వైసిపిది తప్పుడు ప్రచారం – టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తప్పుడు వీడియోలు, ఆడియోలు, పోస్టులతో వైసిపి ప్రచారం చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్నా వైసిపికి బుద్ధి రాలేదని ఆదివారం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో విమర్శించారు. కొన్ని గంటల్లో పోలింగు మొదలవబోతుందని, ఇప్పుడైనా నిజాయతీగా ఉండాలనే జ్ఞానం జగన్‌కు లేదని విమర్శించారు. కుల, మతాలను రెచ్చగొట్టే వీడియోలను చేయించారని ఆరోపించారు. తాను మాట్లాడినట్లు ఫేక్‌ వీడియోలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇలాంటి ఫేక్‌ వీడియోలు కుప్పలు తెప్పలుగా జగన్‌ చేయిస్తారని, వీటిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టిడిపి కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల నేతలతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలన్నారు. పూర్తిస్థాయి అప్రమత్తతతో చివరి ఓటు పోల్‌ అయ్యేవరకు పనిచేయాలని చెప్పారు. పోలింగ్‌ శాతం పెరిగేలా పార్టీ తరపున ప్రయత్నం చేయాలని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా సౌకర్యవంతంగా ఓటు వేసే పరిస్థితిని కల్పించాలన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే అమ్మలకు పాదాభివందనం అంటూ చంద్రబాబు ట్విట్టర్‌లో మాతృ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
సజ్జల భార్గవ్‌పై చర్యలు తీసుకోవాలి : దేవినేని ఉమామహేశ్వరరావు
తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసిపి నేత సజ్జల భార్గవ్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఓడిపోతున్నామనే భయంతో జగన్‌, అతని గ్యాంగ్‌ మొత్తం దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు భార్గవ్‌ రెడ్డి మార్ఫింగ్‌ వీడియోలు చేశారని, అచ్చెన్నాయుడు పేరుతో తప్పుడు లేఖలు సృష్టించారని విమర్శించారు. ఈ దుష్ప్రచారాలను ఆపేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను కోరామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. తిరుపతిలో ఓటర్లతో ప్రమాణం చేయించిన వైసిపి నేత కేతన రామారావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు వర్ల రామయ్య లేఖలు రాశారు.

➡️