బాధితుల పక్షాన బాధ్యతాయుత స్వరం

Jan 8,2024 09:08 #sahityam

            మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కావ్యానికి గుడిపాటి వెంకట చలం ‘యోగ్యతాపత్రం’ రాశారు. అందులో ఒకచోట ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ’ అని వ్యాఖ్యానించారు. ఇలా ప్రపంచపు బాధను తమ బాధగా పరిగణించే కవుల్లో ముందు వరుసలో ఉండే కవి సరికొండ నరసింహరాజు.

చిన్న వయసులోనే తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీని, ఇమేజిని లిఖించుకున్నారు ఆయన. ఇప్పటివరకు 10 కవితా సంపుటాలను అచ్చు వేయించి అనేక అవార్డులు పొందారు. రెెండు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో జరిగే సాహిత్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు. ఆయన తాజాగా ‘నెత్తుటి పాదాలు’ పేరిట కవితా సంపటుఇ వెలువరించారు. కరోనా సమయంలో వలస కూలీలు పడిన బాధలకు చలించి రాసిన కవితలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి.

మొట్టమొదటిగా ‘ఊపిరి ఆడటం లేదు’ అనే కరోనాత్మక, కరుణాత్మక కవితలో కొన్ని పాదాలు ఉటంకిస్తాను. మనిషికి ఒకసారి ఊపిరాడకపోతేనే ప్రాణం తిరిగి రాకుండా ఎటో పోతుంది. వర్తమాన జీవన చిత్రంలో మనిషి ఎదుర్కొంటున్న జీవిత సంఘర్షణలలో ప్రతిక్షణం ఊపిరి ఆడని పరిస్థితులు ఉన్నాయనే ఉద్దేశంతో రాసిన అద్భుత కవనం ఇది.

”గడ్డ కట్టిన కన్నీటి కాలంలో/ ఊపిరి ఆడటం లేదు/ తెగిపడ్డ మానవ సంబంధాల నడుమ/ ఊపిరి ఆడటం లేదు ద్ణుఖం పొలమారి/ ఊపిరి ఆడటం లేదు/ గొంతులో వర్ణ వివక్ష గళం అడ్డుపడి/ ఊపిరి ఆడటం లేదు అధికారం అణచివేతల/ గానుగలో పిప్పై ఊపిరి ఆడటం లేదు/ కనిపించని ఉరితాడుకు వేలాడుతూ / బడుగు జీవికి పేదరికపు వధ్య శిలపై ఊపిరి ఆడటం లేదు” ఎన్ని రకాల భావచిత్రాలను ఇందులో పొదిగారో చూస్తేనే ఆయనకు భాషపై ఉన్న పట్టును, అణగారిన ప్రజల పట్ల సహానుభూతి సానుభూతిని మనం అంచనా వేయొచ్చు.

కరోనా వైరాగ్యం అనే మరో కవితలో ‘చెట్టుతో మాట్లాడుతున్న/ పిట్టతో మాట్లాడుతున్న/ కడగండ్లతో మాట్లాడుతున్న/ కన్నీళ్ళతో మాట్లాడుతున్న/ మట్టితో మాట్లాడుతున్న/ మౌనంతో మాట్లాడుతున్న/ కరోనాకాలం కదా ఇది/ మాట్లాడే మనుషులే లేరు/ ఈ బధిర లోకంలో/ బతుకుతో పోట్లాడుతున్న…” అన్నారు. కరోనా కోర ఘోర పిశాచికి ప్రాణ భయకంపితులై ప్రజలు పడిన పాట్లు, అగచాట్లు, రోదన మనకందరికీ స్వానుభవమే. ఆసుపత్రుల్లో, ఇంట్లోనూ ఏకాంతంగా గదుల్లో ఎవరికి ఎవరో, చివరకి మిగిలేది ఎవరో అనే ఆవేదనతో, ఆందోళనతో గడిపిన జీవనం మనకు మరచిపోలేని భయంకర అనుభవాలను మిగిల్చింది. మాట్లాడటానికి మనిషి లేని కరోనా కాలంలో పడిన మానసిక వ్యధ ఈ కవితలో పద చిత్రాలలో కనిపిస్తుంది. ‘మరో చీకటి రాత్రి’ అనే కవితలో 2020 మేలో ఎల్జి పాలిమర్స్‌ కంపెనీలో జరిగిన ఒక ప్రమాదం గురించి ప్రస్తావించారు. గాలి పీల్చుకోవటానికి కూడా సామాన్య ప్రజలు పడే అగచాట్లను, రోడ్లపైనే కుప్పకూలిపోయిన హృదయ విదారకమైన దశ్యాలను ప్రభావశీలంగా వివరించారు.

