంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలు 20 నుంచి 55 శాతం వరకూ వారసత్వ ఆస్తి పన్ను విధిస్తున్నాయి.

ఎవరిపై ప్రభావం?
భారత దేశం విషయానికొస్తే వారసత్వ పన్నును 1985 లోనూ సంపద పన్నును 2015 లోనూ ఎత్తివేశారు. ఈ పన్నుల వల్ల వచ్చే ఆదాయం అత్యల్పంగా వుందనీ, వచ్చేదాని కన్నా వసూలు చేయడానికి, నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతోందని కారణం చెప్పారు. దేశంలో కొందరు భారతీయుల భోగభాగ్యాలు జుగుప్సాకరమైన స్థాయికి పరుగు పెడుతున్న ఈ దశలో వారి సంపదపై పన్ను వేయడం న్యాయం సమ ధర్మం కూడా. అంతర్జాతీయంగా కార్పొరేట్‌ పన్ను సంస్కరణల కోసం పని చేసిన స్వతంత్ర కమిషన్‌ సహాధ్యక్షురాలుగా పని చేసిన జయతీ ఘోష్‌ కొన్ని సూచనలు చేశారు. 2023 హారున్‌ ప్రపంచ జాబితాలోని 187 బిలియన్‌ డాలర్లు గల మహా కుబేరులపై సంపద పన్ను వేయాలని సూచించారామె. ఈ ప్రకారం చేయడమంటే జనాభాలో 99.99 శాతం మందిపై ఎలాంటి ప్రభావం పడదన్న మాట. వారి సంపదలపై కేవలం 4 శాతం పన్ను విధించినా ప్రజారోగ్యానికి, విద్యకు గణనీయమైన ఆదాయం వస్తుంది. అదే విధంగా సంపద పన్ను అనేది కేవలం బాగా పైన వున్న వారిపైనే విధించబడుతుంది. చిన్న, మధ్య తరహా స్థాయి ఆదాయాలు, ఆస్తులపై ఎలాంటి వారసత్వ పన్ను వుండదు.
ఉదాహరణకు రూ.వంద కోట్ల పైన ఆస్తి గలవారికే ఇది వర్తిస్తుంది. అది కూడా దశల వారీగా. అందువల్ల మంగళ సూత్రాలు, ఇతర ఆస్తులు జప్తు చేయడం వంటి మాటలతో మోడీ చేసింది కేవలం హడలగొట్టే ప్రయత్నం మాత్రమే. పన్ను రాయితీలతో కార్పొరేట్లను తెగమోసిన మోడీ ప్రభుత్వం వారి బాకీలను కూడా అన్ని రకాలుగా రద్దు చేసింది. అలాంటి సర్కారుకు కుబేరులపై పన్ను పెంచడమనే ఆలోచనే మింగుడు పడటం లేదు. అది అర్బన్‌ నగ్జల్‌ ఆలోచన అని మోడీ అభివర్ణించారు. కనుకనే వారసత్వ పన్ను గురించి మాట్లాడగానే వారు విషపూరిత మైన దాడికి దిగారు. ఆ ప్రతిపాదనకు పచ్చి మతోన్మాద రంగు పులిమారు. మోడీ రాజ్యపు మతతత్వ కార్పొరేట్‌ లక్షణాలకు అనుగుణంగానే ఇలా చేశారన్నమాట.
సంపదల పున:పంపిణీ విధానాలకు సంబంధించి కాంగ్రెస్‌ ఆత్మ రక్షణలో పడిపోయింది. అలా కావలసిన అవసరమేమీ లేదు. తన ప్రణాళికలో అది పొందు పరచిన ఆర్థిక సామాజిక న్యాయం సాధించాలంటే ఆర్థిక అసమానతలు తగ్గించే సామాజిక సమతకు దారి చూపే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో సిపిఎం తన వైఖరి స్పష్టంగా ప్రకటించింది. మహా కుబేరులపై తన ప్రణాళికలో సిపిఎం సంపద పన్ను, వారసత్వ పన్ను వేయాలని ప్రతిపాదించింది. కార్పోరేట్‌ లాభాలపై పన్ను పెంచాలని చెప్పింది. మహా సంపన్నులు బడా కార్పొరేట్ల కోసమే పని చేస్తున్న మోడీ రాజ్‌కు స్వస్తి పలకాలంటే ఈ చర్యలు తప్పనిసరి.

(మే 1 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️