సం ‘క్రాంతులు’ రావాలి

Jan 15,2024 08:15 #sahityam

పాతకు గోరీ కడుతూ

కొత్తకు భేరీ కొడుతూ

భోగి మంటల సయ్యాటలా

బతుకు బతుకులో

సం’క్రాంతులు’ రావాలి!

 

బాల్యపు బంతిపూలు

పురివిప్పిన నెమల్లవుతూ

గగనాన గాలిపటమై

ఆనందాల హరివిల్లులను

ఆవిష్కరించే సప్త వర్ణాల

సంక్రాంతులు రావాలి!

 

గంగిరెద్దులు నాట్యమాడినట్టు

బొమ్మల కొలువులు

ముచ్చట గొలిపినట్టు

జంగమ దేవరలు దీవించినట్టు

పాడిపంటలు పొంగి పొరలే

రైతు సంక్రాంతులు రావాలి

 

ఇళ్ల ముంగిళ్లలో

ముత్యాల ముగ్గులు మురిసినట్టు

చలిపొద్దు పొడుపులో

సూరీడు ఎర్రబారినట్టు

నవనవోన్మేశంగా

నవ సంక్రాంతులు రావాలి!

 

పడతులు పూల సజ్జలై

పట్టు పరికిణీలు కట్టినట్టు

చెరుకు కంకుల గడలు

తియ్యందనాలను చిమ్మినట్టు

అభి’రుచుల’ సంక్రాంతులు రావాలి!

 

పిల్లల భోగిపళ్ల ముచ్చటలా

కోడి పందాల కోలాహాలహేలలా

రథం ముగ్గులో గొబ్బిల్లలా

కొత్త పొంగలి రుచులతో

కొంగ్రొత్తగా సంక్రాంతి రావాలి..!

– డా.కటుకోఝ్వల రమేష్‌ 99490 83327

➡️