అరవిందం బాలానందం

Jan 7,2024 10:37 #chirumuvallu, #Sneha

బాలానందం అనే పేరుతో తరగతి వారీగా జరిగే సాంస్కృతిక కార్యక్రమం కుంచనపల్లిలోని అరవింద స్కూల్లో పెద్ద పాత్రే వహిస్తుంది. ఫోటోలు, అవార్డులు కాకుండా ఆయా పిల్లల ఆసక్తులను బట్టి మంచి పాటలు, నాటకాలు, నృత్యాలు ప్రదర్శిస్తారు. రోజు వారీ అసెంబ్లీ కార్యక్రమాలకు పొడిగింపుగా ఈ బాలానంద కార్యక్రమాలుంటాయి. డ్రెస్సులు, మేకప్‌ ఆర్టిస్ట్‌లు, ఆకర్షణీయమైన డెకరేషన్స్‌, ఆడంబరాలను తగ్గించి పిల్లలు తమ ఆర్ట్‌ క్లాసుల్లో తయారు చేసుకున్న వస్తువులను స్టేజి అలంకరణకు, కిరీటాలు, కత్తులు, వడ్డాణాలు లాంటి ఆభరణాలను వాడతారు. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను ఇతిహాస కథలను, డ్రామాలుగా, నృత్య నాటికలుగా ప్రదర్శిస్తారు. ప్రతి బాలానందంలో పర్యావరణ పరిరక్షణ గురించి కార్యక్రమం తప్పనిసరి.

ఫ్లెక్సీలు లాంటి భూమిలో కలవని వస్తువులు వాడకూడదని ఒక నియమం స్కూలుకి వుంది. దాంతో ప్లాస్టిక్‌ గ్లాసులు, కప్పులు, స్పూన్లులకు ప్రత్యామ్నాయంగా ఆకు కప్పులు, తాటి ఆకు స్పూన్లు, స్టీల్‌ గ్లాసులు తల్లిదండ్రులకు, ఆయా విద్యార్థులకు ముడి బియ్యంతో ఏదో ఒక రైస్‌ పదార్థం, రాగి మాల్ట్‌ ఇవ్వడం జరుగుతుంది. ఆయా తరగతుల తల్లిదండ్రులకే ఆహ్వానం కాబట్టి వారి పిల్లలను కనులారా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఒక్కో రోజు ఓ విద్యావేత్త అతిథిగా వస్తారు. ఆరు, ఆ పై తరగతి పిల్లలు.. బాలానందానికి ఒక్కో తరగతి వారు సమీక్ష రాస్తారు. ఇదంతా విద్యలో భాగంగానే అరవింద సంస్థ నిర్వాహకులు భావిస్తారు. చివరికి అమ్మానాన్నలు కూడా సమీక్షలు రాసి పంపాలి. పిల్లలు వేసిన రకరకాల చిత్రాలను, ఫుడ్‌ పెయింటింగ్స్‌, పాట్‌ పెయింటింగ్స్‌, కథల పుస్తకాలు తదితరాలను అందుబాటులో ఉంచుతారు. టీచర్లు, విద్యార్థులు తల్లిదండ్రులకి మంచి అనుభవాలను, జ్ఞాపకాలను మిగిల్చే ఈ బాలానందం స్కూలు విద్యా ప్రణాళికలో మిళితమై ఉంటుంది.

➡️