చిలకలూరిపేటలో ఘోరం

  • టిప్పర్‌ను ఢీ కోట్టిన ప్రయివేట్‌ బస్సు
  • అయిల్‌ ట్యాంక్‌ పగలడంతో వ్యాపించిన మంటలు
  • ఆరుగురు సజీవ దహనం

ప్రజాశక్తి- చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్‌ లారీని ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టడంతో అయిల్‌ ట్యాంక్‌ పేలి వ్యాపించిన మంటలకు ఎనిమిదేళ్ల బాలిక సహా ఆరుగురు సజీవ దహనం అయ్యారు. వారిలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. బస్సు, టిప్పర్‌ దగ్ధమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుగుండూరు, గోనసపూడి, కడవకుదురు, చినగంజం, నీలాయపాలెం తదితర గ్రామాలకు చెందిన కొందరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ఓటేయడానికి వీరంతా సొంతూళ్లకు వచ్చారు. వేర్వేరు గ్రామాల వారైనా వీరంతా బంధువులు కావడంతో తిరిగి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఉప్పుగుండూరుకు చెందిన అరవింద ట్రావెల్స్‌ బస్సును అద్దెకు మాట్లాడుకున్నారు. పోలింగ్‌ తర్వాతి రోజైన మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఉప్పుగుండూరు నుండి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్యలోని గ్రామాల్లో వారితో కలిసి మొత్తంగా 40 మంది బస్సు ఎక్కారు. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెం దాటిన తర్వాత ఈవూరిపాలెం వద్ద టిప్పర్‌కు బస్సు వేగంగా ఢకొీట్టింది. దీంతో, టిప్పర్‌ అయిల్‌ ట్యాంకర్‌ పేలిపోవడంతో టిప్పర్‌కు నిప్పంటుకుంది. ఈ మంటలు బస్సుకూ వ్యాపించాయి. దీంతో, బాపట్ల జిల్లా చీరాలకు చెందిన బస్సు డ్రైవర్‌ షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌ (47), వెనక సీట్లో కూర్చున్న చినగంజాం మండలం నీలాయపాలేనికి చెందిన ఉప్పుగుండూరు కాశీబ్రహ్మేశ్వరరావు (65), ఆయన భార్య లక్ష్మి (55), మనవరాలు ముప్పవరపు ఖ్యాతి సాయిశ్రీ (8), గొనసపూడికి చెందిన దావులూరి శ్రీనివాసరావు (34), మధ్యప్రదేశ్‌కు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ హరీష్‌ సింగ్‌ (39) సజీవ దహనమయ్యారు. అస్తికలు మాత్రమే మిగిలాయి. తీవ్రంగా గాయపడిన 15 మందిని తొలుత చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి, ప్రాథమిక చికిత్సా అనంతరం గుంటూరులోని జిజిహెచ్‌కు, ఇతర ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. బస్సులో హెల్పర్‌గా ఉన్న వ్యక్తి తలుపు తీయడం, అద్దాలు పగలగొట్టడం ద్వారా ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. కొద్దిసేపట్లోనే రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికుల్లో నీలాయపాలేనికి చెందినవారు మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కావడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సులోని మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడడంతో వారంతా సొంతూళ్లకు తిరిగెళ్లారు. సజీవ దహనం అయిన లక్ష్మి… సిపిఎం చిలకలూరిపేట డివిజన్‌ నాయకులు జె.శంకరరావుకు అక్క అవుతారు. ఘటనా స్థలాన్ని మంత్రి విడదల రజని, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి రజని హామీ ఇచ్చారు. బైపాస్‌ పనులు చేస్తున్న క్రమంలో ప్రభుత్వం, కాంట్రాక్టర్‌ ముందస్తు జాగ్రత్తలు తీసుకోపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పుల్లారావు విమర్శించారు.

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి : సిపిఎం
ఘటనా స్థలిని పరిశీలించిన సిపిఎం చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రహదారి విస్తరణ, నిర్మాణ పనులప్పుడు సరైన నిబంధనలు పాటించని కారణంగా జరిగే ప్రమాదాలకు ప్రభుత్వం, కాంట్రాక్టర్లు సమాధానం చెప్పాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒకే కుటుంబానికి చెందిన ఉప్పుగుండూరు కాశి బ్రహ్మేశ్వర రావు , భార్య లక్ష్మి, మనుమరాలు సాయిశ్రీరోడ్డు ప్రమాదంలో మరణించిన ఒకే కుటుంబానికి చెందిన ఉప్పుగుండూరు కాశి బ్రహ్మేశ్వర రావు , భార్య లక్ష్మి, మనుమరాలు సాయిశ్రీ

➡️