భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌

Apr 14,2024 12:19 #BR Ambedkar, #COVER STORY, #Sneha

మనదేశంలోని అనేక ముఖ్య ఘట్టాలలో, ఉద్యమాలలో నవభారత నిర్మాణం కోసం, ప్రజాస్వామ్యం కోసం, సామాజిక రుగ్మతలు లేని దేశం కోసం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చేసిన కృషి అనిర్వచనీయం.. దేశవ్యాప్తంగా పేరొందిన ఎందరెందరో ఉద్ధండులు, ప్రముఖులు ఆయన సమకాలీనులు గానూ, ప్రత్యర్థులుగాను ఉన్నారు. అంబేద్కర్‌ జీవితానుభవంలో గుర్తించిన సామాజిక రుగ్మతలు, జరిపిన ఉద్యమాలు, అధ్యయనం, ఆలోచనలను ప్రయోగాత్మకంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత సమాజం గురించి ఆయన లోతుగా పరిశీలన చేసి, లేవనెత్తిన అనేక ప్రశ్నలు నేటికీ సజీవంగా ఉన్నాయి.
అవి ఆయన కృషిని, ప్రాధాన్యతని నేటికీ గుర్తుచేస్తున్నాయి.
నేడు అంబేద్కర్‌ 134వ జయంతి సందర్భంగా ఆయన గురించిన స్ఫూర్తిదాయక విషయాలతో ఈ ప్రత్యేక కథనం..

భారత రాజ్యాంగ నిర్మాత, రాజనీతి కోవిదుడు, న్యాయశాస్త్ర పారంగతుడు, పరిపాలనాదక్షుడుగా అశేష ప్రజాభిమానాన్ని చూరగొన్న మహామనీషి డాక్టర్‌ బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌. అంబేద్కర్‌ ఒక ఆశాజ్యోతి. ఒక చైతన్య కేతనం. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వాల మేలుకలయిక ఆయన. మహర్‌ కులంలో జన్మించి, విద్యార్థి దశ నుంచే సమాజం చేత దుర్భరమైన వివక్షను, అవమానాలను ఎదుర్కొన్న అంబేద్కర్‌ గొప్ప మానవతావాది, సమతావాది, హేతువాది, స్వేచ్ఛావాది. చిన్నతనం నుంచే నిరుపేద దళిత వర్గాల సముద్ధరణే లక్ష్యంగా జీవించాడు. ఆయన ఏ వృత్తి చేపట్టినా తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. అదే సమయంలో తన రచనా వ్యాసంగాన్నీ విడువలేదు. ఉన్నత విద్య అభ్యసించిన ఆయన, తన విజ్ఞానాన్ని ఆర్థిక ప్రయోజనాలకు కాక సాంఘిక సంస్కరణలకు, సమాజానికి వినియోగించిన త్యాగశీలి. మతం పేరుతో మనుషులలో అంతరాలు నిర్మించి, వాటిని తమ స్వప్రయోజనాల కోసం వ్యవస్థలుగా మార్చిన మతోన్మాదుల సిద్ధాంతాలను ఖండించారు. సర్వమానవ సమానత్వాన్ని సహేతుకంగా నిరూపించిన సమతావాది అంబేద్కర్‌.

