‘అల్లూరి’ది మా ఊరు

Mar 31,2024 08:28 #Sneha, #telugu movies

తెలుగు సినిమా పరిశ్రమలో బయోపిక్‌లకు ఇటీవలకాలంలో ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ నాయకుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని, సినిమాలకు వస్తుండటంతో ప్రేక్షకాదరణ కూడా ఉంటోంది. గతంలో అల్లూరి సీతారామరాజు సినిమాలో హీరో కృష్ణ నటించి, మెప్పించారు. అయితే అల్లూరి సీతారామరాజు జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమైన ఘట్టాల్లో కొన్ని తెలియని వాస్తవిక అంశాలను భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ‘ఒక్కడే వీరుడు-అల్లూరి సీతారామరాజు’ సినిమాను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, నిర్మాత రాజా సాగి సత్యనారాయణరాజు (కుర్రపల్లి బాబు) తీశారు. ఫిబ్రవరి 4న తిరుపతిలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (ఆంధ్రప్రదేశ్‌) అవార్డుల ప్రధానం ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అసోసియేషన్‌లో జరిగింది. దేశంలోనే ఉత్తమ బయోపిక్‌గా ఈ చిత్రం ఎంపిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాశక్తి’ తో ఇలా ముచ్చటించారు.

‘మాది విశాఖజిల్లా, పద్మనాభం మండలం పాండ్రంగి. మారుమూల గ్రామం. విప్లవం పేరు చెబితే వెంటనే ఠక్కున గుర్తొచ్చేది విప్లవ వీరుడు, తెలుగుజాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు. బ్రిటీషువారిని గడగడలాడించి వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన వీరపుత్రుడు, భరతమాత ముద్దుబిడ్డ ఆయనే. ఆయన పేరు చెబితే మన్యం పులకిస్తుంది. గుండె ఉప్పొంగుతుంది. ఉరకలెత్తించే ఉత్సాహం..తెల్లదొరల పెత్తనానికి ఉత్పాదంలాంటిది ఆయన పేరు. అడుగు పిడుగై… అగ్గి పిడుగై మాట తూటాగా పేలి. తెలుగువాడి గుండెల్లో నిదురించిన పౌరుషాగ్ని. అల్లూరి విప్లవ విధానం, నినాదమై ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశం. సరిగ్గా వందేళ్ళ క్రితం ఆ విప్లవ జ్యోతి మన నుంచి దూరమైంది. 1922, ఆగస్టు 22న ప్రారంభమైన మన్యం వీరుని విప్లవపోరాటం 1924 జులై మొదటివారంతో అంతమయ్యింది. ఇంతటి ఘనచరిత్ర ఉన్న అల్లూరి జీవితాన్ని భావితరాలకు అందించటం కోసం ‘ఒక్కడే వీరుడు అల్లూరి సీతారామరాజు’ అన్న పేరుతో పూర్తి బయోపిక్‌ చిత్రాన్ని నిర్మించాము. ఆయనది మా ఊరే. అందుకే అల్లూరి జీవితానికి సంబంధించిన వాస్తవికతను ఈ చిత్రంలో పొందుపర్చాము.
మా గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు జీవితగాథ ఆధారంగా అదే గ్రామంలో నేను ఈ చిత్రాన్ని నిర్మించాను. అల్లూరి జీవిత చరిత్ర, ఆయన జీవితంలో జరిగిన సంఘనటలను వాస్తవాలకు దగ్గరగా నిర్మించే ప్రయత్నం చేశాను. అందులో విజయం సాధించాను. విశాఖపట్టణం, భీమిలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. మొత్తం 90 సీన్లతో 40 షూట్‌లలో పూర్తిచేశాం. డైరెక్టర్‌ వెంకట్‌ పంపన ఏడాది పాటు మా గ్రామంలోనే ఉండి, అల్లూరి చరిత్రను తెలుసుకున్నారు.
గతంలో అల్లూరి చుట్టూ ఎంతోమంది ఎన్నో కట్టుకథలు అల్లారు. కానీ వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం మా చిత్రం ద్వారా జరిగింది. అల్లూరి జీవితచరిత్రపై పూర్తిస్థాయిలో పరిశోధించి సన్నివేశాలు చిత్రీకరించాము. గత ఏడాది జులై 21న ‘ఒక్కడే వీరుడు (అల్లూరి సీతారామరాజు) బయోపిక్‌ విడుదలయ్యింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో బెస్ట్‌ బయోపిక్‌కు ఎంపికయ్యింది. నాకు బెస్ట్‌ బయోపిక్‌ ప్రొడ్యూసర్‌ అవార్డు ఇచ్చారు.
గతంలో నందమూరి తారక రామారావు కూడా అల్లూరి జీవిత చరిత్రను సినిమాగా తీద్దామని చరిత్ర నిపుణులు పాలా కృష్ణమూర్తిని అధ్యయనం చేయాలని కోరారు. అప్పటికే కృష్ణ నటించిన సినిమా రావటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మా బృందం కూడా కృష్ణమూర్తిని కలిసి వివరాలు తెలుసుకుంది. మొత్తం విశాఖ జిల్లాలోనే సినిమా షూటింగ్‌ పూర్తిచేశాం. అనగాదేవి మూవీస్‌ పేరుతో ఈ సినిమాను తీశాం. అల్లూరి పాత్రలో పశ్చిమగోదావరి జిల్లా ఓడూరుకు చెందిన శివవర్మ నటించారు. నేను మంపా మునసబు పాత్రలో నటించాను. ఎంవివి సత్యనారాయణ, కెకెరాజు, డాక్టర్‌ జి.శంకర్‌, మంతెన మాధవీవర్మ, అల్లూరి వంశీయుడు శ్రీరామరాజు తదితరులు నటించి, మెప్పించారు.
అయితే చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయింపు జరగలేదు. మేము భీమవరం, నరసాపురం, రాజోలు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో సినిమా ప్రదర్శించలేక పోయాం. చాలాఫోన్లు వచ్చాయి. ఆడిన చోట్ల మా చిత్ర బృందానికి మంచి పేరొచ్చింది. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో కూడా విడుదల చేయాలని చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏటేటా వర్థంతి, జయంతి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కూడా అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటుచేశాం. నేను యువజన సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రస్తుతం కంచుకనక మహాలక్ష్మి సినిమాలో ప్రొఫెసర్‌ పాత్రలో నటిస్తున్నాను. ఇప్పుడు నాలుగైదు సినిమాల్లోనూ చేస్తున్నాను.’ అని ఆయన వివరించారు.
ఏప్రిల్‌ 7న ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో విజయవాడలో రాజా సాగి సత్యనారాయణరావుకు ఉగాది పురస్కారాన్ని కూడా అందించబోతున్నారు.

– యడవల్లి శ్రీనివాసరావు

 

➡️