ఉద్దండుల్లో విజేతలెవరో..!

May 7,2024 04:30
  • చిత్తూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :  చిత్తూరు జిల్లాలో ఉద్దండులు పోటీచేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లోనే ఆసక్తికరంగా మారింది. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కె రోజా, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, బిసివై పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్రయాదవ్‌ ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు.

కుప్పం నుంచి ఎనిమిదో సారి చంద్రబాబునాయుడిని లక్ష మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఓటర్లలో ప్రభావితం చేయడానికి బిసి సామాజిక తరగతికి చెందిన ఎంఎల్‌సి భరత్‌ను వైసిపి., పోటీలో నిలిపింది. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి ఆవుల గోపి బరిలో ఉన్నారు.
పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు.. టిడిపి, బిసివై పార్టీల ప్రచారాలను అడ్డుకుంటూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లా రామచంద్రారెడ్డి టిడిపి తరపున బరిలోఉన్నారు. బిసివై నుంచి బోడే రామచంద్రయాదవ్‌ పోటీలో ఉన్నారు. గతంలో ఆయన జనసేన నుంచి పోటీచేసి 16వేల ఓట్లు తెచ్చుకున్నారు. ‘మార్పు’ పేరుతో పెద్దిరెడ్డిని ఢీ కొంటూ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పలమనేరులో ఎన్‌.అమరనాథరెడ్డి టిడిపి తరపున, సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ వెంకటేగౌడ వైసిపి తరపున బరిలో ఉన్నారు. వైసిపి నుంచి భారీగా వలసలు రావడంతో 60 వేల మెజార్టీతో తమ అభ్యర్థి గెలిచి తీరుతాడని టిడిపి శ్రేణులు ధీమాతో ఉన్నాయి. షార్ట్‌ ఫిల్మ్‌ల నిర్మాత శివశంకర్‌రెడ్డి ఇండియా బ్లాక్‌ తరపున కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.

చిత్తూరులో వైసిపి నుంచి ఆర్‌టిసి జోనల్‌ ఛైర్మన్‌ విజయానందరెడ్డి, టిడిపి నుంచి బెంగుళూరులో బిల్డర్‌ అయిన గురజాల జగన్మోహన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి నుంచి మాజీ ఎంఎల్‌ఎలు సికెబాబు, ఎఎస్‌ మనోహర్‌ వైసిపిని వదిలి టిడిపిలోకి రావడంతో గెలుపు సునాయాశమని ఆ పార్టీ అభ్యర్థి ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి తిక్కీ రాయల్‌ పోటీలో ఉన్నారు.
పూతలపట్టు నుంచి డాక్టర్‌ సునీల్‌ వైసిపి తరపున, ప్రముఖ జర్నలిస్టు డాక్టర్‌ మురళీమోహన్‌ టిడిపి నుంచి బరిలో ఉన్నారు. వైసిపి కంచుకోట అయిన పూతలపట్టును ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని టిడిపి శతవిధాలా ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆశ్శీస్సులు మురళీమోహన్‌కు ఉన్నాయని చెపుతున్నారు.. వైసిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ఎంఎస్‌ బాబుకు టిక్కెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్నారు. వైసిపి ఓటు బ్యాంకును ఆయన చీల్చే అవకాశం ఉంది.

జీడీ నెల్లూరులో డిప్యూటీ సిఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి వైసిపి నుండి, డాక్టర్‌ థామస్‌ టిడిపి నుంచి, కాంగ్రెస్‌ నుంచి రమేష్‌ బరిలోఉన్నారు. రమేష్‌ స్వయంగా నారాయణస్వామి బావమరిది కావడంతో వైసిపి ఓట్లలో చీలిక వస్తుందని చెపుతున్నారు.
నగిరి నుంచి మూడోసారి పోటీచేస్తున్న ఆర్‌కె రోజాకు సొంత గూటిలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. తాజాగా శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, నాయకులు మురళీనాధరెడ్డి, వెంకటముని, అమ్ములు తదితరులు రాజీనామా చేసి, టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. రోజాను ఓడించడమే తమ పంతమని వారు విలేకరుల సమావేశం పెట్టడమే గాకుండా, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. టిడిపి తరపున గాలి భానుప్రకాష్‌ బరిలో ఉన్నారు. ఈసారైనా తనను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి పుత్తూరుకు చెందిన రాకేష్‌రెడ్డి బరిలో ఉన్నారు.

రాకేష్‌రెడ్డి.. వైసిపి ఓట్లే ఎక్కువగా చీల్చే అవకాశం ఉంది.
చిత్తూరు పార్లమెంట్‌కు సిట్టింగ్‌ ఎంపి రెడ్డెప్ప వైసిపి తరపున, బాపట్లకు చెందిన రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి దగ్గుమళ్ల ప్రసాద్‌రావు టిడిపి నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి చిత్తూరు జిల్లా తవణంపల్లికి చెందిన ముత్తుకూరు జగపతి పోటీలో ఉన్నారు.

➡️