నిజం దిశగా..నిర్భయంగా …

Feb 12,2024 08:53 #sahityam

                  యాములపల్లి నర్సిరెడ్డి అనబడే ఈ కవి స్వచ్ఛమైన మనిషి. తన బాధని, సంఘర్షణని, తన ప్రాంత వేదనని, సమాజంలోని వైపరీత్యాలను శిలావృక్షంగా మన ముందుకు తీసుకుని వచ్చాడు. నర్సిరెడ్డి చాలాకాలం నుంచి రాయలసీమ నుంచి కవిత్వం అయ్యాడు. అవుతున్నాడు. నా దృష్టికి కవిగాను మనిషిగాను నర్సిరెడ్డి ఒకేలా కనిపిస్తాడు. ఈ కవి ఇంతకుముందే వోరుప్పోటు, మన్నే మాత్రం పుస్తకాలని ప్రచురించాడు. వోరుప్పోటు దీర్ఘ కవితగా వెలువడి అనేక మన్ననలను, బహుమతులను అందుకుంది. రాయలసీమ నీటి కోసం, నీటిని నిలబెట్టే చేతుల కోసం, ఆ నేల బాగు కోసం ఆనాటి నుంచి నేటిదాకా నిరంతరం శ్రమించే విషయం మనందరికీ తెలుసు. ఈ కవి కూడా సీమ వ్యధను, బాధను అక్షరాలకు తీవ్రతను రాసి, కవిత్వంలా కురుస్తున్నాడు. నిశ్చేష్టంగా నిలబడిపోయిన గాలిని చూపిస్తాడు. నీళ్లు లేక మధ్యలోనే రాలిపోయిన అవిటి పుష్పాల వేదన వినిపిస్తాడు. అక్షౌహిణీల సైన్యంతో దాడి చేస్తున్న ఉక్కపోతను పరిచయం చేస్తాడు. రాయలసీమ పల్లెలోని పొడి దృశ్యాలను పోత పోసినట్టే కై కడతాడు. కుండపోత ప్రేమతో వర్షం కురిసిన రోజుని, కరువు నేలపై కరుణతో వచ్చిన వానని గురించి రాసిన కవిత నిజంగా అపురూపమే. జలదర్పణం చూపిస్తాడు. వలస, కరువు అవిభక్త కవలలు అంటూ వాపోతాడు.

‘మీరేమీ అనుకోకుండా ఒకే ఒక్కసారి/ మా రాయలసీమ అమ్మ కడుపును స్కాన్‌ చేసి చూడండి/ ఆమె గర్భసంచిలో ఒక బట్టల్లేని శిశువే కాదు/ బట్టల సర్దిన బ్యాగ్‌ కూడా కనిపిస్తుంది/ గాడిద కాలు గిట్టలా ఇద్దరూ అతుక్కునే పుడతారు/ వలస పోవడానికి ఏం చేయమంటారు/ వలస మా నంజీరైన బతుకుల్లో భాగమైపోతేను ..’రాయలసీమ స్థితిగతులు, పరిస్థితులు, కన్నీటి గాథలు చెప్పడం ఎప్పటినుంచో ఉంది. అయితే నర్సిరెడ్డి పడుతున్న ఆవేదన, ద్ణుఖం మనల్ని మెలి పెడుతుంది. నర్సిరెడ్డి కవితని ప్రారంభించడంతోనే మనల్ని తన వెంట తీసుకుపోతాడు. వాక్యాల్లో పోలికలు, రూపకాలు పరుగులు పెడ్తుంటారు. అతని పదాల వాక్యాల వెంట మనం పరుగులు తీస్తాం. వాక్యాల్లో వేగం మనల్ని గుక్కతిప్పుకోనివ్వదు. అనంతపురం జిల్లాని ఎడారి పండుకోయిల అని, చింత నిప్పుల కొలిమి అని, చెప్పులు అరిగేలా తిరిగిన వలస బొబ్బల పారాణి అని అంటాడు.

