కొన్ని ప్రశ్నలు

Dec 13,2023 09:01 #sahityam

తనువు ఉన్నాళ్ళు కూటికి

తనువు చాలించాక కాటికి

అంతమాత్రానికే ఎందుకు భేషజాలు ?

 

మౌనం ఆభరణమైతే

మాట తీరు అలంకారమైతే

ఇంకెందుకు విషపు ఆలోచనా బీజాలు ?

 

కష్టం నీకు ఇష్టమైతే

విజయం నీ స్వంతమైతే

నీకెందుకు ఈర్ష్యద్వేషాలు ?

 

కీర్తి కోసం పాకులాడక

స్ఫూర్తి కోసం పాటుపడితే

విమర్శలకు ఎందుకు రోషాలు ?

 

అందరూ బాగుండాలని

అందులో మనముండాలని

అనుకుంటే ఎక్కడది ఆత్మవంచన ?

 

ప్రేమించే మనసుంటే

ఆదరించే గుణముంటే

వృద్ధాప్యం చేరునా ఆశ్రమం పంచన ?

 

వినయం నీ వెంటుంటే

విజ్ఞత నీ చెంతుంటే

తలకెక్కినా కాదా గర్వభంగం ?

 

మహిళను పూజిస్తే

అమ్మని నీవు భావిస్తే

జరుగునా అతివలపై మానభంగం ?

 

మార్చుకుంటే ప్రవర్తన

నడచుకుంటే సత్ప్రవర్తన

జరగదా నేటి సమాజం పరివర్తన ?

– కయ్యూరు బాలసుబ్రమణ్యంసెల్‌ : 7780277240

➡️