‘నేను మతానికి వ్యతిరేకిని కాదు. మతం పేరిట జరుగుతున్న కపట నాటకానికి మాత్రమే నేను వ్యతిరేకిని’ అంటారాయన. న్యాయవాదిగా ఆర్థిక, సాంఘిక, మత, రాజకీయ వ్యవస్థలను సమగ్రంగా సమీక్షించారు. పటిష్ట జాతీయ నిర్మాణానికి అవసరమైన సిద్ధాంతాలను రూపొందించి, వాటి సాధనకు ఉద్యమాలు నడిపిన కార్యశీలి. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం గాంధీని కూడా వ్యతిరేకించి, దళితజాతి అభ్యుదయానికి, అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన మహనీయుడు. స్వేచ్ఛ, సమత, సౌభ్రాతృత్వాల పునాదులపై రాజ్యాంగాన్ని రూపొందించారు. విద్య, ఉద్యోగ రంగాలలో స్త్రీలకు సమాన అవకాశాలు, ఆస్తులలో సమాన వాటాలు ప్రతిపాదించిన మానవతావాది. ‘మేకల్ని బలి ఇస్తారు కాని, సింహాల్ని బలివ్వరు. మీ హక్కులు నిలవాలంటే బలహీనత పనికిరాదు. నేటి మీ కష్టాలన్నీ పూర్వకర్మ ఫలితాలు కావు. అగ్రవర్ణాలు కుట్ర చేసి, మీపై రుద్దినట్టివి. మీ బానిసత్వాన్ని మీ స్వశక్తితోనే రూపుమాపుకోవాలి. దేవుళ్లు, తీర్థయాత్రలు, ప్రవక్తలు, ఉపవాసాలు, మతగ్రంథాలు వంటివేవీ మిమ్మల్ని రక్షించలేవు’ అని నిద్రాణమై వున్న అణగారిన తరగతుల వారి ఆలోచనల్ని మేల్కల్పిన చైతన్యశీలి అంబేద్కర్‌. ఆయన శత జయంతి సందర్భంగా 1991లో భారత ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ బిరుదును ప్రదానం చేసింది.

బాల్యం, చదువు..
రామ్‌జీ, భీమాబాయి దంపతుల 14 మంది సంతానంలో ఆఖరివాడు అంబేద్కర్‌. 1891 ఏప్రిల్‌ 14న మహారాష్ట్రలో ముంబయికి దగ్గరగా వుండే మోవో గ్రామంలో జన్మించాడు. అంటరానితనం తీవ్రంగా వున్న మహర్‌ కులంలో పుట్టాడు. ఆయన అసలు పేరు భీమారావు రాంజీ అంబావడేకర్‌. ఆ పేరును అంబేద్కర్‌గా మార్చారు ఆయన టీచర్‌ మహదేవ్‌ అంబేద్కర్‌. చిన్నప్పటి నుంచే కులతత్వం, అంటరానితనం యొక్క క్రూరవివక్షలకు గురైన అంబేద్కర్‌.. తన యావజ్జీవితమూ కులతత్వపు మూసలో కరిగి, అంటరానితనపు గరళాన్ని మింగుతూ.. వాటితోనే పోరాడుతూ వచ్చారు.

పుట్టుకతో అంటరానివాడు కావడంతో స్కూల్‌లో అంబేద్కర్‌ను విడిగా కూర్చోబెట్టేవారు. సహ విద్యార్థులతో తిరగడంగానీ, ఆడుకోవడానికి నోచుకోలేదు. తన నోట్‌ పుస్తకాలను టీచర్లు కూడా తాకేవారు కాదు. రామ్‌జీ సతారా వదలి పిల్లల చదువుకోసం ముంబయి చేరాడు. ఎల్‌ఫిన్‌స్టన్‌ హైస్కూల్‌లో చేరిన అంబేద్కర్‌ 1907లో మెట్రిక్యులేషన్‌ పాసయ్యాడు. ఆయన కుటుంబం దానిని కనీవినీ ఎరుగని అద్భుత సంఘటనగా భావించింది. సంస్కృతం చదువుకోవాలని ఆశించిన అంబేద్కర్‌కు కులం అడ్డొచ్చింది. ఇష్టంలేకున్నా పర్షియన్‌ భాష చదివాడు. 14వ ఏటనే తొమ్మిదేళ్ల రమాబాయితో పెళ్ళి జరిగింది. రమాబాయి అనారోగ్యంతో 1935లో మరణించారు. ఆ తర్వాత తన 56వ ఏట ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శారదా కబీర్‌ను వివాహం చేసుకున్నారు. బరోడా మహారాజు శాయాజీరావ్‌ గైక్వాడ్‌ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. పట్టభద్రుడైన తర్వాత బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ ఉన్నత విద్య అభ్యసించాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపారు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని, కొలంబియా విశ్వవిద్యాలయం చేరాడు. 1915లో ఎం.ఏ., 1917లో పి.హెచ్‌.డి. డిగ్రీలను సంపాదించారు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత ‘ది ఎవల్యూషన్‌ ఆఫ్‌ ప్రొవిన్షియల్‌ ఫైనాన్సస్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో ప్రచురించబడింది. 1917లో డాక్టర్‌ అంబేద్కర్‌గా స్వదేశం తిరిగి వచ్చారు. అప్పటికతని వయస్సు 27 ఏళ్లు.

