ఫోన్‌ నంబర్‌

Apr 1,2024 08:18 #sahityam

గాయం కనబడదు
రక్తం అసలు చిందదు
నొప్పి అదాటున
నరనరాల్లోకి పాకి
హృదయాన్ని మెలి పెడుతుంది

నీ ఫోన్‌ సంభాషణ
తలను భూమిలోకి తొక్కేస్తుంది
లేకి మాట
గొంతెత్తి గుచ్చుతుంది
వేలెత్తి చూపుతుంది

అదాటున మీట నొక్కి
కారుచవకగా ఏదో దొరకబుచ్చుకుందామనే
ఆలోచన నీది
మాటల మంత్రదండం ఊపి
పలుకులకు పంచదార అద్ది
వలలో చేపపిల్లను
సునాయాసంగా పట్టాలనే ఆరాటం నీది

అక్కడొక అనుమానపు తాళి
చూపులతో గుచ్చి గుచ్చి చంపుతుంది
ముళ్ళ దండతో
ఉరేద్దామని కాపు కాస్తుంది
కాపురంలో మరొక భూకంపానికి
తెర లేస్తుంది

నీకు ఇదంతా ఆటపాటల మధ్య
మీసం మెలేస్తూ చేసే
సరదా సరదా చెలగాటం
ఇక్కడ కలం ఎత్తి
మనసులోని భావాలను మధించి ఒంపినందుకు
ప్రాణసంకటం

వాక్యం భుజం మృదువుగా తట్టే
ఆత్మీయ స్పర్శ కోసం
అక్షరాలను కళ్ళలో వేసుకునే
మురిపెం కోసం ఎదురు చూస్తూ
కవిత కింద ఫోన్‌ నంబర్‌
అమాయకంగా వేళ్ళాడుతుంది
కానీ, అది నీకు
ఆహ్వాన పత్రికో ఎర్ర తివాచీనో
కానే కాదని గుర్తుంచుకో
అయినా అడుగు ముందుకేసి
అదే దారిని అనుసరిస్తే
పాళీని కత్తిగా తర్జుమా చేసే శక్తి కూడా
ఇక్కడుందని గమనించుకో!

– పద్మావతి రాంభక్త
99663 07777

➡️