పథకాల హోరు

Apr 30,2024 23:55 #kutami manifesto
  •  పింఛన్‌ రూ.4 వేలకు పెంపు
  •  అమరావతి పునర్నిర్మాణం, ప్రత్యేక హోదా ఊసేలేదు
  •  విశాఖ ఉక్కుపై స్పష్టత కరువు
  •  కూటమి మ్యానిఫెస్టో విడుదల
  •  అమలు బాధ్యత తమదేనన్న చంద్రబాబు, పవన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పథకాల హోరుతో టిడిపి-జనసేన-బిజెపి కూటమి మ్యానిఫెస్టో విడుదల చేసింది. యువత, మహిళ, రైతులకు ప్రత్యేక పథకాలను పొందుపరిచింది. ‘ప్రజాగళం’ పేరుతో టిడిపి-జనసేన-బిజెపి కూటమి మ్యానిఫెస్టోను మంగళవారం ప్రకటించింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బిజెపి ఎన్నికల రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సిద్థార్ధనాథ్‌ సింగ్‌తో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో విడుదల చేశారు. మ్యానిఫెస్టోలో ప్రత్యేక హోదాపై ప్రస్తావనే లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 2018లో ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చానని చంద్రబాబు ఇటీవల చెప్పారు. అయితే కూటమి మ్యానిఫెస్టోలో ఆ అంశమే లేకపోవడం గమనార్హం. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తామని పేర్కొన్న కూటమి, ఏ విధంగా పరిరక్షిస్తుందో చెప్పలేదు. కూటమి నేతలకు వచ్చిన సూచనలు, వినతులు, లోకేష్‌ నిర్వహించిన యువగళం పాదయాత్ర, జనసేన అధినేత నిర్వహించిన జనవాణి కార్యక్రమాల్లో వచ్చిన వినతులను క్రోడీకరించి మ్యానిఫెస్టో తయారు చేసినట్లు చంద్రబాబు, పవన్‌ ఈ సందర్భంగా తెలిపారు. మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో బిజెపి నేత పక్కనే ఉన్నప్పటికీ ఈ హామీలను అమలు చేసే బాధ్యత తమ రెండు పార్టీలదే అని పేర్కొనడం వారి సఖ్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తామని చెప్పారు. ఇంటి పైకప్పుపై కేంద్ర ప్రభుత్వ సోలార్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి పథకం అనుసంధానం ద్వారా విద్యుత్‌ బిల్లుల భారం తగ్గిస్తామని తెలిపారు. చెత్తపన్ను రద్దు చేసి, ఇంటి పన్నులను సమీక్షిస్తామని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, మద్యం ధరలు నియంత్రిస్తామని చెప్పారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పటిష్టమైన చర్యలు చేపట్టి ఆర్థిక ప్రగతికి చేయూత కల్పిస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని, హార్టీకల్చర్‌ హబ్‌గా, విత్తన రాజధానిగా రాయలసీమను చేస్తామని తెలిపారు. యువగళం యాత్రలో ప్రకటించిన ‘మిషన్‌ రాయలసీమ’ అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిశ్రమలను తీసుకొచ్చి రాయలసీమను ఆటోమొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కెజి టు పిజి సిలబస్‌ను సమీక్ష చేస్తామని, జిఓ 117ను రద్దు చేసి మూతపడ్డ పాఠశాలలు పున:ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి అమలు చేస్తామని, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్‌ ప్రకటిస్తామని పేర్కొన్నారు. సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాన్ని పున:సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. తక్కువ వేతనాలు పొందే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు, కన్సాలిడేట్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామన్నారు. వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన విధానం తీసుకొస్తామని చెప్పారు.

సూపర్‌ సిక్స్‌
గతేడాది మహానాడులో సూపర్‌సిక్స్‌ పేరుతో 6 పథకాలను ప్రకటించిన టిడిపి మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. యువతకు 20 లక్షల ఉద్యోగులు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని తెలిపింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయంగా ప్రకటించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకూ నెలకు రూ.1,500, ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని వెల్లడించింది. ఇంటింటికీ రక్షిత తాగునీరు కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇస్తామని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్‌ గణన చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచుతామని పేర్కొంది. సౌభాగ్యపథం కింద చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ అందిస్తామని తెలిపింది.
పింఛన్ల పెంపు
సామాజిక భద్రత పింఛన్లు రూ.4 వేలకు పెంచుతామని, దీనిని ఏప్రిల్‌ 2024 నుంచే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. వికలాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచుతామని తెలిపారు. పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి పింఛన్‌ నెలకు రూ.15 వేలు, కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు పింఛన్‌ అందిస్తామని తెలిపింది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ అమలు చేస్తామని చెప్పింది. బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేస్తామని, ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్‌, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని పేర్కొంది. జిల్లాల వారీ ఎస్‌సి, ఎస్‌టి వర్గీకరణ అమలు చేస్తామని, ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జిఓ 3 పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది.

రైతు కూలీలకు కార్పొరేషన్‌ ఏర్పాటు
రైతు కూలీలకు కార్పొరేషన్‌ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపింది. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, రాయితీతో సోలార్‌ పంపుసెట్లు, మిగిలిన విద్యుత్‌ ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లింపు, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు, పండగ, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. మెగా డిఎస్‌సి, ప్రతియేటా జాబ్‌ క్యాలెండరు విడుదల చేస్తామని తెలిపింది.

 

➡️