పుట్టగొడుగులు.. పుట్టెడు లాభాలు..

Jun 30,2024 10:57 #ruchi, #Sneha

తొలకరి పడగానే గ్రామాల్లో పొలాలు, పాముపుట్టల దగ్గర పుట్టగొడుగుల (మష్రూమ్స్‌) కోసం వెతుకులాట ప్రారంభమవుతుంది. ఇప్పుడు అలాకాక పుట్టగొడుగుల పెంపకంతో అన్నిచోట్లా, అన్నివేళలా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. పుట్టగొడుగుల్లో పోషకాలతో అనేక లాభాలున్నాయి. పిల్లలకు, పెద్దలకు, శాకాహారులకు, మాంసాహారులకు అందరికీ అనుకూలమైన ఆహారం. వీటిని తరచుగా తింటుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఇంత ఉపయోగకారిని కూరగానే కాక కొత్త రుచులతో ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.

కబాబ్స్‌..


కావలసినవి : పుట్ట గొడుగులు – 1/4 కేజీ, కార్న్‌ఫ్లోర్‌ – 2 స్పూన్లు, మైదా- స్పూను, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి పేస్ట్‌ – స్పూను, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- స్పూను, ధనియాల పొడి- స్పూను, జీలకర్ర పొడి – స్పూను, కసూరి మేతీ – స్పూను, పసుపు- 1/4 స్పూను
తయారీ : ముందుగా ఒక వెడల్పు గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, మైదా, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కసూరి మేతీ, పసుపు వేసి నీళ్ళతో పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీనిలో పుట్టగొడుగు ముక్కలు వేసి బాగా కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.
తర్వాత బాండీలో నూనె వేడిచేసి డీప్‌ఫ్రై చేయాలి. నాలుగు పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు అదే నూనెలో వేయించి, కబాబ్స్‌పై గార్నిష్‌ చేస్తే కంటికింపుగా, నోటికి రుచిగా భలే ఉంటాయి.

పాలక్‌-గార్లిక్‌..


కావలసినవి : పుట్టగొడుగులు – 1/4 కేజీ, పాలకూర -1/4 కేజీ, ఉప్పు – తగినంత, కారం- స్పూను, వేయించిన జీలకర్ర పొడి- 1/2 స్పూను, గరం మసాలా – 1/2 స్పూను, పచ్చిమిర్చి -3, పంచదార – స్పూను, ఉల్లిపాయ- ఒకటి,
తాలింపు : నూనె – 1/4 కప్పు, వెల్లుల్లి – 10, ఎండుమిర్చి – 2, జీలకర్ర – స్పూను,
తయారీ : ముందుగా మరిగే నీళ్ళలో పాలకూర, పచ్చిమిర్చి, పంచదార, కొంచెం ఉప్పు వేయాలి. నీళ్ళు మూడు పొంగులు రాగానే పాలకూరను తీసి చల్లని నీటిలో వేయాలి. శుభ్రం చేసుకుని కట్‌చేసుకున్న పుట్టగొడుగు ముక్కల్ని కూడా మరిగే నీటిలో రెండు నిమిషాలే ఉడికించి చన్నీటిలో వేయాలి. చల్లారిన పాలకూరను కొంచెం నీటిని చేర్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
బాండీలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి దోరగా వేయించాలి. తర్వాత ఉల్లి పాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి దోరగా వేయించాలి. మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్‌ వేసి మూతపెట్టి, నూనె పైకి తేలేంతవరకూ ఉడికించాలి. కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. దీనిలో చిన్నగ్లాసు నీళ్ళు పోసి ఒక ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు చల్లనీళ్ళలో వేసిన పుట్టగొడుగుల్ని ఈ పాలకూర మిశ్రమంలో వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా రెండు స్పూన్లు నెయ్యి వేడిచేసి ఒక ఎండుమిర్చి, స్పూను వెల్లుల్లి తరుగు దోరగా వేయించి, కూరకు కలపాలి. అంతే ఘుమఘుమలాడే పాలక్‌-గార్లిక్‌ పుట్టగొడుగుల కూర రెడీ. ఇది రోటీ, చపాతీ, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

బిర్యానీ..


కావలసినవి : బియ్యం-1/4 కేజీ, పుట్టగొడుగులు-1/4 కేజీ, నెయ్యి/నూనె-1/4 కప్పు, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాసపువ్వు-ఒకటి, యాలుకలు-3, లవంగ మొగ్గలు-4, దాల్చినచెక్క -అంగుళం, బిర్యానీ ఆకులు-2, షాజీరా – స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – స్పూను, ఉల్లిపాయ -ఒకటి, పచ్చిమిర్చి – 4, టమాటా – ఒకటి, కొత్తిమీర, పుదీనా తరుగు -2 స్పూన్లు, గరం మసాలా- స్పూను, ఉప్పు – తగినంత, కారం – స్పూను, పెరుగు -1/4 కప్పు
తయారీ : కుక్కర్‌లో నెయ్యి వేడి చేసి అనాసపువ్వు, జాపత్రి, యాలుకలు, లవంగ, దాల్చినచెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, షాజీరా వేసి దోరగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. దీనిలో టమాటా ప్యూరీ వేసి రెండు నిమిషాలు ఉడికించి, పెరుగు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. దీనిలో శుభ్రం చేసిన పుట్టగొడుగు ముక్కలు వేసి నూనె పైకి తేలేంతవరకూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించి, రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి. నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి సమంగా కలిపి కుక్కర్‌ మూతపెట్టి మీడియం ఫ్లేం మీద మూడు విజిల్స్‌ రానివ్వాలి. అంతే యమ్మీయమ్మీ పుట్టగొడుగుల బిర్యానీ రెడీ.

➡️