అస్పృశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కల్గించింది. వచ్చాక మహారాజాగారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కానీ ఆఫీసులో నౌకర్లు కూడా ఆయన బల్లపై కాగితాలను ఎత్తివేసేవారు!

బలహీనవర్గాలలో చైతన్యాన్ని రగిలించి, వారికి నాయకత్వం వహించి, అంబేద్కర్‌ తన మహా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. దళిత జనాభ్యున్నతి కోసం ఆయన సాగించిన అవిశ్రాంత పోరాటానికి వెన్నుదన్నుగా భారత చరిత్ర, శ్రుతిస్మృతి పురాణాది సమస్త ప్రాచీన వాజ్మయాన్ని, అందుకు సంబంధించిన ఆధార గ్రంథాల్ని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. ఆయనొక నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం. తాను చేపట్టిన మహత్తర సంస్కరణోద్యమాన్ని శక్తిమంతంగా నడిపించారు. నిరంతరం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. అంబేద్కర్‌ కన్నా గాంధీజీ దాదాపు 22 ఏళ్లు పెద్ద అయినప్పటికీ, వీరిద్ద్దరూ దాదాపు ఒకే సమయంలో అంటే, 1917 ప్రాంతంలో భారత రాజకీయ రంగం మీదకి వచ్చారు.

కులవివక్ష..
మహారాష్ట్రలో ఛాందస బ్రాహ్మణత్వం ఏలుబడి చేసే రోజులలో కుల పీడన అతిక్రూరంగా సాగింది. అస్పృశ్యులు అత్యంత అవమానకరమైన, అమానుషమైన పీడనకు గురయ్యారు. వారు తమ మెడలకు మట్టిముంతలను కట్టుకుని, తమ వెనుక భాగాన చీపురు కట్టుకుని అగ్రవర్ణాల వారికి దూరంగా నడవాలి. అగ్రవర్ణాల వారు నడిచివెళ్లే వీధులలో అంటరానివారి ఉమ్ములతో, పాదముద్రలతో కలుషితం కాకుండా ఇటువంటి నిర్భంధాలను ప్రయోగించేవారు. అందరూ నీళ్ళు తోడుకునే బావులు, చెరువులలో వీళ్లు నీళ్లు ముట్టుకోకూడదు. దళితులు తోడితే నీరు మైలపడిపోతుంది. దేవాలయాల్లోని దేవుడ్ని చూడకూడదు. చూస్తే దేవుడు కూడా మైలపడిపోతాడు. చదువుకోకూడదు, ఆస్తులు సంపాదించుకోకూడదు. మంచి బట్టలు కట్టుకోకూడదు. చెప్పులు వేసుకోకూడదు. విలువైన ఆభరణాలు ధరించకూడదు. ఊరికి దూరంగా మురికికూపంలో పూరిపాకల్లో నివసించాలి. ఇది హిందూమతం దళితుల పట్ల వ్యవహరించిన వర్ణాశ్రమ ధర్మం తీరు. ఇది మనుధర్మం కల్పించిన దుర్గతి. అగ్రవర్ణాలు అనుసరించిన దుర్నీతి. అగ్రవర్ణాల వారు నడిపే ఏ పత్రికలోనూ ఈ వార్తలు కనిపించేవికావు. దీనిపై అంబేద్కర్‌ తీవ్రంగా స్పందించారు. దేశంలో దళితుల పట్ల జరుగుతున్న ఈ దుర్గతిని, దుర్నీతిని తన పత్రికల్లో చీల్చి చెండాడారు. 1927లో అంబేద్కర్‌ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో ”తిలక్‌ గనుక అంటరానివాడుగా పుట్టి వుంటే- ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అని ఉండడు. ‘అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు’ అని ప్రకటించి ఉండేవాడ”ని రాశారు. అంటే ఆనాడు అంబేద్కర్‌ కులతత్వాన్ని ఎంతగా అనుభవించారో అర్థమౌతుంది. ‘కులాన్ని నిర్మూలించండి. దానివలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. మన బానిసత్వానికి కారణం అదే. కులంతో ఒక జాతినీ నిర్మించలేము, ఒక నీతినీ నిర్మించలేము’ అని ఎలుగెత్తి చాటినవాడు అంబేద్కర్‌.

