Priyanka Gandhi : భారత్‌లో ఎన్నికలైతే.. పాకిస్థాన్‌ గురించి చర్చలెందుకు

అమేథీ  :  భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్‌ గురించి ఎందుకు చర్చిస్తున్నామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని అన్నారు. బిజెపి వాస్తవ సమస్యలతో పాలక బిజెపి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. అమేథీలో శుక్రవారం కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోర్‌లాల్‌ శర్మ ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ ప్రకటనపై స్పందించారు. ఆ ప్రకటన పాతదని, ఇప్పుడు దాని గురించి ఎందుకు చర్చిస్తున్నామని ప్రశ్నించారు. భారత్‌లోనా లేదా పాకిస్థాన్‌లోనా ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రశ్నిస్తూ.. భారత్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్‌ గురించి ఎందుకు మాట్లాడాలని అన్నారు.

ఎన్నికల్లో గెలించేందుకు బిజెపి హిందూ -ముస్లిం అంశంపై వ్యాఖ్యలు చేస్తోందని..కానీ ప్రజలు కులం, మతం ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని కోరుకోవడం లేదని అన్నారు. నిరుద్యోగం రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని, ద్రవ్యోల్బణం పెరిగిందని అన్నారు. ధరలు పెరిగిపోవడంతో మార్కెట్లకు వెళ్లిన ప్రజలు అవసరమైన వాటిలో సగం కూడా కొనుగోలు చేయలేక వెనుతిరుగుతున్నారని అన్నారు. రైతులు సరైన జీవనోపాధి లేక బాధపడుతున్నారని అన్నారు. డీజిల్‌తో పాటు వ్యవసాయానికి వినియోగించే వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని. వాటి గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. కులం, మతం పేరుతో బిజెపి ఎన్నికల్లో పోటీ చేస్తోందని, కానీ కాంగ్రెస్‌ ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి వాస్తవ అంశాలతో పోటీ చేస్తున్నామని అన్నారు.

➡️