నర్సిరెడ్డి కవిత్వంలో ఇవాళ్టి రాజకీయాలు, అవినీతి, పర్యావరణం, వస్తు జ్ఞాపకాలు, వ్యక్తులు, వృత్తి కేంద్రంగా కొన్ని ఉన్నాయి. మరికొన్ని విభిన్న వస్తువుల మీద కూడా కవితలు ఉన్నాయి. తీసుకున్న వస్తువుకు, ఎంచుకున్న అభివ్యక్తి పాఠకుల్ని చదివించేలా చేస్తుంది. భవన నిర్మాణ కార్మికుల గురించి రాసిన కవితలో అతని జీవితాన్ని ఆవిష్కరించిన విధానం బాగుంది. ఇంటికి శంకుస్థాపన చేసింది మొదలు, గృహ ప్రవేశం రోజు వరకు అతని కష్టం ఏమిటో చెబుతాడు. అతని కష్టానికి మనం డబ్బు చెల్లించి, మర్చిపోతాం. ఉన్నవాళ్లు అంతస్తులపైకి వెళ్తూ ఉంటే, ఈ కార్మికుడు తనివి కాని అంతస్తులు దిగిపోయే విషాదాన్ని గుర్తుచేస్తాడు. ‘గృహప్రవేశం రోజు పేపర్‌ ప్లేట్లో/ ఓ గరిటెడు పాయసంతో తీరిపోయేవాడి రుణానికి/ ప్రాణాలు పోయాక వచ్చే కార్మిక జీవిత బీమా కన్నా/ వాడితో జీవితమే కావాలని ఎదురు చూసే/ ఇంటి ఇల్లాలి కళ్ళ వత్తులకు ఏ బుర్జ్‌ ఖలీఫాలు సమాధానం ఇవ్వగలవు?’ అనే ప్రశ్న వేస్తాడు. ఈ కవితలో ప్రాణాల్ని పిడికట్లో పట్టుకోడానికి కూడా వాడికి చేతులు ఖాళీగా ఉండవు. ఊపిరి తాడుని శూన్యానికి కట్టి తాత్కాలికంగా నిలబెట్టిన కర్రలను అనుసంధానం చేయడం, తరాల పర్యంతం నిలిచే కట్టడాల వెనుక పార్టీ జెండా మోసిన సాధారణ కార్యకర్తలా ఉండటం’ లాంటి వాక్యాలు ఆ కవితను నిలబెట్టాయి. అలాగే ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న నాటకాల పరిస్థితి ఇప్పుడు ఎలా అయిందో మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో రాసిన కవిత నాటకం. ఆ కవితలో కూడా ఇప్పటి వాస్తవాలను చిత్రీకరించి తీరు నర్సిరెడ్డిలోని కవిత్వ నిర్మాణ శక్తిని తెలుపుతుంది. కవితలో ముగింపు వాక్యాలు … ‘తబలా తమ్ముడితో హార్మోనియం పక్క ఊరికి మకాం మారుస్తుంది/ పద్యం పొలం గట్ల పైకో, జీవాల మంద మధ్యకో తరలిపోతుంది/ చావడిలో గబ్బిలాలు కొత్తగా కాపురం పెడతాయి/ ఊరంతా పిల్లన గ్రోవినిని పూడ్చిపెట్టిన నిశ్శబ్దం…’ ఈ వాక్యాన్ని చదివాక పాఠకుడి మనసు కూడా నిశ్శబ్దం అయిపోతుంది. నర్సిరెడ్డి కవిత్వంలో కల్లబొల్లి మాటలు ఉండవు. వాస్తవాల చిత్రణ ఉంటుంది. తీవ్రమైన ఆవేశంలోనూ పట్టుతప్పని పదాల పోహళింపు ఉంటుంది. తాను ఎంచుకున్న వస్తువుని అవలీలగా కవిత్వం చేసి, మనలోకి పంపుతాడు. తాను ఒక మొక్క వేసినప్పటికీ సంతోషాన్ని సంబరం అనే కవితలో రాశాడు. మొక్క నాటిన సంతోషం, ప్రాణాపాయ వ్యక్తికి రక్తం ఇచ్చినంత ఆనందం అంటాడు. సీకాయి గిన్నెను అరచేతి చెరువుగా, వక్కరోలును కళాఖండంగా, బలపాన్ని బాల్య మిత్రుడిగా, గాటి పట్టును భూమధ్యరేఖగా కవిత్వీకరించడం విభిన్నంగా అనిపిస్తుంది. కులాలకు, మతాలకు రాజీనామా చేస్తే బాగుంటుందని కొత్త ఆలోచన కూడా చేశాడు. ఈ లౌకికవాద దేశంలో జరుగుతున్న కుట్రల గురించి రాసిన రాజీనామా అనే కవిత కూడా మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇంతవరకు ఎవరూ రాయని ఒక విభిన్న వస్తువు బట్టల షాపుల ముందు ఉండే ‘మానికిన్‌’. ఇవి బట్టల షాపుల ముందు ఉండే అందమైన బొమ్మలు. అది బేరాలని ఆకర్షించే వస్తువు. అయితే దాని గురించి చెప్తూ చెప్తూ ముగింపు వచ్చేసరికి – ‘బొమ్మ బొమ్మై బతికిపోయింది / లేకుంటే వెంటపడి వేదించే కుర్ర కారుకి సమాధానం చెప్పి/ సగం చెప్పలేక/ సగం చచ్చుండేది.’ ఈ వాక్యాలు చెప్పడం ద్వారా నేడు అమ్మాయిలు మీద జరుగుతున్న వేధింపులు గురించి వ్యంగ్యంగా చెప్తున్నట్టున్న ఉన్నా అందులో ఉన్న నిజాన్ని ఒప్పుకోవాల్సిందే! నర్సిరెడ్డి కవిత్వంలో గమనించిన మరో అంశం రాయలసీమ మాటలను, పదాల్ని అవసరం ఉన్న చోట సమర్థవంతంగా ఉపయోగించగలడం, ఆ నుడికారాన్ని శక్తివంతంగా మనలోకి పంపగలడం.