పీడితుల పక్షాన పాత్రికేయం..
వందేళ్ల కిందట మనదేశ పత్రికా రంగం ఎట్లా కులాధిపత్యంతో సామాజిక ఉద్యమాలను, బహుజన నాయకులను తొక్కి పెట్టిందో.. ఇవాళ దేశంలోని మీడియా.. ఆ పద్ధతినే మరింత పదునుబెట్టి ఆచరిస్తోంది. పీడితుల పక్షాన నిలబడినట్లు నటిస్తూనే మనువాద భావజాలాన్ని ప్రదర్శిస్తోంది. కింది కులాల వారికి జరగాల్సినంత మేలు జరగకుండా ఈ మీడియా ప్రతిబంధకంగా మారింది. తమ వర్గాల వారు బాగుపడాలంటే వారి సమస్యలను లేవనెత్తి, పరిష్కారం కోసం పోరాడేలా చేసే ఒక పత్రిక అవసరమని అంబేద్కర్‌ భావించారు. ఆయన ఆలోచనకు కొల్హాపూర్‌ రాజు శాహు మహరాజ్‌ సహాయం అందింది. దీంతో అంబేద్కర్‌ ముంబయిలో 1920 జనవరి 31న ‘మూక్‌ నాయక్‌’ అన్న పేరుతో పత్రిక తొలి సంచికను వెలువరించారు.

మహారాష్ట్రలో అత్యంత ఆదరణ పొందిన స్కాలర్‌ ఆర్‌.జి. భండార్కర్‌ మనవరాలు 1927లో గులాబ్‌ఖాన్‌ బషీరుద్దీన్‌ అనే విద్యావంతుణ్ణి ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. దీంతో ముంబయిలోని అన్ని పత్రికలు ఈ వివాహాన్ని ఖండిస్తూ సంపాదకీయాలు రాయగా, అంబేద్కర్‌ ఒక్కరే తాను నడిపే ‘బహిష్కృత్‌ భారత్‌’ పత్రికలో ‘వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల ఇష్టానికి సంబంధించినది. దాంట్లో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు’ అని సంపాదకీయం రాశారు.

మరో సంఘటన 1927లో అంబేద్కర్‌ ‘మహద్‌ చెరువు’ పోరాటం. మొత్తం కొంకణ్‌ మహారాష్ట్రలో రెండు, మూడు నెలలు ప్రచారం చేసి, దళితులను సంఘటితం చేశారు అంబేద్కర్‌. మహద్‌ చెరువు నీళ్ళు దళితులకు దక్కాలని, ఆ చెరువు దగ్గర ఒక టెంట్‌ వేసుకొని, నిరసన వ్యక్తం జేస్తూ అంబేద్కర్‌ సత్యాగ్రహం చేశారు. గాంధీ 1930లో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం కంటే మూడేళ్ల ముందే అంబేద్కర్‌ ‘మహద్‌ చెరువు’ సత్యాగ్రహం నిర్వహించారు. పెరియార్‌ రామస్వామి నాయకర్‌ నడిపించిన ‘రివోల్ట్‌’, జస్టిస్‌ పార్టీ తరపున నడిచిన ఇంగ్లీషు పత్రిక ‘జస్టిస్‌’, తెలుగులో ‘ఆంధ్రప్రకాశిక’, తమిళంలో ‘ద్రావిడన్‌’ అనే పత్రికలు గాంధీ భావజాలాన్ని వ్యతిరేకించాయి. అంబేద్కర్‌ నడిపిన పత్రికలు కూడా ఈ కోవలోనివే! బ్రాహ్మణేతర భావజాలాన్ని ప్రచారం చేశాయి.

