వృద్ధాప్య పింఛన్లలో రూ.వెయ్యి కట్‌ .. అపరాధ రుసుమట..!

May 4,2024 09:52 #Cut, #old age pensions

అమరావతి : ఒక వృద్ధురాలికి వృద్ధాప్య పింఛన్‌ ఈ నెల బ్యాంకులో 3,000 రూపాయలు ప్రభుత్వం వేసింది. కానీ బ్యాంకు వారు మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెనెన్స్‌ పేరిట రూ.371.70 డిడక్షన్స్‌ చేశారు. ఒక 500 రూపాయలు బ్యాలెన్స్‌ బ్యాంకులో ఉండాలని చెప్పడంతో ఈ నెల ఆ వృద్ధురాలికి అందిన పెన్షన్‌ రూ.2000 మాత్రమే. ఇలా బ్యాంకు వారు వృద్ధులకు పడిన వృద్ధాప్య పింఛన్ల నుండి మినిమమ్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ మెయింటెనెన్స్‌కు అపరాధంను వసూళ్లు చేశారు. అన్ని బ్యాంకుల్లోనూ అన్ని వృద్ధాప్య పింఛన్ల పరిస్థితి ఇదే..!

ఎన్నికల వేళ … వైసిపి-టిడిపి ల వ్యూహ-ప్రతివ్యూహాలకు అన్నెంపున్నెం ఎరుగని ముసలివారు పావులై బలైపోతున్నారు. నెల నెలా అందుకునే పింఛన్‌ తోనే అన్ని అవసరాలను తీర్చుకునే వృద్ధులకు… ఈ ఎన్నికలు శాపంగా మారాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వ్యూహాలు పన్నుతున్న పాలక-ప్రతిపక్షాలు ముదుసలి ప్రాణాలను మండుటెండలో బలిపెడుతున్నాయి. ఈ నెల పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో పడతాయని అన్నారు. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల నుండి బ్యాంకు దారి వెతుక్కుంటూ ఓపిక లేని కాళ్లకు సత్తువ తెచ్చుకొని కొందరు వస్తుంటే … మరికొంతమందిని మోసుకొని తెస్తున్నారు. ఆ బ్యాంకులో కనీసం ఫ్యాన్లు ఉండకపోగా, చల్లటి నీళ్లయినా లేని దుర్భర స్థితి.. ” మీ అకౌంట్‌ ఇన్‌ యాక్టివ్‌ లో ఉంది.. ఈ షరతులు ఉన్నాయి..” అని చెబుతుంటే చదువులేని వృద్ధులంతా బిక్కమొహాలేసుకొని 2 రోజులు బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఆ బ్యాంకు సిబ్బంది కూడా కనీస మానవత్వం లేకుండా ముసలివారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తుండటంతో లబ్దిదారులంతా కంటతడిపెడుతున్నారు. 3 రోజులుగా బ్యాంకుల వద్దే పడిగాపులు.. మండుటెండలో ప్రాణాలతో పోరాటాలు.. ఇంతలో నేలరాలిపోతున్న ఎండుటాకు ముసలిప్రాణాలు..! పాలక-ప్రతిపక్షాలు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ వారి క్రూరత్వాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఇంతా కష్టపడి బ్యాంకువారు చెప్పినట్లు అన్నీ చేస్తే … చేతికందాల్సిన రూ.3 వేలలో రూ.2 వేలు మాత్రమే అందుతున్నాయి..! మినిమం బ్యాలన్స్‌ మెయింటెనెన్స్‌ పేరుతో రూ.371.70, కనీస బ్యాలెన్స్‌ ఉండాలంటూ రూ.500 కట్‌ చేసి రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. గత 3 రోజులుగా ప్రయాణాలకు ఛార్జీలు పెట్టుకొని ఎండకు ఆయాసపడి అన్ని అగచాట్లూ పడి ఇంత దూరం వస్తే .. చేతికందింది కనీసం కంటతుడుపు కూడా కాదు..!

➡️