”మరో భోపాల్‌ నా విశాఖా/ ఓ ముగింపు లేని స్మ ృతి గీతం/ విషపు చెట్టుకు విషాదం/ శాఖోప శాఖలుగా విస్తరించినట్లు/ కాలుష్య సముద్రంలో కలిసిన/ ఆవేదనల కన్నీటి జన సముద్రం/ ఎడతెగని దు:ఖ తీరాన/ చచ్చిన ఉప్పు చేపలు/ చెల్లాచెదురుగా పడినట్లు/ మరణం వలవేసిన/ తెంపులేని చీకటి రాత్రి/ తెంపిన పేదల ఊపిరి దారాలు…” అంటూ విషాద రాత్రిని వివరించారు. మరణాన్ని వల తోనూ, పేదల ప్రాణాలను పుటుక్కున తెగే దారాలతోనూ పోల్చి చక్కని ఉపమానాలతో ఈ కవితను చిరస్థాయిగా నిలిపారు. లాభాల సముపార్జనే ధ్యేయంగా ఉండే, కార్మికుల కండలను పిండే కర్మాగార యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లిప్తత, అధికారుల నిద్రాణ స్థితి అన్ని కలగలసి ఎన్నో పేద ప్రజల ప్రాణాలను తీశాయి. ”నేనే” అనే మరొక కవితలో కవన కదనరంగంలో తన విశ్వరూపాన్ని కవితాక్షరాలను శరాలుగా మార్చి తన మార్కు కవిత్వాన్ని రుచి చూపిస్తారు. ”కలల మధ్య పడేయండి/ కావ్యమౌతాను / వెదురు తోటలో పడేయండి/ వేణువునౌతాను/ కొలిమిలో పడేయండి/ ఆయుధమౌతాను/ బోనులో బంధించండి/ సింహగర్జనౌతాను/ నేలలో పాతేయండి/ చెట్టునౌతాను/ సముద్రంలో ముంచండి/ ముత్యమవుతాను/ ఆకాశంలోకి విసిరేయండి/ సూర్యబింబం అవుతాను” అన్నారు. ఇది కదా కవిత అంటే. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నేను నాలాగే ఉంటాను నేను నేనే అని నిక్కచ్చిగా ప్రకటిస్తూ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంలో మీరంతా ఉంటారని నిశ్చయంగా చెప్తున్నాడు.

ఈ సంపుటిలో కవిత్వమంతా మనిషి తత్వాన్ని నిలబెట్టడానికే రాసిన కవిత్వం. అసలు మనుషులను పోల్చడానికి ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువులను మించి ఎక్కడ దొరుకుతాయి. మానవ సంబంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలంటే మన చుట్టూ కోకొల్లలుగా కనిపించే ఉదాహరణలను గమనించాలి. వెలక్కాయల ఉపరితలం గట్టిగా, లోపల మెత్తటి గుజ్జు ఉంటుంది. మనుషులు కూడా కొంతమంది బయట కరకుగా కనిపించినా లోపల మంచితనం, మానవత్వం అనే గుజ్జు ఎంతో ఉంటుంది. ఆ గుజ్జు వరకు తీసుకొని ఆనందించాలి. అదే విధంగా మనిషిని ఒక చెరుకుగడలా కూడా పోల్చవచ్చు. బయట కొరుకుడు పడని తత్వంతో ఉన్నా కొంచెం కొంచెం ఆస్వాదిస్తుంటే ఆ మాధుర్యమే వేరు. మనం వారిలోని చెరుకు రసం లాంటి ప్రేమను గ్రోలి అవసరం లేని పిప్పిని వదియాలి. అంతేగాని బయట పొర అడ్డుగా ఉంది కాబట్టి పారేసి వస్తానంటే ఉపయోగం లేదు. కుల మత ప్రాంత జాతులకు అతీతంగా ఈ ప్రపంచాన్నంతా ప్రేమమయం చేయటమే ఈ కవిత్వం సారాంశమని అర్థమవుతుంది.

