సేద్యగాడు

Nov 27,2023 08:00 #sahityam

రెక్కలు నాటి, పక్షి మొలిచిందని గెంతుతాడు వాడు

అరచేతుల్లో ఆర్తిని ఆకాశానికి ఎగురవేస్తాడు

నాలుగు మాటలు చల్లి, విరులు ఇవే..

సుగంధాలని ఆస్వాదించండంటాడు

 

పుట్టెడు వ్యధల్నీ పుట్టల కథల్నీ

ఓపిగ్గా వీక్షించీ వినీ

చలనమున్న గుండె కనుక చమరిస్తాడు

 

చలిని దుప్పట్లో కాక తన గుండెలో

దాచి పెడతాడు కనుక

ఎండని నడినెత్తికి కాక

మనసుకి అంటించుకోవడం తెలుసు కనుక

అతడు సేద్యగాడు అని ముద్దుగా పిలిపించుకుంటాడు

 

అతని తృష్ణ అతనికి మాత్రమే కడుపు నింపదని

మరచి హేళన చేసినా

వీసమెత్తు బాధపడడు

అడుగులగు బంగారు తొడుగులతో పుట్టిన

వెండి పిల్లలేమోలే అని ఆపేక్షగా నవ్వుకుంటాడు

పధకాలకి పొంగి, సర్కారుని నమ్మి

మాత్రమే వ్యవసాయమంటే

అతడు మనల్ని చూసి జాలిపడతాడు

ఇంకా కాడెద్దు పాత్ర పోషిస్తున్నందుకు

అతడికి ఆ హక్కు ఉందిలే..! – అనూరాధ బండి

➡️