ట్రోలర్‌తో ముఖాముఖి

Mar 4,2024 08:40 #sahityam

ఏం నాయనా ఈ ఫేకుడేంది?

ఫేస్‌బుక్‌లో పని చేస్తున్నా కదా!

ఏం పని చేస్తున్నావు బాబు?

ట్రోలర్‌గా పనిచేస్తున్న.

ఏం పాసయ్యావు తండ్రి?

పాసులు, పట్టాలతో పని లేదండి.

మరి ఎక్కడ చదివావు నాన్న?

వాట్సాప్‌ యూనివర్సిటీ లోనండి.

 

జీతభత్యాలు ఏమిస్తారేమిటి?

చేసుకున్నోనికి, చేసుకున్నంత.

మరి మీరు ఏమి చేస్తారేమిటి?

సత్యానికి సర్వమంగళం పాడి

అసత్యాన్ని అందలమెక్కించడం.

 

ఇంకేమి చేస్తారేమిటి?

మనిషిని ఏకి ఏకి ఏకాకి చేయడం

మా వాడు కాని వాడి గొంతు నొక్కేయడం

పొంతన లేని మాటలతో పొగబెట్టడం

కాకి లాగా పొడిచి పొడిచి పరుగెత్తించడం!

 

అసలు మీ లక్ష్యం ఏమిటి?

నెటిజనులను నెగలనీయకపోవడం

నెట్టింటిలో నుంచి నెట్టివేయడం

 

ఇది అన్యాయం కాదా, బాబూ?

ఇది ఆటలో భాగమేనండి.

మీకు మర్యాద, మానవత్వం మనసు లేవా?

అవెందుకండి? మాకు మతం ఉంది కదా!

 

ఏది మీ ఐడి ఒకసారి చూద్దాం?

మాకన్నీ ఫేక్‌ ఐడి లేనండి

ఇంతకు మీరు ఎలా ఉంటారు బాబు?

ఓ అదా! మేము ముసుగు వీరులం

కాదు కాదు, ముసుగులో ధూర్తులం!

– డా. ఎడ్ల కల్లేశ్‌98667 65126

➡️