”ఆఖరి మజిలీ అమ్మ” కవితలో… ”చందమామ రావే.. జాబిల్లి రావే../ అని లాలించిన చేతులు/ శవాలను చంకనెత్తుకుంటున్నారు/ కన్నతల్లై కన్నీటి లాల పోస్తున్నారు/ అనాధ శవాలకు సైతం దహనసంస్కారం నిర్వర్తించే అనుంగు బిడ ఆమె!/ పతాక శీర్షిక లెక్కని ఉత్తమ సంఘ సంస్కర్త!/ చితికిన చీకటి బతుకుల చితిమంటల సాక్షిగా…/ కాటికాపరి బాధ్యతల్ని శవాల బంధాన్ని భుజానికెత్తుకుంది!/ బతుకు కడగండ్ల పడగ మీద/ మణి అందుకుందేమో/ అందుకే కాటికాపరి మణెమ్మ ఐంది!” అంటూ నల్లగొండ జిల్లా గరిడేపల్లిలో మహిళా కాటికాపరి వృత్తి నిర్వహించే మణెమ్మ గురించి హృదయం ద్రవించేలా రాశారు. ”ఆకలి మాట్లాడితే…” కవితలో రూపకాలంకారాలతో ఒక విశ్వరూపం కనపడుతుంది. ”ఆకలి మాట్లాడితే/ గుక్కపట్టే పిల్లాడికి సేపిన తల్లి రొమ్ములాగుంటది!/ బోయవాడి వేటుకు రాలిపడ్డ/ పక్షుల రెక్కల చప్పుడు లాగుంటది/ బిచ్చగాడి సత్తుపళ్ళెంలో/ ఎండిన పేగుల అపశృతుల పాటలాగుంటది/ దేవాలయాల మెట్లపై భిక్షువర్షీయసీ పద్యంలా వుంటది!/ పేదవాడి కన్నుల్లో రాలే అగ్నివానలా వుంటది/ నేతన్నల రైతన్నల అనాధ శవాల మరణవాగ్మూలంలా వుంటది/ ఆకలిదెప్పుడూ విశ్వజనీన భాషే/ దు:ఖలిపిలో బతుకు ఘోషే/ ఆకలి ఆది అంతాలు లేని/ అనంత కవితా వాక్యమౌతుంది..” అన్నారు. ఆకలిని గూర్చి విపులీకరిస్తూ రాలిపడ్డ పక్షుల రెక్కల చప్పుడు, బిచ్చగాడి సత్తు పళ్లెం, ఎండిన పేగుల అపశృతి రాగంతో పోలుస్తూ ప్రశస్తమైన ప్రతీకలు వాడటం ఎంతో సముచితంగా ఉంది. చివరగా ‘ఆకలిని ఆద్యంతాలు లేని అనంత కవితా వాక్యం అవుతుంది’ అంటారు సరికొండ.

మకుటాయమానమైన మరో కరోనా కవితలో వలస కూలీల బతుకులను ప్రతిభావంతమైన కవితా వాక్యాలతో ఇలా వర్ణిస్తారు. ”గాఢాంధకార చీకటిలో/ మృత్యు దీపం వెలుతురులో/ కరోనా వేలు పట్టుకొని/ కాలం తీగ మీద నడుస్తూ/ వల్లకాటి దారిలో పయనం అయ్యాడు/ నేల తల్లి చేతుల్లో నెత్తుటి పాదముద్రలై …” అంటాడు. ఇక్కడ నేలను తల్లితో పోల్చడం సాధారణమైన పోలికైనా కరోనా బాధిత కార్మికులు నెత్తురోడుతున్న కాలి గాయాలతో పొట్ట చేత పట్టుకొని వందల కిలోమీటర్లు తమ గమ్యాన్ని చేరుకోవడానికి పాదయాత్రలు చేసిన సంఘటనలను నేలతల్లి చేతుల్లో నెత్తుటి పాదముద్రలు అనే విలక్షణమైన ప్రతీకగా మలచటం ప్రశంసనీయంగా ఉంది. నరసింహరాజు కవిత్వం తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలచి ఉంటుంది. పీడిత తాడిత ప్రజల హృదయ ఘోషను కవిత్వ సజీవ జీవన భాషగా ఆవిష్కరిస్తున్న ఆత్మీయ సాహితీ మిత్రుడు నరసింహారాజుకి హృదయపూర్వక అభినందనలు.

కవి ఫోను : 93982 54545.- డాక్టర్‌ జెల్ది విద్యాధర్‌

➡️