నేడు ‘యువగళం’ విజయోత్సవ సభ

Dec 20,2023 09:21 #sabha, #yuvagalam padayatra

-హాజరు కానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ

-5 లక్షల మంది వస్తారని అంచనా

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి/భోగాపురం  :టిడిపి యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం-నవశకం పాదయాత్ర విజయోత్సవ సభ విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద బుధవారం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమై ఆరు గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. భారీ స్థాయిలో స్టేజీ, సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈ సభకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టిడిపి కీలక నేతలు, అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జులు హాజరు కానున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు తెలిపారు. సభ ఏర్పాట్లను ఆయనతోపాటు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు తదితరులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి, జనసేన పార్టీల నుంచి సుమారు ఐదు లక్షల మంది తరలివస్తారని తెలిపారు. రాయలసీమ ప్రాంతం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చేందుకు ఐదు ప్రత్యేక రైళ్లను బుక్‌ చేశామని చెప్పారు. అద్దె ప్రాతిపదికన ఆర్‌టిసి బస్సులను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో ఒడిశా ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే రైళ్లను అద్దెకు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం బస్సులు ఇచ్చేందుకు నిరాకరించడం శోచనీయమన్నారు. మరో వంద రోజుల్లో టిడిపి అధికారంలోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్‌ గజపతిరాజు పాల్గన్నారు. కాగా, సభా ప్రాంగణానికి సమీపంలోని సన్‌రే రిసార్ట్‌కు నారా లోకేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారమే చేరుకున్నారు.

➡️