ఇందులో ఉన్న ఒక స్మ ృతి కవిత సిన్నవ్వ. ఆమె జీవితాన్ని జ్ఞాపకాలని చెప్తూ చెప్తూ చివరకి ఇలా అంటాడు : ‘పుట్టింటి పట్టుచీర సినిమాను పట్టు పట్టి చూసొచ్చి/ అందులో కథానాయక కష్టాలను ఎందరికో చెప్పి ఏడ్చిన మనిషి/ తన అగచాట్లు మాత్రం ఖాళీ కడియాల్లో దాచుకొని/ గంపెడు సంతానం కడుపులో గిన్నెడు బువ్వై బతికింది/ మా సిన్నవ్వ స్వర్గానికి పోలేదు / స్వర్గమే ఆమెను ఎత్తుకుపోయింది.’ ఈ వాక్యంలో ఎత్తుకుకుపోయింది అనే మాట రాయలసీమ నుడికారం. నర్సిరెడ్డి తన కవిత్వానికి తానే హామీ పత్రం కూడా రాసుకున్నాడు.

దుక్కిలో గుంటక్కి/ మడిలో మడక్కి/ చేదబావి గిలక్కి/ జగ్గుడు కొమ్మ ఉయ్యాలకి/ ఆల్‌ ఇన్‌ వన్‌లా పనికొచ్చేలా/ మా తాత పేడిన మోకుతాడు నా కవిత్వం అని, లేత ఫైరు పొట్ట చేను గాలి రేపిన కంకులు కొట్లాట తన కవిత్వమని, ఆవు వెంట నడిచి వచ్చిన లేగదూడ తన కవిత్వం అని … ఇలా తన కవిత్వం గురించి చెప్తూనే, కవిత్వం ఏం చేయాలో చెప్పకనే చెప్తాడు. అయితే నర్సిరెడ్డి ఇంకా పాత కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని అనుసరిస్తున్నాడు. టెక్నిక్‌పరంగా ఇంకా కాస్త ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను. శిలావృక్షం అనే శీర్షిక అనంతపురానికి ప్రతీకగా వాడినట్టుగా అనిపిస్తుంది. శీర్షికలు పెట్టడంలో కూడా నర్సిరెడ్డి తనదైన పంథాన్ని అనుసరించాడు. ఈ కవితా సంపుటిని కరువు నేలపై కరుణ కురిపించిన ఫాదర్‌ విన్సెంట్‌ దంపతులకు అంకితం ఇవ్వడం మంచి విషయం.

– డాక్టర్‌ సుంకర గోపాల్‌ 94926 38547

➡️