ఆ తర్వాత ‘బహిష్కృత్‌ భారత్‌’, ‘సమత’, ‘జనత’, ‘ప్రబుద్ధ భారత్‌’ పత్రికలను తన నేతృత్వంలోనే అంబేద్కర్‌ నడిపించారు. ఈ పత్రికలు దళిత, బహుజన సమస్యలను వెలుగులోకి తేవడంలో ముందు వరుసలో ఉండేవి. ఎప్పటికప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పత్రికలను దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నడిపించారు. వివిధ ప్రాంతాల నుంచి ముంబయికి చదువుకోవడానికి వచ్చే దళిత విద్యార్థులకు పత్రికాఫీసులోనే ఆశ్రయం కల్పించేవారు. కాలేజ్‌ సమయం తర్వాత పత్రికలో పనిచేసే విధంగా వారికి తర్ఫీదునూ ఇచ్చేవారు. తద్వారా మహారాష్ట్రలో తొలితరం దళిత జర్నలిస్టులు తయారుకావడానికి ఆయన పునాదులు వేశారు.

మహిళలు పట్ల మర్యాద..
‘మహిళల సన్నిధిలోనే దివ్యత్వం వుంటుంది’ అంటూ మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు అంబేద్కర్‌. మహిళలు ఆరోగ్యంగా, మంచి దుస్తులతో సంతోషంగా వుండాలని ఆయన తలచేవారు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలతో పాటు సంస్థలను నడపడంలోనూ స్త్రీలు మంచి ప్రావీణ్యత సాధించాలనేవారు. సహజంగానే అడపిల్లలలో తల్లి గుణం వుంటుందని, ఉన్నతమైన నైతిక విలువలతో వుంటారని, వారిలో నేర్చుకునే గుణం పురుషుల కంటే ఎక్కువగా వుంటుందని ఆయన అభిప్రాయపడేవారు. కానీ స్త్రీలు కులం, అంటరానితనం అనే శాపం వల్ల, పేదరికం వల్ల పురుషుల కంటే దీనమైన స్థితిలోకి నెట్టబడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. వారికి కనీస హక్కులు కల్పిస్తే, స్వతంత్రంగా బతకగలరని, తమ కుటుంబాల్నీ పోషించుకోగలరని మహిళల పట్ల తన అభిప్రాయాలను అంబేద్కర్‌ పలు సందర్భాలలో స్పష్టం చేశారు. ‘ఒక దేశం బాగుందని చెప్పడానికి, ఆ దేశంలో మహిళలు ఎలా జీవిస్తున్నారు? అన్నదానిపై ఆధారపడి వుంటుంది!’ అనేవారు.
తాను సందర్శించిన అనేక దేశాల్లోని మహిళలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో వుండేవారని, తన దేశంలోనూ స్త్రీలు ఆ విధంగా ఎదిగేరోజులు ఎప్పుడు వస్తాయోనని, తదితర అంశాలు అంబేద్కర్‌ రాసిన అనేక వ్యాసాల్లో కనిపిస్తాయి.

