బతుకు మొక్కలకు …

Jan 22,2024 10:02 #sahityam

అమతం కావాలన్నామా ?

ఆకాశగంగను పెరట్లో దింపమన్నామా ?

యావజ్జీవితం ఇంటద్దె సదుపాయాలు

ప్రయాణ భత్యాలు కోరుకున్నామా ?

ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా

కీ.పూ నాటి జీతాలే కదా

ఆకాశానికి నిచ్చెన వేసే ధరలతో

పప్పూఉప్పూ అందరాని వస్తువులై

అల్లంత దూరంలో

మినుకుమినుకు మంటున్నపుడు

పస్తుల అక్షరమాలలు తప్ప

కడుపు నింపే పాఠాలెక్కడ ?

ఊరిలో పసిపిల్లలందరికీ

పాలపొడి పంచే చేతులు

బానెడు బొజ్జ ఊచపుల్లల కాళ్ళున్న

మా పిల్లాడికి ఆకలి తీర్చలేని శూన్యహస్తాలు

గ్రామంలో గర్భవతులందరికీ

పౌష్టికాహారం అందించే నాకు

గంజి మెతుకులు కూడా ఊరించే పంచభక్ష్య పరమాన్నాలే

అటు పూర్తిగా చావలేక

ఇటు అందరిలా ఊపిరి పరిమళాలు పీల్చలేకా

త్రిశంకు స్వర్గంలో

ఏ ఆధారం ఆధార్‌ లేక

గుడ్డెద్దు చేలో పడ్డట్టు కుంటి నడక నడుస్తున్న

మా బతుకు దీపాలను వెలిగించడానికి

కాసింత జీతం చమురు పొయ్యండి

ప్రజల బాగోగులను పట్టించుకొనే వాడే ప్రభువు

బాబూ! మా గోడు పట్టించుకోండి

మా బతుకు మొక్కలకు

కాసిన్ని నీళ్ళు పొయ్యండి !    – మందరపు హైమవతి

➡️