యథార్థ వాదం

May 20,2024 05:20 #sahityam

ముఖ కవళికలకు, హావభావాలకు
రంగేసుకోవచ్చు
నలుపును తెలుపు చేసి
నిజ వాక్కులను మోహపరచి,
పొలిమేరలు దాటించొచ్చు!

ఊచలకు చిక్కకుండా-
అనృతాలకు కాశీ మజిలీ కథలల్లి,
విస్మయ పరచి
మీడియా భుజాన ఊరేగవచ్చు
గెలుపు వోటును కొల్లగొట్టనూ వచ్చు
అరచేతుల కంటిన రక్తం చుక్కలను
గంగోదకంతో ప్రక్షాళన చేసుకోవచ్చు
న్యాయస్థానం గడపకు నామాలు దిద్ది-
నరావతారంలోనూ నభోంతరాల్లో
వెలుగు వెలగొచ్చు
కాక రాజేసిన జన మనమున దూరి-
జరిగిన దోషం, మిగిలిన నష్టం
గండశిలలా పాతుకుపోయి వుంటుందిలే
మనసులో సాక్షిగా …
ఎప్పటికైనా తలొంచక తప్పదు
అజేయమైన, కనపడని మనస్సాక్షి ముందు!

– దాసరాజు రామారావు

➡️