బజరంగ్‌ పూనియాపై వేటు

  •  శాంపిళ్లు ఇవ్వనందుకే సస్పెన్షన్‌ : నాడా
  •  తానెన్నడూ నిరాకరించలేదన్న రెజ్లర్‌

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న కుస్తీ యోధుడు, ఒలింపిక్‌ పతక విజేత బజరంగ్‌ పూనియాపై ‘నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా)’ సస్పెన్షన్‌ వేటు వేసింది. డోపింగ్‌ పరీక్షకు మూత్ర నమూనాను ఇవ్వనందునే బజ్‌రంగ్‌పె చర్య తీసుకున్నట్లు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నియమించిన తాత్కాలిక కమిటీ పేఉర్కొంది. మూత్ర నమూనా ఇవ్వడానికి తాను ఎన్నడూ నిరాకరించలేదని పునియా స్పష్టం చేశారు. నాడా చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. కాలం చెల్లిన పరికరాలను డోప్‌ టెస్టులో ఎందుకు ఉపయోగిస్తున్నారని తాను అడిగితే నాడా నుంచి సమాధానం లేదని ఆయన అన్నారు. అంతకుముందు నాడా ఒక ప్రకటన చేస్తూ మార్చి 10న సోనిపట్‌లో అంతర్జాతీయ వేదికల్లో పోటీపడే అథ్లెట్లు, రెజ్లర్ల నుంచి యూరిన్‌ శాంపిల్స్‌ కోరామని, నిర్దిష్ట గడువలోగా పునియా మూత్ర నమూనాలను ఇవ్వలేదని పేర్కొంది. అంతేకాదు శాంపిల్స్‌ ఇచ్చేందుకు అతడు విముఖంగా ఉన్నాడని కూడా నాడా ట్విటర్‌ (ఎక్స్‌) వెల్లడించింది. నాడా ఈ సస్పెన్షన్‌ వేటు వేయడం ద్వారా ఏప్రిల్‌ 24న వారణాసిలో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వీలులేకుండా చేసింది. పునియా ఇచ్చే సమాధానాన్ని బట్టి సస్పెన్షన్‌ ఎంతవరకు ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని నాడా తెలిపింది.
ప్రారంభ రౌండ్‌లో రోహిత్‌ కుమార్‌తో జరిగిన మ్యాచ్‌లో పునియా ఓటమిపాలయ్యాడు. ఇప్పుడీ సస్పెన్షన్‌ వేటుతో పారిస్‌ ఒలింపిక్స్‌కు అవశాకాలు మూసుకుపోయినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు.మహిళా రెజ్లర్ల పట్ల కీచకుడిగా వ్యవహరించిన బిజెపి ఎంపి, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌, వినేష్‌ పోగట్‌లతో కలసి ఢిల్లీలో ధర్నా చేసిన పునియా తన పద్మ శ్రీ అవార్డును, ఇతర పతకాలను వాపసు చేశారు అందుకే ప్రభుత్వం కక్ష సాధిపు చర్యలో భాగంగా ఈ సస్పెన్షన్‌ వేటు వేసిందని పలువురు భావిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ పై చర్య లీసుకోవడానికి బదులు ఆతని కుమారుడికి బిజెపి కైసర్‌గంజ్‌ లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది.

➡️