బౌద్ధ మత స్వీకరణ..
దురదృష్టవశాత్తూ తాను హిందువుగా పుట్టినప్పటికీ, హిందువుగా మరణించాలని అనుకోవడం లేదని1936లోనే అంబేద్కర్‌ ప్రకటించారు. ‘ఏ వస్తువు రుచి అయినా మారుతుంది. కానీ, కులం అనే విషాన్ని మాత్రం అమృతంగా మార్చలేం. నువ్వు ఎక్కడకు వెళ్లినా కులం నీ వెంటపడుతుంది. దానిని నువ్వు తప్పించుకోలేవు. మతం మారిపోవడమే ఏకైక మార్గం’ అన్న అంబేద్కర్‌.. 1956, అక్టోబర్‌ 14న నాగపూర్‌లో లక్షలాది మంది అనుచరులతో బౌద్ధమతాన్ని స్వీకరించారు.
ప్రపంచ మేధావిగా, సంఘసంస్కర్తగా కీర్తిగడించిన అంబేద్కర్‌.. తన చివరి రోజులలో మధుమేహంతో బాధపడుతూ 1956, డిసెంబర్‌ 6న మరణించారు. అణగారిన వర్గాలకు ఆయన చూపిన బాట, ఆయన నింపిన స్ఫూర్తి ఎప్పటికీ ఆచరణీయం.. అనుసరణీయం.

తెలియని నిజాలు..
– విదేశాల్లో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పొందిన తొలి భారతీయుడు అంబేద్కర్‌.
– మధ్యప్రదేశ్‌, బీహార్‌ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాలను విభజించాలని 50వ దశకంలోనే చెప్పారు.
– అంబేద్కర్‌ వ్యక్తిగత గ్రంథాలయం పేరు ‘రాజ్‌గిర్‌’. అందులో 50 వేలకు పైగా పుస్తకాలు ఉంటాయి. అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ లైబ్రరీగా గుర్తింపు తెచ్చుకుంది.
– 2004లో కొలంబియా యూనివర్సిటీ తయారుచేసిన ప్రపంచంలో టాప్‌-100 స్కాలర్స్‌ జాబితాలో మొదటి పేరు డా. భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేద్కర్‌ది! ఆయన రాసిన ‘వెయిటింగ్‌ ఫర్‌ ఎ వీసా’ పుస్తకం.. కొలంబియా వర్సిటీలో ఓ టెక్స్ట్‌బుక్‌.
– అంబేద్కర్‌కు 64 సబ్జెక్ట్‌లలో మాస్టర్స్‌ డిగ్రీ ఉంది. హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, మరాఠీ, పర్షియన్‌, గుజరాతీ వంటి భాషలు ఆయనకు తెలుసు. వీటితో పాటు దాదాపు 21ఏళ్ల పాటు.. ప్రపంచంలోని అన్ని మతాల గురించి చదివారు.
– లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఎనిమిదేళ్ల కోర్సును కేవలం రెండేళ్ల, మూడు నెలల్లో పూర్తి చేశారు. ఇందుకోసం ఆయన రోజుకు 21 గంటలు చదివేవారు.
– అంబేద్కర్‌ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేశారు.
– అంబేద్కర్‌ తనతో పాటు 8,50,000 మంది అనుచరులతో బౌద్ధమతంలోకి మారారు. ప్రపంచంలోనే అతిపెద్ద మతమార్పిడి ఇదే.
– లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి ‘డాక్టర్‌ ఆఫ్‌ ఆల్‌ సైన్సెన్స్‌’ పీహెచ్‌డీ పొందిన తొలి, ఏకైక వ్యక్తి అంబేద్కర్‌.
– అంబేద్కర్‌ తొలి విగ్రహాన్ని 1950లో కొల్హాపూర్‌లో నిర్మించారు. అప్పటికి ఆయన జీవించే ఉన్నారు.

