ఆసరా

Apr 1,2024 04:46

ఇక్కడ నమ్మకం ఒక్కటే సరిపోదు
నమ్మకాన్ని నిజం చేయగల్గిన
‘ఓటు’ ఆసరాగా నిలవాలి
దేశాభ్యున్నతికై కొత్త దార్లు వెతికే
నాయకత్వం, పార్లమెంటు భవనంపై
మువ్వన్నెల జెండాయై ఎగరాలి
పేద బతుకుల్లో వెన్నెల నింపే
ఆలోచనలు అండగా నిలవాలి
నౌకరీ కోసం వలసలు పోయే
సంస్కతిని ఆపి, దేశం నలుమూలలా
ఉద్యోగ వంగడాల్ని చల్లాలి
అప్పుడే కదా నవరాగంతో
వసంత కోకిలలు
ఆహ్వాన గీతాలవుతాయి
పల్లెపల్లెలో పచ్చదనం వికసించి
పండుగల ద్వారాలు తెరుచు కుంటాయి
నిన్నటి చీకటిని చీల్చుకొని
నేడుద్భవించిన భానుడు
భవితంతా కాంతి నింపుతాడు
ఎక్కడ, ఆలోచనల్లోంచి
స్వార్థం ఆవిరై, సంక్షేమం
పచ్చని చెట్టై విస్తరిస్తుందో
అక్కడ ప్రజాస్వామ్యం లోంచి
నీతిపుష్పాలు వికసిస్తాయి
జాతి యావత్తు ఆ పరిమళాలు ఆస్వాదిస్తాయి!
-ఎస్‌.ఆర్‌.పృథ్వి
99892 23245

➡️