అభ్యసించిన డిగ్రీలు
బిఎ (బాంబే విశ్వవిద్యాలయం, 1912)
ఎంఎ (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915)
ఎమ్మెస్సీ (లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏకనామిక్స్‌, 1921)
పిహెచ్‌డి (కొలంబియా విశ్వవిద్యాలయం, 1917)
డీఎస్‌సి (లండన్‌ విశ్వవిద్యాలయం, 1923)
బారిష్టర్‌ ఎట్‌ లా (గ్రేస్‌ ఇన్‌ లండన్‌, 1923)
ఎల్‌ఎల్‌డి (కొలంబియా విశ్వవిద్యాలయం, 1952, గౌరవపట్టా)
డి.లిట్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా)


ఆరు ప్రముఖ రచనలు..
సమానత్వం, నిమ్నజాతుల వారి హక్కుల కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆయన జీవితాంతం పోరాడారు. భారత రాజ్యాంగాన్ని రచించిన ఆయన అద్భుతమైన రచయిత కూడా. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, మతం, కులతత్వం, వర్ణాలు, పాలన సహా అనేక అంశాలపై ఆయన పుస్తకాలు రచించారు.
1. ది అనిహిలేషన్‌ ఆఫ్‌ క్యాస్ట్‌ (The Annihilation of Caste) : అంటరాని కులాలకు చెందిన ప్రజలు, మహిళలు మతం పేరుతో అణచివేతకు గురవుతున్నారంటూ హిందుత్వాన్ని ఈ పుస్తకంలో తీవ్రంగా విమర్శించారు. కుల వ్యవస్థను అంతం చేసేందుకు కులాంతర వివాహాలు మాత్రమే సరిపోవని, మత భావనలను అంతం చేయాలని తన అభిప్రాయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
2. క్యాస్ట్స్‌ ఇన్‌ ఇండియా (Castes in India) : మానవ శాస్త్ర అంశంపై న్యూయార్క్‌లో జరిగిన సదస్సులో అంబేద్కర్‌ ప్రసంగించిన విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఉన్నత వర్గమంటూ స్వయంగా ప్రకటించుకున్న వారు.. ఇతరులు కూడా వారిని అనుసరించే విధంగా దారి తీసిన పరిస్థితులను ఈ పుస్తకంలో వివరించారు.
3. హూ వర్‌ ది శూద్రాస్‌? (Who were the Shudras) : వర్ణ వ్యవస్థలో అట్టడుగు కులంగా భావించే శూద్రుల మూలాన్ని వెలుగులోకి తెచ్చేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఈ పుస్తకం రచించారు. వేదాలు, భారతీయ గ్రంథాలు, మహా భారతం ఆధారంగా చేసుకొని, ఈ పుస్తకాన్ని అంబేద్కర్‌ రాశారు.
4. రిడిల్స్‌ ఇన్‌ హిందూయిజమ్‌ (Riddles in Hinduism): వేదాలకు ఉన్న అతీత అధికారాలను ఈ పుస్తకంలో నిలదీశారు. బ్రాహ్మణులకు స్వప్రయోజనాలను కల్పించేందుకే ఈ వేదాలు ఏర్పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. మతానికి సంబంధించిన అనేక ప్రశ్నలను ఆయన లేవనెత్తారు.
5. ది ప్రాబ్లమ్‌ ఆఫ్‌ రూపీ: ఇట్స్‌ ఆరిజిన్‌ అండ్‌ ఇట్స్‌ సొల్యూషన్‌  (The Problem of Rupee : Its Origin and Its Solution) : లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో తన డాక్టోరల్‌ థీసిస్‌గా ఈ పత్రాలను అంబేద్కర్‌ సమర్పించారు. ఇదే పుస్తకంగా ప్రచురితమైంది. భారతీయ రాజుల కాలం నుంచి 20వ శతాబ్దం వరకు రూపాయి పరిణామ క్రమాన్ని ఈ పరిశోధనలో అంబేద్కర్‌ వివరించారు.
6. ది బుద్ధ అండ్‌ హిజ్‌ ధమ్మ (The Buddha and his Dhamma): బౌద్ధ మత సిద్ధాంతాన్ని ఈ పుస్తకంలో విశ్లేషించారు. ఇది అంబేద్కర్‌ చివరి రచన.

రాజాబాబు కంచర్ల
9490099231

➡️